Share News

కర్మఫల త్యాగం

ABN , Publish Date - Apr 19 , 2024 | 05:40 AM

జీవితంలో ఎన్నో కష్టసుఖాలు, ఎత్తుపల్లాలు ఎదురవుతాయి. వాటిని మనం ఎలా తట్టుకోగలమనేదే ప్రధానం. మనం చేసే కర్మలు, ఇతరుల కర్మలు మనకు సంతోషాన్నో లేదా దుఃఖాన్నో ఇస్తాయనే...

కర్మఫల త్యాగం

గీతాసారం

జీవితంలో ఎన్నో కష్టసుఖాలు, ఎత్తుపల్లాలు ఎదురవుతాయి. వాటిని మనం ఎలా తట్టుకోగలమనేదే ప్రధానం. మనం చేసే కర్మలు, ఇతరుల కర్మలు మనకు సంతోషాన్నో లేదా దుఃఖాన్నో ఇస్తాయనే భ్రమలో ఉంటాం. కాబట్టి దుర్భరమైన దశలో ఉన్నప్పుడు... నిరాశ చెందడం, కర్మలను త్యజించడం వైపు మొగ్గు చూపడం సహజం. అర్జునుడు కూడా అదే సందిగ్ధంలో ఉన్నాడు. ‘యుద్ధంలో పోరాడడం’ అనే తన కర్మను వదులుకోవాలని అనుకుంటున్నాడు.

‘‘ఎవరైతే తమ క్రియల ద్వారా వచ్చే ఫలితాల మీద (కర్మ ఫలం మీద) ఆధారపడకుండా తన విద్యుక్త ధర్మాన్ని ఆచరిస్తారో వారే సన్యాసులు, యోగులు. వారు త్యజించేది కర్మఫలాన్ని తప్ప కర్మను కాదు’’ అని శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు. విద్యుక్త ధర్మం లేదా నిర్దేశిత ధర్మం అనే మాటను వివరిస్తున్న కొద్దీ గందరగోళం పెరుగుతుంది, ఎందుకంటే అది పూర్తిగా ప్రయోగాత్మకమైనది. ఈతను నేర్చుకోవాలనుకొనేవారు నీటిలోకి దూకాలి. అదే విధంగా విద్యుక్త ధర్మాన్ని లేదా విధిని గురించి అర్థం చేసుకోవాలంటే... ఇంద్రియాల సహాయం లేకుండా ఆనందంగా ఉండాలి.

విత్తనానికి పైన ఉండే పొర... లోపల ఉన్న అంకురాన్ని కాపాడుతుంది, తగిన పరిస్థితుల్లో అది మొలకెత్తడానికి దారి ఇస్తుంది. ఇది మనకు చాలా సహజంగా కనిపిస్తుంది కానీ... ఆ పొర దృక్పథం నుంచి చూసినప్పుడు ఇది గందరగోళంగా ఉంటుంది. ఎందుకంటే అంకురాన్ని మొదట అది కాపాడుతుంది, ఆ తరువాత విడిచిపెడుతుంది. అదే విధంగా గతం తాలూకు భారం, భవిష్యత్తుకు సంబంధించిన అంచనాలు లేకుండా... శక్తిమంతమైన ప్రస్తుత క్షణం మనకు ప్రసాదించిన కర్మను నిర్వహించడమే విద్యుక్త ధర్మం లేదా విధి. సన్యాసి కర్మఫలాన్ని త్యజిస్తాడు తప్ప కర్మను కాదని శ్రీకృష్ణుడు చెప్పాడు. ‘పూర్తిగా కర్మను మానేస్తే బాధ ఉండదు, పాపం ఉండదు’ అనే భావనలో ఉంటాం. ‘కర్మ చెయ్యాలి, కర్మ ఫలం గురించి ఆలోచన వదిలెయ్యాలి’ అనే శ్రీకృష్ణుడి సూచన ఆ భావనను పటాపంచలు చేస్తుంది. ఆయన సూచనను మనం అనుసరిస్తే... పలాయనవాదాన్ని ఆశ్రయించకుండా మనలో ప్రతి ఒక్కరికీ సన్యాసి అయ్యే అర్హత కలుగుతుంది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ, ఒక వ్యక్తి కర్మ ఫలాన్ని వదులుకున్నప్పుడు... ఆ క్షణంలో అతను సన్యాసికి లభించే ఆనందానికి అర్హుడవుతాడు.

కె. శివప్రసాద్‌

ఐఎఎస్‌

Updated Date - Apr 19 , 2024 | 05:41 AM