Share News

అఖండ విజయం వైర్యాగ చింతన!

ABN , Publish Date - Apr 24 , 2024 | 01:10 AM

అనగనగా ఓ రాజ్యం. ఆ రాజ్యంలో ఓ పేద వ్యక్తి ఉండేవాడు. అతనికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. పేరుకు పేదవాడే కానీ గట్టివాడు.

అఖండ విజయం వైర్యాగ చింతన!

అనగనగా ఓ రాజ్యం. ఆ రాజ్యంలో ఓ పేద వ్యక్తి ఉండేవాడు. అతనికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. పేరుకు పేదవాడే కానీ గట్టివాడు. దైవభక్తి కలవాడు. అనుకున్నది చేయాలనుకునే కసి ఉన్నోడు. అతనికి ఉండే యావత్‌ ఆస్తి పార. ఆ పారతో మడులు తవ్వి, కూరగాయల పంటలు పండించేవాడు. ఆ కూరగాయలను అమ్మగా వచ్చిన డబ్బుతో పొట్ట పోసుకునేవాడు.

ఒకసారి కూరగాయలు అమ్మాడు. ఇంటికి వస్తోంటే వైరాగ్యం కలిగింది. దీంతో ఆ పారను పొలంలో పాతి పెట్టి వైరాగ్యంతో అడవులకు వెళ్లిపోయాడు. తపస్సు చేసుకున్నాడు. కొన్నాళ్లకు మళ్లీ వచ్చాడు. కూరగాయలు పండించి మళ్లీ బతకటం ఆరంభించాడు. అలా ప్రతి సారి ఆ పేదవాడికి వైరాగ్యం కలిగేది. అడవులకు వెళ్లి తపస్సు చేసుకునేవాడు. వెళ్లిన ప్రతి సారి పారను పూడ్చి పెట్టేవాడు. అది అతి రహస్యమైన మనుషులు తిరగని ప్రాంతంలో పూడ్చిపెట్టేవాడు.

అలా ఆరుసార్లు పారను పూడ్చిపెట్టాడు. ఆరుసార్లు తపస్సు చేసుకున్నాడు. ఈ పార వల్లనే తన ఆధ్యాత్మిక చింతన తగ్గుతోందని లేకుంటే బాగా ఉండేవానినని.. ఈ పాటికి తపస్సులో కూడా మోక్షం పొందేవాడినని.. ఇలా ఏదేదో అనుకున్నాడు. రహస్యంగా పూడ్చిన పారను తీసుకున్నాడు. ఒక గుట్ట ఎక్కాడు. ఆ పారను పైనుంచి విసిరివేసాడు. అది ఎక్కడ పడుతుందో తెలీకూడదని కళ్లు కూడా మూసుకున్నాడు. ఎంతో ఆనందంతో చిందులేశాడు.

అఖండ విజయం సాధించానని గట్టిగా నవ్వుతున్నాడు. పేదవాడి ముఖం వెలిగిపోతోంది. అదే సమయంలోనే రాజుగారు శతృవులను చండాడి ఇంటికి వస్తున్నాడు. ఆ సమయంలో పేదవాడి నవ్వులు వినపడ్డాయి. ఇది అఖండ విజయం అనే మాట వినపడింది. సైనికులను పంపి వాడిని పట్టుకురండి అన్నాడు. పారపోయిన ఆనందంతో అసలే పారవశ్య ఆనందంలో ఉన్న పేదవాడిని చూసి రాజు అసూయపడ్డాడు. ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నావు? నేను విజయం సాధించినా ఆనందం లేదే? అన్నాడు రాజుగారు. పేదవాడు విషయం అంతా చెప్పాడు. పేదవాడి కథ బాగా అనిపించింది. పేదవాడికి బంగారు నాణేలు ఇవ్వండి అన్నాడు. అతను తీసుకోవటానికి వొప్పుకోలేదు.

పేదవాడు ఇంటి దారి పడ్డాడు. ఎక్కడికి? అని అడిగాడు. ‘హిమాలయాలకు తపస్సు చేసుకోవటానికి’ అన్నాడు. ‘నేనూ నీతో వస్తా పదా’ అంటూ ఆ పేదవాడి వెంటనే రాజుగారు వెళ్లిపోయాడు. ఈ చోద్యం చూసి అక్కడి రాజు పరివారం ఆశ్చర్యపోయారు. వైరాగ్య చింతనతో పేదవాడు- రాజుగారు ఆనందంగా హిమాలయాలకు వెళ్లిపోయారు.

Updated Date - Apr 24 , 2024 | 04:42 AM