Share News

భళిరా..బట్లర్‌

ABN , Publish Date - Apr 17 , 2024 | 02:00 AM

ఐపీఎల్‌ తాజా సీజన్‌లో మరో అదిరిపోయే మ్యాచ్‌. 224 పరుగుల భారీ ఛేదనలో వరుసగా వికెట్లు నేలకూలుతున్నా.. ఓపెనర్‌ జోష్‌ బట్లర్‌ (60 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 107 నాటౌట్‌) వీరోచిత పోరాటం...

భళిరా..బట్లర్‌

నేటి మ్యాచ్‌

గుజరాత్‌X ఢిల్లీ, రాత్రి, 7.30 గం.

సూపర్‌ సెంచరీతో సత్తా చాటిన జోష్‌

కోల్‌కతాకు నిరాశ

నరైన్‌ శతకం వృధా

224 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన రాజస్థాన్‌

కోల్‌కతా: ఐపీఎల్‌ తాజా సీజన్‌లో మరో అదిరిపోయే మ్యాచ్‌. 224 పరుగుల భారీ ఛేదనలో వరుసగా వికెట్లు నేలకూలుతున్నా.. ఓపెనర్‌ జోష్‌ బట్లర్‌ (60 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 107 నాటౌట్‌) వీరోచిత పోరాటం అబ్బురపరిచింది. ఒంట్లో నిస్సత్తువ ఆవరిస్తున్నా.. తుదికంటా నిలిచి, టెయిలెండర్ల అండతోనే అసాధ్యమనుకున్న విజయాన్ని రాజస్థాన్‌ రాయల్స్‌ ఖాతాలో వేశాడు బట్లర్‌. దీంతో ఈడెన్‌ గార్డెన్స్‌లో హ్యాట్రిక్‌ గెలుపు ఖాయమనుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ షాక్‌లో మునిగింది. 2 వికెట్ల తేడాతో గెలిచిన ఆర్‌ఆర్‌ పట్టికలో అగ్రస్థానాన్ని పటిష్టం చేసుకుంది. అటు టీ20 కెరీర్‌లో తొలి సెంచరీ సాధించిన సునీల్‌ నరైన్‌ (56 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్సర్లతో 109) షో వృధా అయ్యింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా కోల్‌కతా 20 ఓవర్లలో 6 వికెట్లకు 223 పరుగులు చేసింది. రఘువంశీ (18 బంతుల్లో 5 ఫోర్లతో 30) రాణించాడు. అవేశ్‌, కుల్దీప్‌ సేన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో రాజస్థాన్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 224 పరుగులు చేసి నెగ్గింది. రియాన్‌ పరాగ్‌ (14 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 34), పోవెల్‌ (13 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్సర్లతో 26) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. నరైన్‌, వరుణ్‌, హర్షిత్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా బట్లర్‌ నిలిచాడు.

ఆఖర్లో మలుపు: భారీ ఛేదనలో రాజస్థాన్‌ అదరగొడుతూ కేకేఆర్‌కు మించిన వేగంతో ఇన్నింగ్స్‌ ఆరంభమైంది. అయితే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన వేళ ఓటమి ఖాయమనిపించింది. కానీ పట్టువదలని బట్లర్‌ మాత్రం ఆఖరి వరకు పోరాడి గెలిపించగా, పరాగ్‌ సహకరించాడు. ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో జైస్వాల్‌ (19) రెండో ఓవర్‌లోనే వెనుదిరిగినా మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో మెరిశాడు. ఇక కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (12) స్వల్ప స్కోరుకే ఐదో ఓవర్‌లో వెనుదిరిగాడు. అయితే ఆరో ఓవర్‌లో రియాన్‌ 4,6,4.. బట్లర్‌ సిక్సర్‌తో 23 పరుగులు రావడంతో పవర్‌ప్లేలో ఆర్‌ఆర్‌ 76/2 స్కోరుతో పటిష్టంగా కనిపించింది. అలాగే మరో 6,4తో జోరు చూపిన పరాగ్‌ను హర్షిత్‌ అవుట్‌ చేయడంతో మూడో వికెట్‌కు 50 పరుగుల మెరుపు భాగస్వామ్యం ముగిసింది. పరాగ్‌ ఉన్నంత సేపు విజయం వైపు సాగిన జట్టు ఆ తర్వాత లయ తప్పింది. ధ్రువ్‌ జురెల్‌ (2) ఇలా వచ్చి అలా వెళ్లాడు. 8.2 ఓవర్లలోనే వంద పరుగులు సాధించిన వేళ బాధ్యతంతా బట్లర్‌పై పడింది. అటు అశ్విన్‌ (8), హిట్టర్‌ హెట్‌మయెర్‌ (0)లను రెండు బంతుల్లోనే స్పిన్నర్‌ వరుణ్‌ పెవిలియన్‌కు చేర్చాడు. పరుగులు నెమ్మదించిన వేళ 15వ ఓవర్‌లో బట్లర్‌ నాలుగు ఫోర్లతో 17 రన్స్‌ అందించాడు. అయినా 11-15 ఓవర్ల మధ్య 36 పరుగులే రావడంతో ఒత్తిడి పెరిగింది. ఈ దశలో పావెల్‌ వరుసగా 4,6,6తో వణికించినా నరైన్‌కు చిక్కాడు. కానీ 19వ ఓవర్‌లో బట్లర్‌ 6,4,6తో ఒక్కసారిగా రాయల్స్‌ పోటీలోకొచ్చింది. ఇక 6 బంతుల్లో 9 పరుగులు కావాల్సిన వేళ బట్లర్‌ తొలి బంతినే సిక్సర్‌గా మలవగా, సింగిల్స్‌ వద్దనుకోవడంతో సమీకరణం 3 బంతుల్లో 3 రన్స్‌కు మారింది. కానీ టెన్షన్‌ లేకుండా చివరి రెండు బంతుల్లో కావాల్సిన పరుగులు పూర్తి చేసిన బట్లర్‌ మ్యాచ్‌ను ముగించాడు.

నరైన్‌ శతక బాదుడు: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ నరైన్‌ మరోసారి విశ్వరూపం చూపాడు. బౌలర్‌ ఎవరైనా మైదానం నలువైపులా చక్కటి షాట్లతో ఆకట్టుకుంటూ జట్టుకు భారీ స్కోరందించాడు. అతడికి యువ బ్యాటర్‌ రఘువంశీ చక్కగా సహకరించాడు. అయితే తొలి నాలుగు ఓవర్లలో రాజస్థాన్‌ బౌలర్లు ప్రభావం చూపడంతో 26 పరుగులే రాగా, మరో ఓపెనర్‌ సాల్ట్‌ (10) వికెట్‌ను సైతం కోల్పోయింది. కానీ ఐదో ఓవర్‌లో రఘువంశీ మూడు ఫోర్లతో 14 పరుగులు రాబట్టి పరుగుల వేగానికి తెర లేపాడు. దీన్ని నరైన్‌ కొనసాగిస్తూ తర్వాతి ఓవర్‌లోనే 6,4తో 16 రన్స్‌ సమకూర్చడంతో పవర్‌ప్లేలో కేకేఆర్‌ స్కోరు 56/1కి చేరుకుంది. ఇక ఆ తర్వాత నరైన్‌ దూకుడు మరింతగా పెరిగింది. ప్రతీ బౌలర్‌ను బాదేస్తూ సునాయాసంగా బౌండరీలు రాబట్టడంతో ఓవర్‌కు పది రన్‌రేట్‌తో స్కోరు దూసుకెళ్లింది. అటు 29 బంతుల్లోనే సునీల్‌ ఫిఫ్టీ కూడా పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరి ఆటతీరుకు పది ఓవర్లలోనే జట్టు స్కోరు వందకి చేరింది. అయితే 11వ ఓవర్‌లో రఘువంశీని కుల్దీప్‌ సేన్‌ అవుట్‌ చేయడంతో రెండో వికెట్‌కు 43 బంతుల్లో 85 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అటు నరైన్‌ మాత్రం 12వ ఓవర్‌లో 6,4,4తో చెలరేగాడు. కెప్టెన్‌ శ్రేయాస్‌ (11)ను స్పిన్నర్‌ చాహల్‌ ఎల్బీ చేయడంతో హిట్టింగ్‌ కోసం రస్సెల్‌ను ముందుగానే బరిలోకి దించారు. అయితే అతను షాట్లు ఆడడంలో ఇబ్బంది పడ్డాడు. మరో ఎండ్‌లో నరైన్‌ బ్యాట్‌కు పనిచెబుతూ 16వ ఓవర్‌లో వరుసగా 6,4,6,4 బాదగా 49 బంతుల్లోనే తొలి శతకాన్ని అందుకున్నాడు. డెత్‌ ఓవర్లలో ఆర్‌ఆర్‌ బౌలర్లు చకచకా వికెట్లు తీసి ఫర్వాలేదనిపించారు. 17వ ఓవర్‌లో రస్సెల్‌ను అవేశ్‌, ఆ తర్వాతి ఓవర్‌లో పేసర్‌ బౌల్ట్‌ చక్కటి యార్కర్‌తో నరైన్‌ను బౌల్డ్‌ చేశాడు. కానీ 19వ ఓవర్‌లో రింకూ (9 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లతో 20 నాటౌట్‌) 6,4.. వెంకటేశ్‌ (8) ఫోర్‌తో 16 రన్స్‌ వచ్చాయి. ఆఖరి ఓవర్‌లో వెంకటేశ్‌ అవుట్‌ కాగా, కోల్‌కతా తొమ్మిది రన్స్‌తోనే సంతృప్తి చెందింది.

స్కోరుబోర్డు

కోల్‌కతా: సాల్ట్‌ (సి అండ్‌ బి) అవేశ్‌ 10, నరైన్‌ (బి) బౌల్ట్‌ 109, రఘువంశీ (సి) అశ్విన్‌ (బి) కుల్దీప్‌ సేన్‌ 30, శ్రేయాస్‌ (ఎల్బీ) చాహల్‌ 11, రస్సెల్‌ (సి) జురెల్‌ (బి) అవేశ్‌ 13, రింకూ (నాటౌట్‌) 20, వెంకటేశ్‌ (సి) జురెల్‌ (బి) కుల్దీప్‌ సేన్‌ 8, రమణ్‌దీప్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 21; మొత్తం: 20 ఓవర్లలో 223/6; వికెట్ల పతనం: 1-21, 2-106, 3-133, 4-184, 5-195, 6-215; బౌలింగ్‌: బౌల్ట్‌: 4-0-31-1, అవేశ్‌ ఖాన్‌ 4-0-35-2, కుల్దీప్‌ సేన్‌ 4-0-46-2, చాహల్‌ 4-0-54-1, అశ్విన్‌ 4-0-49-0.

రాజస్థాన్‌: జైస్వాల్‌ (సి) వెంకటేశ్‌ (బి) అరోరా 19, బట్లర్‌ (నాటౌట్‌) 107, శాంసన్‌ (సి) నరైన్‌ (బి) హర్షిత్‌ 12, రియాన్‌ (సి) రస్సెల్‌ (బి) హర్షిత్‌ 34, ధ్రువ్‌ జురెల్‌ (ఎల్బీ) నరైన్‌ 2, అశ్విన్‌ (సి) రఘువంశీ (బి) వరుణ్‌ 8, హెట్‌మయెర్‌ (సి) శ్రేయాస్‌ (బి) వరుణ్‌ 0, పావెల్‌ (ఎల్బీ) నరైన్‌ 26, బౌల్ట్‌ (రనౌట్‌) 0, అవేశ్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 16; మొత్తం: 20 ఓవర్లలో 224/8; వికెట్ల పతనం: 1-22, 2-47, 3-97, 4-100, 5-121, 6-121, 7-178, 8-186; బౌలింగ్‌: స్టార్క్‌ 4-0-50-0, వైభవ్‌ అరోరా 3-0-45-1, హర్షిత్‌ 4-0-45-2, నరైన్‌ 4-0-30-2, వరుణ్‌ 4-0-36-2, రస్సెల్‌ 1-0-17-0.

నరైన్‌కు ఇది టీ20 కెరీర్‌లోనే తొలి సెంచరీ

జోష్‌ బట్లర్‌ (60 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 107 నాటౌట్‌)

7

బట్లర్‌కిది ఓవరాల్‌గా ఏడో ఐపీఎల్‌ సెంచరీ. ఈ సీజన్‌లో రెండోది.

Updated Date - Apr 17 , 2024 | 02:00 AM