Share News

ప్రచార రథాలకు గూగుల్‌ మ్యాపింగ్‌!

ABN , Publish Date - Apr 26 , 2024 | 05:53 AM

వివిధ పార్టీల ప్రచార రథాలు ఆయా లోక్‌సభ నియోజకవర్గ పరిఽధి/హద్దులు దాటకుండా ఉండేందుకు అభ్యర్థులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. తమ ప్రచార రథాలకు గూగుల్‌ మ్యాపింగ్‌ చేసుకుంటున్నారు. తద్వారా నియోజకవర్గాల హద్దుల విషయంలో గందరగోళం వీడి స్పష్టతతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కూకట్‌పల్లి

ప్రచార రథాలకు గూగుల్‌ మ్యాపింగ్‌!

నిర్ణీత ప్రాంతాల్లో తిరిగేలా సాంకేతికత

అయినా పరిధులు దాటుతోన్న వైనం

హైదరాబాద్‌లో పక్కపక్క ప్రాంతాలు వేర్వేరు లోక్‌సభ నియోజక వర్గాల్లో

అయోమయానికి గురవుతున్న డ్రైవర్లు

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): వివిధ పార్టీల ప్రచార రథాలు ఆయా లోక్‌సభ నియోజకవర్గ పరిఽధి/హద్దులు దాటకుండా ఉండేందుకు అభ్యర్థులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. తమ ప్రచార రథాలకు గూగుల్‌ మ్యాపింగ్‌ చేసుకుంటున్నారు. తద్వారా నియోజకవర్గాల హద్దుల విషయంలో గందరగోళం వీడి స్పష్టతతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కూకట్‌పల్లి శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏరియా మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం, శేరిలింగంపల్లి పరిధిలోని ప్రాంతం చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం కిందకు వస్తుంది. బోయిన్‌పల్లిలో అంబేడ్కర్‌ విగ్రహం ఒక వైపు ప్రాంతం సికింద్రాబాద్‌ లోక్‌సభ, మరోవైపు ఏరియా మల్కాజ్‌గిరి లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలో ఉంటుంది. ఇలా.. పక్కపక్కనే కాలనీలు, బస్తీలు ఉండే మహానగరంలో లోక్‌సభ సెగ్మెంట్‌ హద్దుల విషయంలో అయోమయం నెలకొంది. అయితే, సమగ్ర పరిశీలన అనంతరం అభ్యర్థులు, ఓటర్లు ఓ అవగాహనకు వస్తున్నా.. ప్రచార రథాల ప్రచారం మాత్రం దారి తప్పుతోంది. ఈ ఇబ్బందులకు చెక్‌ పెట్టేలా పలువురు అభ్యర్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఏ ప్రచార రథం ఎక్కడ పర్యటించాలనేది గూగుల్‌ మ్యాపింగ్‌ చేసుకుంటున్నారు. దీంతో ప్రచార రథాలు ఇతర నియోజకవర్గాలకు వెళ్లకుండా నియంత్రించడంతోపాటు.. సొంత నియోజకవర్గంలోనే ఓ ప్రచారం రథం తిరిగిన చోట మరొకటి తిరగకుండా ఉంటుందన్నది వారి ఆలోచన. పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో కవరయ్యేలా గూగుల్‌ మ్యాపింగ్‌ చేసినట్టు చేవేళ్ల అభ్యర్థి ఒకరు తెలిపారు. రెండు, మూడు రోజులకోమారు ప్రతి ప్రాంతంలో పర్యటించేలా వాహనాల వారీగా మ్యాపింగ్‌ చేశామని చెప్పారు.


అయినా పరిధి దాటి ప్రచారం...

గూగుల్‌ మ్యాప్‌ ఆధారంగా వెళ్లడంతో కొందరు డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గాల పరిధిని వారు దాటిపోతున్నారు. ప్రధాన పార్టీకి చెందిన చేవెళ్ల అభ్యర్థి ఒకరి వాహనం ఇటీవల మల్కాజ్‌గిరి పరిధిలో పర్యటించింది. మల్కాజ్‌గిరి అభ్యర్థి ప్రచార రథం ఒకటి సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని ప్రాంతంలో తిరిగింది. దీంతో స్థానిక ఓటర్లు అయోమయానికి గురయ్యారు. మన అభ్యర్థి ఎవరు? ఈయన వాహనం ఎందుకు ఇక్కడ తిరుగుతోంది? అని కొందరు చర్చించుకోవడం కనిపించింది. గూగుల్‌ మ్యాపింగ్‌ ఆధారంగానే వెళ్తున్నామని డైవ్రర్లు చెబుతున్నా.. నియోజకవర్గాల పరిధి దాటుతుండడం గమనార్హం. మ్యాపింగ్‌లో లోపమా..? లేక డ్రైవర్లకు అవగాహన లేకపోవడం కారణమా..? అన్నది బాధ్యులు మరోసారి పరిశీలించుకోవాల్సిన అవసరముంది.

Updated Date - Apr 26 , 2024 | 05:53 AM