Share News

ఊపందుకున్న ధాన్యం కొనుగోళ్లు

ABN , Publish Date - Apr 20 , 2024 | 01:16 AM

యాసంగి వరి కోతలు, ధాన్యం కొనుగోళ్లు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. గడిచిన నాలుగైదు రోజులుగా కోతలు ముమ్మరం కావడంతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం ఎక్కువగా వస్తున్నది.

ఊపందుకున్న ధాన్యం కొనుగోళ్లు

- జిల్లా వ్యాప్తంగా 341 కేంద్రాల ఏర్పాటు

- ఇప్పటి వరకు కొనుగోలు చేసింది 14,376 మెట్రిక్‌ టన్నులు

(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్‌)

యాసంగి వరి కోతలు, ధాన్యం కొనుగోళ్లు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. గడిచిన నాలుగైదు రోజులుగా కోతలు ముమ్మరం కావడంతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం ఎక్కువగా వస్తున్నది. రైతులు పండించిన ధాన్యాన్ని అంతటిని కొనుగోలు చేయడానికి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. గతంలో మాదిరిగానే ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 341 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి ధాన్యం అమ్ముకోవడంలో రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని నిర్ణయించారు. ఈ కేంద్రాలన్నిటినీ ఇప్పటికే ప్రారంభించగా ఇప్పుడిప్పుడే కోతలు ముమ్మరం కావడంతో ఇప్పటి వరకు కేవలం 203 కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. కేంద్రాలకు వరి ధాన్యం వచ్చిన వెంటనే మిగతా అన్ని కేంద్రాల్లో కూడా కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ యాసంగిలో 2.50 లక్షల ఎకరాల వరిసాగు చేయగా 6.33,943 మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో 2,51,099 మెట్రిక్‌ టన్నుల ధాన్యం విత్తనపంట కావడంతో ఆ ధాన్యాన్ని ఆయా కంపెనీలే కొనుగోలు చేస్తాయి. ప్రధానంగా హుజురాబాద్‌ రెవెన్యూ డివిజన్‌లో రైతులు విత్తన పంటను ఎక్కువగా సాగు చేశారు. మరో 2,307 మెట్రిక్‌ టన్నుల ధాన్యం రైతులు స్వంత అవసరాలకు తమ వద్దే ఉంచుకుంటారని, సుమారు 30,500 మె.ట. ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేస్తారని అంచనా వేశారు. ఈ ధాన్యం పోను 3,50,000 టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని భావించి వాటిని ఖరీదు చేయడానికి ఏర్పాట్లు చేశారు.

జిల్లా వ్యాప్తంగా ఐకేపీ కొనుగోలు కేంద్రాలను, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు 238 కేంద్రాలను, డిసిఎంఎస్‌ 47, హాకా ఆరు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 32 ఐకేపీ, 143 ఫ్యాక్స్‌, 25 డిసిఎంఎస్‌, మూడు హాకా కేంద్రాలలో ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం వరకు ఈ కొనుగోలు కేంద్రాలలో 2,325 మంది రైతులకు చెందిన 14,376 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం విలువ 31.67 కోట్లు. వీరిలో 596 మంది రైతులకు సంబంధించిన 3,438 మెట్రిక్‌ టన్నుల ధాన్యం వివరాలను కంప్యూటర్లలో నమోదు చేశారు. ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాల నుంచి 443 మెట్రిక్‌ టన్నుల ధాన్యం తమకు అందినట్లు మిల్లర్లు సమాచారం ఇవ్వగా 348 మె.ట. ధాన్యానికిగాను 77 లక్షల రూపాయలు రైతుల ఖాతాల్లో జమచేశారు. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లర్లకు ధాన్యం చేరగానే వెంటవెంటనే డబ్బు చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - Apr 20 , 2024 | 01:16 AM