Share News

విద్యాశాఖ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - May 07 , 2024 | 12:01 AM

రాష్ట్రం లో ఉపాధ్యాయు ల పదోన్నతుల సంక్షోభానికి కారణమైన ఉపాధ్యా య అర్హత పరీక్ష (టెట్‌) వివాదం పై నిర్లక్ష్యంగా వ్యవహరించిన విద్యాశాఖ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి డిమాండ్‌ చేశారు.

విద్యాశాఖ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలి

టీఎ్‌సయూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి

నల్లగొండటౌన్‌, మే 6: రాష్ట్రం లో ఉపాధ్యాయు ల పదోన్నతుల సంక్షోభానికి కారణమైన ఉపాధ్యా య అర్హత పరీక్ష (టెట్‌) వివాదం పై నిర్లక్ష్యంగా వ్యవహరించిన విద్యాశాఖ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి డిమాండ్‌ చేశారు. సంఘం జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత సెప్టెంబరులో అర్ధాంతరంగా నిలిచిన పదోన్నతులు కొనసాగింపునకు ఆటంకంగా ఉన్న టెట్‌పై ఎన్సీటీఈ వివరణ తీసుకోవాలని పదేపదే ప్రాతినిధ్యం చేయడంతో ఫిబ్రవరిలో క్లారిఫికేషన్‌ కోసం లేఖ రాసి దాన్ని రహస్యంగా ఉంచారన్నారు. ప్రధానోపాధ్యాయులకు పనిచేస్తున్న పాఠశాలల స్థాయిలో మార్పు లేనప్పుడు పదోన్నతులకు టెట్‌ అవసరం లేదని పేర్కొంటూ వచ్చిన వివరణ లేఖను వెల్లడించకుండా ఉపాధ్యాయులందరినీ మోసం చేశారన్నారు. ఉపాధ్యాయులను మానసికాందోళనకు గురిచేయటంతో పాటు అందరినీ టెట్‌కు దరఖాస్తు చేయించడం ద్వారా లక్షల రూపాయులు వృథా చేయించారని పాఠశాల విద్య కమిషనర్‌ వైఖరిపై మండిపడ్డారు. గత మూడు సంవత్సరాలుగా కమిషనర్‌ పనితీరు బాలేదని, ఉపాధ్యాయులు, సంఘాలు చివరికి ప్రజాప్రతినిధులతో సైతం కమిషనర్‌ సరిగా వ్యవహరించడం లేదన్నారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించటంలో విఫలమయ్యారని, విద్యాశాఖలో వేలాది కోర్టు కేసులకు కమిషనర్‌ అసమర్థ వ్యవహార సరళే కారణమని ఆరోపించారు. కమిషనర్‌ను తక్షణమే ఆ బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికలు ముగిసేలోగా ఎన్సీటీఈ నుంచి మరికొన్ని అంశాలపై వివరణ తీసుకుని ఎన్నికలు ముగిసిన వెంటనే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. సెప్టెంబర్‌లో బదిలీ అయిన ఉపాధ్యాయులను ఎన్నికలు ముగిసిన వెంటనే రిలీవ్‌ చేయాలని, విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పాఠశాలల్లో విద్యావాలంటీర్లను నియమించాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని, గత పీఆర్సీ బకాయిలతో సహా ట్రెజరీ ఆమోదం పొంది ఆర్థికశాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నీ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్‌రెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎడ్ల సైదులు, పెరుమాళ్ల వెంకటేశం, నర్రా శేఖర్‌రెడ్డి, నలపరాజు వెంకన్న, మురళయ్య, సైదులు, రాజశేఖర్‌, రమణ, ప్రభాకర్‌, ఆంజనేయులు, పాల్గొన్నారు.

Updated Date - May 07 , 2024 | 12:01 AM