Share News

ధాన్యం కాంటా కోసం రైతుల రాస్తారోకో

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:58 PM

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో ఖరీదుదారులు, హమాలీల మధ్య చోటుచేసుకున్న వివాదం రైతుల పాలిట శాపంగా మారింది. మార్కెట్‌లో ధాన్యంలో కాంటాలు, ఎగుమతులు చేయమని హమాలీలు మార్కెట్‌ నుంచి వెళ్లిపోవడంతో ఆగ్రహించిన రైతులు 65వ నెంబరు హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు.

ధాన్యం కాంటా కోసం రైతుల రాస్తారోకో
వ్యవసాయ మార్కెట్‌కు ఎదురుగా ఉన్న హైదరాబాద్‌-విజయవాడ రహదారిపై రాస్తారోకో చేస్తున్న రైతులు

సూర్యాపేటసిటీ, ఏప్రిల్‌ 26: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో ఖరీదుదారులు, హమాలీల మధ్య చోటుచేసుకున్న వివాదం రైతుల పాలిట శాపంగా మారింది. మార్కెట్‌లో ధాన్యంలో కాంటాలు, ఎగుమతులు చేయమని హమాలీలు మార్కెట్‌ నుంచి వెళ్లిపోవడంతో ఆగ్రహించిన రైతులు 65వ నెంబరు హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. సుమారు అరగంటకు పైగా ఆందోళన చేయడంతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రైతులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో పనిచేస్తున్న హమాలీలు ప్లాస్టిక్‌ బస్తాల్లో(సూపర్‌ బస్తాలు) ధాన్యం ఎగుమతులు చేయడం కష్టంగా మారిందని, వేసవి దృష్ట్యా ప్లాస్టిక్‌ బస్తాలు కాలుతున్నాయని, ప్లాస్టిక్‌ బస్తాల స్థానంలో గన్నీ బస్తాలను తీసుకురావాలని ఖరీదుదారులకు సూచించారు. అయితే గన్నీ బస్తాల ఖరీదు చాలా ఎక్కువగా ఉందని, తీసుకురావడం కుదరదని ఖరీదుదారులు తేల్చిచెప్పారు. దీంతో గన్నీబస్తాలు తెచ్చే వరకు మార్కెట్‌లోని ధాన్యం కాంటా వేయబోమని హమాలీలు మార్కెట్‌ నుంచి వెళ్లిపోవటంతో ధాన్యం కాంటాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పలుమార్లు మార్కెట్‌ అధికారులు, ఖరీదుదారులు, హమాలీలతో చర్చలు జరిపారు. ఈ ఒక్కరోజు ప్లాస్టిక్‌ బస్తాల్లో ధాన్యం నింపాలని మార్కెట్‌ కార్యదర్శి బీవీ రాహుల్‌ హమాలీలను కోరారు. అయినా వారు అంగీకరించకుండా మార్కెట్‌ నుంచి వెళ్లిపోయారు. ఉదయం 12గంటల సమయంలో మార్కెట్‌ ధరలు వచ్చినా కాంటాలు ప్రారంభం కాకపోవడంతో అప్పటివరకు వేచి చూసిన రైతులు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ధాన్యం కాంటాలు జరిపించాలని రైతులు మార్కెట్‌ కార్యదర్శిని చుట్టుముట్టారు. ఉన్నతాధికారులను సంప్రదిస్తున్నామని, రైతులు సమన్వయం పాటించాలని పలుమార్లు మార్కెట్‌ కార్యదర్శి రైతులకు విజ్ఞప్తిచేశారు. సాయంత్రం నాలుగు గంటల వరకు ధాన్యం కాంటాల కోసం ఎదురుచూసిన రైతులు మార్కెట్‌ నుంచి బయటకు వచ్చి హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. సుమారు అరగంటకు పైగా రైతులు ఆందోళన చేయడంతో జాతీయ రహదారికి ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సూర్యాపేట రూరల్‌ సీఐ సురేందర్‌రెడ్డి రైతులకు నచ్చజెప్పి, సమస్యను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, ధాన్యం కాంటాలు జరిగిలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. మార్కెట్‌లో పనిచేస్తున్న హమాలీలు ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా కాంటాలు నిలుపుదల చేయడంతో మార్కెట్‌కు వచ్చిన రైతులు ఆందోళన చేశారని మార్కెట్‌ కార్యదర్శి తెలిపారు. శుక్రవారం ఆయా ధాన్యం రాశులకు టెండర్ల ద్వారా వచ్చిన ధరలకే శనివారం కాంటాలు నిర్వహిస్తామని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆయన రైతులకు హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.

Updated Date - Apr 26 , 2024 | 11:58 PM