Share News

భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:50 PM

భానుడి ప్రతాపంతో ప్రజలు తలాకుతలమవుతున్నారు. ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటేనే భయపడుతున్నారు. ఉదయం నుంచి మొదలవుతున్న వడగాడ్పులు, రాత్రి 8గంటల వర కూ కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి

భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి

నిడమనూర్‌లో 45.2 డిగ్రీలు

నల్లగొండ జిల్లాకు రెడ్‌ అలర్ట్‌ జారీ

నల్లగొండ, ఏప్రిల్‌ 26: భానుడి ప్రతాపంతో ప్రజలు తలాకుతలమవుతున్నారు. ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటేనే భయపడుతున్నారు. ఉదయం నుంచి మొదలవుతున్న వడగాడ్పులు, రాత్రి 8గంటల వర కూ కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. భానుడి భగభగలకు వాహనదారులు రహదారులపైకి రావడంలేదు. దీంతో ప్రధాన రోడ్లతోపాటు కూడళ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. తాగునీటి కోసం మూగజీవాలు అల్లాడుతున్నాయి. చెరువులు, కుంట ల్లో ఉన్న కొద్దిపాటి నీటిని తాగుతూ కడుపు నింపుకుంటున్నాయి. ఎండల వేడినుంచి ఉపశమనం కోసం యువకులు ఈతకు వెళుతున్నారు. నల్లగొండ జిల్లాలో మొదటిసారిగా 45డిగ్రీల ఉష్ణోగ్రతలు నాలుగు మండలాల్లో నమోదయ్యాయి. నిడమనూరు మండలంలో 45.2 డిగ్రీలు, మాడ్గులపల్లి 45.1డిగ్రీలు, త్రిపురారంలో 45.0డిగ్రీలు, వేములపల్లి 45.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో వాతావరణశాఖ రెడ్‌ అలర్ట్‌(వార్నింగ్‌) జారీ చేసింది.

యాదాద్రిలో 45 డిగ్రీల ఎండలు

భువనగిరి అర్బన్‌: యాదా ద్రి భువనగిరి జిల్లాలో ఎండలు తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది. శుక్రవారం బొమ్మలరామారం మండలం మర్యాలలో అత్యధికంగా 45.1డిగ్రీల ఉష్ణోగ్ర త నమోదైంది. అత్యల్పంగా తుర్కపల్లి మండలంలో ఉద యం 39.6డిగ్రీలు నమోదైంది. ఎండ వేడిమి తట్టుకోలేక జనం ఇళ్లకే పరితమవుతుండగా, వేడి నుంచి ఉపశమనం పొందేందు కు కూల్‌డ్రింకులు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, జ్యూస్‌ తాగుతున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలు ఇంటి బయటకు రాకపోవడమే మంచిదని వైదులు పేర్కొంటున్నారు. సాయంత్రం 5.30గంటల వరకు ఎండ తీవ్రత తగ్గకపోవడంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు.

వడదెబ్బతో ప్రైవేట్‌ ఉపాధ్యాయురాలి మృతి

శాలిగౌరారం, ఏప్రిల్‌ 26: నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం అడ్లూర్‌ గ్రామానికి చెందిన బోడ అశ్రిత(35) వడదెబ్బతో శుక్రవారం మృతి చెందారు. ఈమె నకిరేకల్‌లోని ఏవీఎం స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. శుక్రవారం బజారుకు వెళ్లి వచ్చి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే ఆమె భర్త ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈమెకు ఇద్దరు కుమారులున్నారు. ఎమ్మెల్యేలు మందుల సామేల్‌, వేముల వీరేశం అడ్లూర్‌కు చేరుకుని అశ్రిత మృతదేహాంపై పూలమాల వేసి నివాళులర్పించారు.

నల్లగొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి

తేదీ గరిష్ఠం కనిష్ఠం గరిష్ఠం కనిష్ఠం గరిష్ఠం కనిష్ఠం

19 44.8 39.7 44.3 41.0 43.8 39.0

20 41.0 36.1 43.2 40.2 39.7 35.1

21 44.7 39.1 43.5 40.4 43.3 37.8

22 45.0 39.3 44.9 40.7 42.1 39.5

23 45.1 39.4 44.0 40.5 42.7 39.5

24 44.9 39.1 44.5 40.8 43.2 39.5

25 45.2 40.0 44.7 40.4 45.1 39.6

Updated Date - Apr 26 , 2024 | 11:50 PM