శాలు కిరాక్‌!

ABN , First Publish Date - 2022-05-16T05:30:00+05:30 IST

శాలు కిరార్‌ ఐజిటిసి(ఇండియాస్‌ గాట్‌ టాలెంట్‌ సీజన్‌)లో భాగమయ్యానని.. ఇటీవల ఫేస్‌బుక్‌లో ఓ ఫొటో షేర్‌ చేసింది. ఆ ఫొటో బాలీవుడ్‌ హీరో టైగర్‌ష్రా్‌ఫతో.

శాలు కిరాక్‌!

శాలు కిరార్‌ జాతీయస్థాయిలో పేరున్న జిమ్నాస్ట్‌. జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు గెలుచుకుంది. స్వతహాగా డ్యాన్సర్‌ కూడా. ఇండియాస్‌ గాట్‌ టాలెంట్‌  సీజన్‌ 8లో పాల్గొని అందరి మనసుల్ని గెలుచుకున్న ఈ విజేత తొమ్మిదో సీజన్‌లో ‘బాంబ్‌ ఫైర్‌’ టీమ్‌లో తన ప్రతిభను ప్రదర్శించనుంది. 


శాలు కిరార్‌ ఐజిటిసి(ఇండియాస్‌ గాట్‌ టాలెంట్‌ సీజన్‌)లో భాగమయ్యానని.. ఇటీవల ఫేస్‌బుక్‌లో ఓ ఫొటో షేర్‌ చేసింది. ఆ ఫొటో బాలీవుడ్‌ హీరో టైగర్‌ష్రా్‌ఫతో. ఇదో బెస్ట్‌మూమెంట్‌.. అంటూ పొంగిపోయింది. ఐజిటిసి-8 లో న్యాయనిర్ణేతలు ఎంతో మెచ్చుకున్నారు. డ్యాన్స్‌, జిమ్నాస్టిక్స్‌ మిక్స్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అందుకే తన ప్రతిభ సామాన్య ప్రేక్షకులనే కాదు.. గోవిందా, శిల్పాశెట్టి, టైగర్‌ష్రాఫ్‌ లాంటి బాలీవుడ్‌ నటులకూ నచ్చింది. ఎక్కడో హర్యానాలోని రోటక్‌ అనే చిన్నపట్టణంలో పుట్టిన శాలు.. ఇలాంటి ఫీట్స్‌ సాధించటం గొప్ప విషయం.


వాళ్లు లేకపోతే నేను లేను.. 

శాలు చిన్నప్పుడు జిమాస్టిక్స్‌ చేస్తుంటే ఇరుగుపొరుగు వారు ‘ఇదేం విడ్డూరం’ అంటూ ముక్కున వేలేసుకున్నారు. ఆడపిల్లలకు ఇవన్నీ అవసరమా.. అంటూ బంధువులు గొణిగారు. అయినప్పటికీ ఆమె జిమ్నాస్టిక్స్‌ కొనసాగించింది. ‘ఇదంతా అమ్మానాన్న చలవే. లేకపోతే మా ప్రాంతంలో ఆడపిల్ల చదవాల్సిన అవసరం ఏముంది? అంటారు. పద్దెనిమిదేళ్లకే పెళ్లి చేస్తారు. మా పేరెంట్స్‌ నా ప్రతిభను నమ్మి అందరిలా కాకుండా ప్రత్యేకంగా ఆలోచించారు. కాబట్టే ఈ స్థితిలో ఉన్నా. వాళ్లు లేకపోతే నేను లేను’ అంటుంది  శాలు.


సోషల్‌ మీడియా స్టార్‌..

జిమ్నాస్టిక్స్‌లో జాతీయ స్థాయిలో ఇరవైకి పైగా అవార్డులు గెల్చుకుంది. అయితే అంతర్జాతీయ స్థాయిలో పార్టిసిపేట్‌ చేయటానికి ఆమెకు తగిన సహకారం దొరకలేదు. అయినా ఆమె ప్రతిభను దాచుకోలేదు. రోడ్డుమీద, గల్లీల్లో, సముద్ర తీరాల్లో.. ఇలా జిమ్నాస్టిక్స్‌ చేస్తూ ఆశ్చర్యపరిచేది. ఇవన్నీ వీడియోలు తీసి ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, ఇన్‌స్టాలో ఉంచేది. వీటికి మంచి పేరొచ్చింది. వందల స్టంట్స్‌ చేసింది. తన ఊరిలోని పంటపొలాల్లో కూడా ఈ విద్యను ప్రదర్శించేది. వ్లాగ్స్‌తో పాటు కొన్ని జానపద పాటల్లోనూ ఆడిపాడింది. దీంతో ఆమె మాస్‌కు మరింత దగ్గరైంది. ‘శాలు కిరార్‌’ యూట్యూబ్‌ ఛానెల్‌కు 9 లక్షల మంది సబ్‌స్క్రయిబర్స్‌ ఉన్నారు. ఆమె ఇన్‌స్టాను 44 వేలమంది ఫాలో అవుతున్నారు. 

Updated Date - 2022-05-16T05:30:00+05:30 IST