రిషభ్ పంత్ ఖాతాలో రికార్డులే రికార్డులు

ABN , First Publish Date - 2022-01-14T01:56:02+05:30 IST

సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అజేయ సెంచరీతో అదరగొట్టిన టీమిండియా వికెట్ కీపర్..

రిషభ్ పంత్ ఖాతాలో రికార్డులే రికార్డులు

కేప్‌టౌన్: సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అజేయ సెంచరీతో అదరగొట్టిన టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. వికెట్లన్నీ టపటపా రాలుతున్న వేళ క్రీజులో పాతుకుపోయి ఒంటరి పోరాటం చేసిన పంత్ 139 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా సెంచరీ నమోదు చేశాడు. టెస్టుల్లో పంత్‌కు ఇది నాలుగో సెంచరీ కాగా, అందులో విదేశాల్లో చేసినవే మూడు ఉండడం గమనార్హం. ఇక తాజా సెంచరీతో దక్షిణాఫ్రికా గడ్డపై శతకం నమోదు చేసిన తొలి ఇండియన్ వికెట్ కీపర్‌గా రికార్డులకెక్కాడు.  


ఆసియాకు ఆవల సెంచరీలు బాదిన వికెట్ కీపర్లలో పంత్ కంటే ముందు వి. మంజ్రేకర్, ఎ.రాత్రా, వృద్ధిమాన్ సాహా ఉన్నారు. వి. మంజ్రేకర్ 1952/53లో కింగ్స్‌టన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 118 పరుగులు చేశాడు. 2002లో సెయింట్ జాన్స్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎ. రాత్రా అజేయంగా 115 పరుగులు చేశాడు.


వృద్ధిమాన్ సాహా 2016లో గ్రాస్ ఐలెట్‌లో వెండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 104 పరుగులు చేయగా, పంత్ మూడు సార్లు ఆ ఘనత సాధించాడు. 2018లో ది ఓవల్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 114, 2018/19లో సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అజేయంగా 159, ఇప్పుడు కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాపై అజేయంగా 100 పరుగులు చేసి అత్యంత అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 

Updated Date - 2022-01-14T01:56:02+05:30 IST