నా వెంట్రుక కూడా పీకలేరు!

ABN , First Publish Date - 2022-04-09T08:14:17+05:30 IST

కొన్నాళ్లుగా ‘మారీచ భాష’ మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఇప్పుడు ‘పీకుడు’లోకి వెళ్లిపోయారు. ప్రతిపక్షాలతోపాటు తన తప్పులను వేలెత్తి చూపిస్తున్న మీడియాపై అక్కసు వెళ్లగక్కారు.

నా వెంట్రుక కూడా పీకలేరు!

  • గుండెపోటు వచ్చి ‘టికెట్‌’ కొంటారు
  • ప్రతిపక్షాలు, మీడియాకు జగన్‌ శాపం
  • రాష్ట్ర పరువు తీస్తున్నారని ధ్వజం.. 
  • విద్యార్థుల ముందు సీఎం ‘దౌర్భాగ్య’ భాష..
  • వసతి దీవెన నిధులు విడుదల


కర్నూలు/నంద్యాల, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): కొన్నాళ్లుగా ‘మారీచ భాష’ మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఇప్పుడు ‘పీకుడు’లోకి వెళ్లిపోయారు. ప్రతిపక్షాలతోపాటు తన తప్పులను వేలెత్తి చూపిస్తున్న మీడియాపై అక్కసు వెళ్లగక్కారు. ‘గుండెపోటు వచ్చి టికెట్‌ తీసుకుని పోతారు’ అంటూ శాపనార్థాలతో తన నిస్పృహ చాటుకున్నారు. ‘వసతి దీవెన నిధుల విడుదల’ పేరిట ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యక్రమంలో... పెద్ద ఎత్తున విద్యార్థులను పిలిపించి... వారి ముందు ముఖ్యమంత్రిగా తన స్థాయికి తగని విధంగా మాట్లాడారు. ‘నా వెంట్రుక కూడా పీక్కోలేరు’ అంటూ అభినయించి చూపించారు.  కొత్త జిల్లాగా ఏర్పడిన నంద్యాలలో శుక్రవారం ‘జగనన్న వసతి దీవెన’ కింద రూ.1,024 కోట్ల నిధులను తల్లుల ఖాతాలో వేశారు. స్థానిక ఎస్‌పీజీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు.  ‘‘పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, ఒడిసా... ఎక్కడైనా ప్రతిపక్షాలు ఉంటాయి. రాష్ట్ర పరువును కాపాడే విషయంలో అన్ని పక్షాలూ కలుస్తాయి. పార్లమెంట్‌లో మాట్లాడేటప్పుడు రాష్ట్రం ప్రతిష్ఠను పెంచాలని ఆరాటపడుతాయి. కానీ... మన ఖర్మ ఏమిటంటే... ఇక్కడ దౌర్భాగ్య ప్రతిపక్షం, దౌర్భాగ్య ఎల్లో మీడియా, దౌర్భాగ్య దత్తపుత్రుడు! ఇవి మన రాష్ట్రం చేసుకున్న ఖర్మలు కాబట్టి మన రాష్ట్రం పరువును కూడా తాకట్టు పెడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. 


ఇన్ని సమస్యలు.. ఇన్ని కష్టాలు... ఇవేవీ నన్ను కదిలించలేవు. బెదిరించలేవు. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలున్నంత వరకు వాళ్లు నా వెంట్రుక కూడా పీకలేరు’’ అని వ్యాఖ్యానించారు. తన తలలో వెంట్రుకలను పట్టుకుని... పీకినట్లుగా అభినయించి చూపించారు. పార్లమెంటు వేదికగా రాష్ట్ర ప్రభుత్వం మీద బురదజల్లుతున్నారని... రాష్ట్ర ప్రభుత్వ పరువు తీస్తున్న గొప్ప చరిత్ర వీళ్లదని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం ‘గోరుముద్ద’ కోసం ఖర్చు చేసింది రూ.500 కోట్లేనని... తాము రూ.1900కోట్లు వెచ్చిస్తున్నామని జగన్‌ తెలిపారు. ‘‘ఈ విషయాన్ని రాయకుండా పల్లీ చిక్కి కవరు మీద జగనన్న ఫొటో ఉందని వీళ్లందరూ రాస్తారు. ఈ కడుపు మంటకు, అసూయకు మందే లేదు. ఇవి ఎక్కువైతే కచ్చితంగా వీళ్లందరికీ బీపీ వస్తుంది. కచ్చితంగా ఏదో ఒకరోజు గుండెపోటు వచ్చి టికెట్టు కొంటారు’’ అని శాపనార్థాలు పెట్టారు. జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాల కింద ఈ మూడేళ్లలో రూ.10,298 కోట్లు చెల్లించామని చెప్పారు. ఈ చర్యల వల్ల డ్రాపౌట్లు గణనీయంగా తగ్గాయన్నారు. విద్యారంగంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ప్రభుత్వ బడుల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని తెలిపారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో 37 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా... ఇప్పుడు ఆ సంఖ్య 44.30 లక్షలకు పెరిగిందన్నారు. ఇంత గొప్పమార్పు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ‘‘రాబోయే 20ఏళ్ల తర్వాత కూడా పోటీ ప్రపంచంలో రాణించాలనే లక్ష్యంగా అన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం అమలు చేస్తాం. పిల్లలంతా బడికి వెళ్లాలని రాష్ట్రంలో 44లక్షల మంది తల్లుల ఖాతాల్లో అమ్మఒడి కింద రూ.15వేలు వేస్తున్నాం. ఇది మహిళల పక్షపాత ప్రభుత్వం’’ అని జగన్‌ పేర్కొన్నారు. 


ముందుస్తు అరెస్టులు

సీఎం పర్యటన సందర్భంగా విద్యార్థి, యువజన, వామపక్ష, కుల సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాముదాకా అరెస్టుల పర్వం కొనసాగింది. నాయకుల ఇళ్లవద్దకు వెళ్లి, వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రుడు, జిల్లా కార్యదర్శి షేక్‌ రియాజ్‌, తెలుగునాడు స్టూడెంట్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు నాగ నవీన్‌, ఎంఆర్‌పీఎస్‌ రాష్ట్ర నాయకుడు కోలా కల్యాణ్‌ మాదిగ, ఎంఎ్‌సఎఫ్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి బాయికాటి బెనర్జీ, ఏఐఎ్‌సఎఫ్‌ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ధనుంజయుడు, పీడీఎ్‌సయూ జిల్లా సహాయ కార్యదర్శి రఫీ, సీపీఐ జిల్లా కమిటీ సభ్యుడు బాబాఫకృద్దీన్‌, సీనియర్‌ నాయకుడు శ్రీనివాసులుతో పాటు వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులను అరెస్టు చేశారు.

Updated Date - 2022-04-09T08:14:17+05:30 IST