ఏంటికిలేబ్బా..!

ABN , First Publish Date - 2022-06-24T06:46:38+05:30 IST

ఆర్‌డబ్ల్యూఎస్‌ పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదు. జిల్లాలోని 31 మండలాల్లో నీటీ సమస్య తలెత్తకుండా అధికారులు అభివృద్ధి పనులు చేపట్టడానికి అంచనాలు తయారు చేశారు.

ఏంటికిలేబ్బా..!
ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయం(ఫైౖల్‌)

ఆర్‌డబ్ల్యూఎస్‌ పనులపై అనాసక్తి

ఒక్క టెండరూ దాఖలు కాలేదు 

బిల్లులు.. పర్సెంటేజీల భయం 

రూ.63 కోట్ల పనులకు గ్రహణం


అనంతపురం న్యూటౌన, జూన 23: ఆర్‌డబ్ల్యూఎస్‌ పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదు. జిల్లాలోని 31 మండలాల్లో నీటీ సమస్య తలెత్తకుండా అధికారులు అభివృద్ధి పనులు చేపట్టడానికి అంచనాలు తయారు చేశారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ.63 కోట్లతో 453 పైప్‌లైన పనులకు టెండర్‌ పిలిచారు. ఈ నెల 15న గడువు ముగిసింది. అయినా ఒక్క టెండర్‌ కూడా నమోదు కాలేదు. ప్రభుత్వ పనులను దక్కించుకునేందుకు పోటీ పడే కాంట్రాక్టర్లు.. ఇలా మిన్నకుండిపోవడం అనుమానాలకు తావిస్తోంది. గతంలో స్థానిక నాయకుల కనుసన్నల్లో పనులు జరిగేవి. ఇలాంటివి కొన్ని టెండర్‌ ఓపెన చేయక ముందే ప్రారంభించిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆర్‌డబ్లూఎ్‌సలో పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ప్రతి నియోజవర్గంలో మొత్తం పనులను కలిపి టెండర్లు పిలిచామని, ఈ కారణంగా పెద్ద వర్కులు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని యంత్రాంగం చెప్పుకోస్తోంది. ఇది నిజమేనా అన్న చర్చ జరుగుతోంది. 


పర్సెంటేజీలే ప్రధాన కారణమా..? 

పైప్‌లైన నిర్మాణ పనులకు టెండర్లు దాఖలు కాకపోవడం విమర్శలకు తావిస్తోంది. నియోజకవర్గ స్థాయి లో అధికార పార్టీ నాయకులు పర్సెంటేజీలు కోరడంతో కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. టెండర్లు దక్కించుకుంటే.. నియోజకవర్గ స్థాయి నాయకుడిలో సంప్రదింపులు జరిపి, కోరిన పర్సేంటేజీ ఇవ్వాలని, తిరిగి మండల, పంచాయతీ స్థాయిలో నాయకులకు సైతం పర్సేంటేజీలు ఇవ్వాల్సి వస్తుందని కాంట్రాక్టర్లు అంటున్నారు. అందుకే.. ఆ పనులు చేయడంకంటే సైలెంట్‌గా ఉండటం మంచిందని భావించినట్లు సమాచారం. 


ఎన్నెన్నో సమస్యలు..

టెండర్ల ప్రక్రియ మూడు నెలల క్రితం ప్రారంభమైంది. అప్పటి రేట్లకు అనుగుణంగా, ఇబ్బందులు తలెత్తకుండా విలువ కట్టినట్లు అధికార యంత్రాంగం చెబుతోంది. అయితే వారం పదిరోజుల వ్యవధిలోనే పైప్‌లైన నిర్మాణ సామగ్రి ధరలు పెరిగాయి. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంది. నిర్మాణ పనులు పూర్తి అయ్యేందుకు కొంత సమయం పడుతంది. దీనికి తోడు స్థానికంగా ఏదైనా సమస్య ఎదురైతే పనులకు ఆటంకం కలుగుతుంది. ఇవన్నీ కాంట్రాక్టర్లకు ఇబ్బంది కలిగిస్తాయి. ఈ సమస్యకు జడిసి.. కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని ఆర్‌డబ్ల్ల్యూఎస్‌ కార్యాలయ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో అత్యవసర పనుల జాబితా తయారు చేసి, మండల స్థాయిలో పనులు చేపట్టేలా రీ టెండర్‌ నిర్వహించేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నారని సమాచారం. 


బిల్లులపై అనుమానం

ఆర్‌డబ్ల్యూఎ్‌సలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అయినా టెండర్లు దాఖలు కాలేదు. దీనికి కారణం.. బిల్లులను సకాలంలో చెల్లిస్తారో లేదోనన్న అనుమానమే. బిల్లుల మంజూరు సమయానికి ఖాతాలు ఫ్రీజ్‌ అవుతాయని, ఆ నిధులను ఇతర అవసరాలకు వినియోగిస్తారని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు ఇలాగే ఉందని, ఏ శాఖలో నిధులను ఎక్కడికి మళ్లిస్తారో తెలియదని వ్యాఖ్యానిస్తున్నారు. 


మండల స్థాయిలో ప్రయత్నిస్తాం..

జిల్లాలోని 31 మండలాల పరిధిలో పైప్‌లైన్ల నిర్మానానికి రూ.63 కోట్లతో 453 పనులకు టెండర్లు పిలిచాము. గడువు ముగిసేనాటికి ఒక్క టెండర్‌ కూడా దాఖలు కాలేదు. ప్రస్తుతం నియోజవర్గాలవారీగా టెండర్లు పిలిచాము. సమస్య పరిష్కారానికి మండలాల వారిగా టెండర్లు నిర్వహిస్తాం. పనులు పూర్తి అయ్యేలా చూస్తాం.

- ఎహసాన బాషా, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ

Updated Date - 2022-06-24T06:46:38+05:30 IST