షేక్ హ్యాండ్‌కే షేకా! ‌

ABN , First Publish Date - 2022-08-09T09:33:05+05:30 IST

విపక్షంలో ఉన్నప్పుడూ, అధికారంలోకి వచ్చాకా... బీజేపీకి వైసీపీ సంపూర్ణ సహకారం అందిస్తోంది.

షేక్ హ్యాండ్‌కే షేకా! ‌

  • బాబు-మోదీ మాటామంతిపై వైసీపీ అతి స్పందన
  • టీడీపీ అధినేతను తప్పుబడుతూ సజ్జల విమర్శల దాడి
  • టీడీపీ-బీజేపీ కలిస్తే నష్టమేనన్న భయం!
  • సలహాదారు సజ్జల వ్యాఖ్యల్లో సుస్పష్టం
  • బీజేపీతో ఎప్పటి నుంచో వైసీపీ స్నేహం
  • అన్ని అంశాల్లోనూ బహిరంగ మద్దతు
  • టీడీపీ, బీజేపీ, జనసేన కలవొద్దనేదే లక్ష్యం
  • దాని మేరకే విమర్శలు, వ్యూహాలు


2014 ఎన్నికల తర్వాత... ప్రత్యేక  హోదాకోసం కేంద్రంతో టీడీపీ యుద్ధం చేయాలని వైసీపీ పోరు పెట్టింది. కేంద్ర ప్రభుత్వం నుంచి బయటికి రావాలని డిమాండ్‌ చేసింది. నాలుగేళ్లపాటు ఇదే ఘోష! అసలే కొత్త రాష్ట్రం! కేంద్రంతో గొడవ పెట్టుకుంటే రావాల్సినవీ రాకుండా పోతాయనే భయం! చివరకు హోదా నినాదంతో ఎన్డీయేకు చంద్రబాబు కటీఫ్‌ చెప్పారు. ‘మీరు వైసీపీ ట్రాప్‌లో పడ్డారు’ అని అప్పట్లో ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. వైసీపీ లక్ష్యం నెరవేరింది. 2019 ఎన్నికల్లో కేంద్రం పరోక్ష సహకారం జగన్‌కు లభించింది. అధికారం సిద్ధించింది. ఇప్పుడు మళ్లీ టీడీపీ, బీజేపీ కలుస్తాయేమోనన్న ఆలోచనేవైసీపీని భయపెడుతోందా. శనివారం ఢిల్లీలో ప్రధాని మోదీతో చంద్రబాబు మాటామంతిపై ఎందుకంత ఉలికిపడుతోంది? అంత విపరీత స్పందన ఎందుకు?


(అమరావతి - ఆంధ్రజ్యోతి): విపక్షంలో ఉన్నప్పుడూ, అధికారంలోకి వచ్చాకా... బీజేపీకి వైసీపీ సంపూర్ణ సహకారం అందిస్తోంది. అడగకున్నా మద్దతు ప్రకటిస్తూనే ఉంది. ముఖ్యమంత్రి జగన్‌ క్రమం తప్పకుండా ప్రధాని మోదీని, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలుస్తూనే ఉన్నారు. కలిసి ఏం మాట్లాడారన్నది మాత్రం చెప్పరు! కానీ... టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీని  సుదీర్ఘకాలం తర్వాత కలిసి, కరచాలనం చేయగానే వైసీపీ పెద్దలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. సుమారు అరగంటపాటు ‘టీడీపీ - బీజేపీ’ సంబంధాల గురించే మాట్లాడటం విశేషం. 


అసలేం జరిగింది... 

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్రం ఢిల్లీలో ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ పేరిట కార్యక్రమం నిర్వహించింది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలతోపాటు పలువురు ప్రముఖులను దీనికి ఆహ్వానించింది. ముఖ్యమంత్రి జగన్‌ దీనికి డుమ్మా కొట్టారు. కేంద్ర ఆహ్వానం మేరకు చంద్రబాబు మాత్రం హాజరయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబును మోదీ పక్కకు తీసుకెళ్లి కొద్దిసేపు మాట్లాడారు. ఆయనతో ఒకసారి ప్రత్యేకంగా కలవాలని అనుకుంటున్నట్లు చంద్రబాబు అన్నప్పుడు.. తాను కూడా మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయని, ఎప్పుడైనా రావచ్చని మోదీ చెప్పారు. ఇదీ జరిగింది! చంద్రబాబు దేశ రాజకీయాల్లో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న నేత. ఇద్దరు సీనియర్‌ నేతలు  చాలాకాలం తర్వాత ఒక చోట కలుసుకున్నప్పుడు మాట్లాడుకోవడం సహజమే. టీడీపీ వర్గాలు కూడా దీనిని అంతవరకే తీసుకున్నాయి. తర్వాత జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులు తనను కలిసినప్పుడు చంద్రబాబు ఇదే విషయం చెప్పారు.


 అంతకుమించి అదనంగా ఏమీ మాట్లాడలేదు. కానీ... వైసీపీ మాత్రం దీనిపై అనూహ్యంగా, విపరీతంగా స్పందించింది. చంద్రబాబు బీజేపీకి దగ్గరవ్వాలని చూస్తున్నారని.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి సహకరించి గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఒకపక్క ఆరోపణ చేస్తూనే.. మోదీ, చంద్రబాబు మధ్య కేవలం కుశల ప్రశ్నలు మాత్రమే జరిగి ఉండొచ్చని కూడా వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు అంత తీవ్ర విమర్శలకు దిగడమెందుకు? ఒకదానికొకటి పొంతన లేకుండా ఆయన చేసిన ఆరోపణల వెనుక ఆ పార్టీలో ఏర్పడిన భయం కనిపిస్తోందన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అనేక సంవత్సరాలుగా బీజేపీతో మైత్రి  నెరుపుతూ వచ్చిన వైసీపీ నాయకత్వం.. ఇప్పుడు టీడీపీని విమర్శించడం ఏమిటని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోరాడితే తమ గెలుపు కష్టమని వైసీపీ కలవర పడుతోందని... విడివిడిగా పోటీ చేస్తేనే మళ్లీ గెలవగలమని భావిస్తోందని ఒక టీడీపీ నాయకుడు తెలిపారు. వైసీపీ విమర్శల వెనుక అసలు వ్యూహం ఇదే అని చెప్పారు.


లొంగిపోయి వ్యవహరిస్తూ..

గత ఎన్నికల ముందు ఎన్‌డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చి బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ పోరాటం చేసింది. దీంతో టీడీపీకి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ.. బీజేపీకి చేరువైంది. అధికారికంగా బీజేపీతో పొత్తు పెట్టుకోకపోయినా ఆ పార్టీ నాయకత్వంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వస్తోంది.  ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి తన కేసుల కోసం బీజేపీ ప్రభుత్వానికి లొంగిపోయి వ్యవహరిస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా ఆ పార్టీలో ఉలుకూపలుకూ లేదు. వైసీపీపీ నేత విజయసాయిరెడ్డి ప్రతి రోజూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను ప్రశంసిస్తూ ట్వీట్లు పెడుతున్నారు. మోదీతో చంద్రబాబు భేటీని సజ్జల విమర్శిస్తున్న సమయంలోనే విజయసాయిరెడ్డి ఢిల్లీలో ప్రధానిని కలిసి ఆయన విధానాలను ప్రశంసించారు. తాము బీజేపీ అడుగులకు మడుగులొత్తుతూ.. చంద్రబాబు కొన్ని నిమిషాలు మోదీతో మాట్లాడడమే మహాపరాధంగా వైసీపీ నాయకత్వం ఆరోపణలు గుప్పించడం విస్మయం కలిగిస్తోంది. 


చంద్రబాబు ప్రధాని మోదీతో పూర్వ సంబంధాలను పునరుద్ధరించుకుంటే వైసీపీ నష్టపోతుందన్న భయం సజ్జల వ్యాఖ్యల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ‘చంద్రబాబును బూచిగా చూపించి జగన్‌రెడ్డి బీజేపీ కేంద్ర నాయకత్వం వద్ద ప్రాపకం పొందగలుగుతున్నారు. చంద్రబాబు బీజేపీకి దగ్గరైతే ఢిల్లీలో తన ప్రాధాన్యం తగ్గిపోతుందని ఇప్పుడు భయపడుతున్నారు. కేసులపరంగా ఒత్తిడి పెరుగుతుందేమోనన్న ఆందోళన కూడా ఉంది. అధికార వర్గాలు కూడా ఏకపక్షంగా అనుకూలంగా ఉండవు. అందుకే ఆయన ముందస్తుగా దాడి మొదలుపెట్టించారు’ అని టీడీపీ ముఖ్యుడొకరు విమర్శించారు. సజ్జల విమర్శల్లో భయం తప్ప విలువైన విషయం ఒక్కటి కూడా కనిపించలేదని, అక్కసు మాత్రం స్పష్టంగా గోచరిస్తోందని బీజేపీ మాజీ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. మొత్తానికి మోదీ-చంద్రబాబు కలయిక రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టిస్తోందనడానికి వైసీపీ స్పందన ఒక సూచిక అన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి.

Updated Date - 2022-08-09T09:33:05+05:30 IST