ఎన్టీఆర్‌ పేరుమార్పు దుర్మార్గం

ABN , First Publish Date - 2022-09-29T05:42:57+05:30 IST

యుగపురుషుడు నందమూరి తారక రామారావు హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చడం దుర్మార్గమని, పేరుమార్పు సరికాదని స్వయాన జగనరెడ్డి చెల్లలు షర్మిల అన్నారని టీడీపీ నాయకులు అన్నారు.

ఎన్టీఆర్‌ పేరుమార్పు దుర్మార్గం
మాట్లాడుతున్న ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇనచార్జ్‌ పరిటాలశ్రీరామ్‌


 


జగన బినామీ సంస్థల్లో లేపాక్షి హబ్‌ సొమ్ము 

ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.. బుద్ధి చెబుతారు

 బీకే, పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌


ధర్మవరం, సెప్టెంబరు 28: యుగపురుషుడు నందమూరి తారక రామారావు హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చడం దుర్మార్గమని, పేరుమార్పు సరికాదని స్వయాన జగనరెడ్డి చెల్లలు షర్మిల అన్నారని టీడీపీ నాయకులు అన్నారు. మండల పరిధిలోని కుణుతూరులో మాజీ ఎంపీపీ వేణుగోపాల్‌రెడ్డి నివాసంలో టీడీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, మాజీ మంత్రి పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ విలేకరులతో మాట్లాడారు. హెల్త్‌ యూనివర్సిటీ పేరును మార్చడం తెలుగు జాతిని అవమానించడమే అని బీకే అన్నారు. ‘ప్రభుత్వ పథకాలకున్న మీ నాన్న పేరు మార్చుకో.. ఎవరూ అభ్యంతరం తెలపరు. తెలుగు జాతికి కీర్తి సంపాదించిన మహానుబావుడి పేరు మార్చడంపై ప్రజలు చీదరించుకుంటున్నారు’ అని ఆయన మండిపడ్డారు. లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ అవినీతి సొమ్మంతా సీఎం జగన బినామీ సంస్థల్లోకి పెట్టుబడిగా వెళ్లిందని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో 500 ఎకరాలను నిబంధనల ప్రకారం తీసుకుని, రూ.13వేల కోట్ల పెట్టుబడితో కియా పరిశ్రమను తెచ్చామని అన్నారు. 

 

 గ్రామాల్లో బాదుడే-బాదుడు కార్యక్రమానికి అపూర్వ స్పందన వస్తోందని, ప్రుభుత్వంపై ఉన్న వ్యతిరేకత బయట పడుతోందని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. టీడీపీ హయాంలో రైతులకు 90 శాతం సబ్సిడీతో వ్యవసాయ పరికరాలను ఇచ్చామని, వైసీపీ అధికారంలోకి వచ్చాక రైతులను నట్టేటముంచిందని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు అభివృద్ధిని మరచి, దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు విభేదాలు వీడి, వచ్చే ఎన్నికలలో పరిటాల శ్రీరామ్‌ గెలుపునకు కలిసికట్టుగా కృషిచేయాలని పిలుపునిచ్చారు. 

 

 బాదుడే-బాదుడు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళుతుంటే.. ఈ ప్రభుత్వంలో పడుతున్న కష్టాలను మహిళలు ఏకరవు పెడుతున్నారని పరిటాల శ్రీరామ్‌ అన్నారు. అన్ని రకాల ధరలు పెంచి ప్రజలను వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని అన్నారు. వైసీపీ పట్ల ప్రజల్లో విపరీతమైన ఆగ్రహం ఉందని అన్నారు. ధర్మవరం చుట్టుపక్కల ప్రాంతాలల్లో తాతల కాలం నాటి భూములపై కూడా అధికారపార్టీ నాయకులు కన్నేశారని, కబ్జాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మరూరు రోడ్డులో అధికార పార్టీ నాయకులు భూములను కబ్జా చేస్తున్నారని, వాటిటిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రజలు ఓటు రూపంలో వైసీపీని గద్దె దింపడం ఖాయమని హెచ్చరించారు. అన్యాయాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించడం పరిపాటిగా మారిందని ఆగ్ర హం వ్యక్తం చేశారు. గ్రామాల్లో సమస్యలు సృష్టించి, వర్గాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. అమరావతి రైతుల పాదయాత్రను డైవర్ట్‌ చేయడానికి హెల్త్‌ యూనివర్సిటీ పేరును మార్చారని అన్నారు. పేదలకు కడుపు నింపపడానికి అన్న క్యాంటినలను తమ అధినేత చంద్రబాబు ఏర్పాటుచేస్తే, వాటిని తొలగించడంతోపాటు వైసీపీ రంగులు పూశారని అన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన చూసి జగన బుద్ధి తెచ్చుకోవాలని హితవుపలికారు. తమ ప్రభుత్వం వస్తే టీడీపీ రంగులు వేస్తామని అన్నారు. సమావేశంలో టీడీపీ కదిరి నియోజకవర్గ ఇనచార్జి కందికుంట వెంకటప్రసాద్‌, సీనియర్‌ నాయకుడు ఎల్‌ నారాయణచౌదరి, గడ్డం సుబ్రమణ్యం, గోనుగుంట్ల విజయ్‌కుమార్‌, అంబికాలక్ష్మీనారాయణ, రంగ య్య, గాండ్ల విశాలాక్షి, ముంటిమడుగు కేశవరెడ్డి, క మతం కాటమయ్య, మాజీ ఎంపీపీ కుణుతూరు వేణుగోపాల్‌రెడ్డి, చింతలపల్లి మహేశ చౌదరి, రూరల్‌ కన్వీనర్‌ పోతుకుంట లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-29T05:42:57+05:30 IST