అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

ABN , First Publish Date - 2022-10-01T06:06:43+05:30 IST

బంగారుపాళ్యం మండలం గుండ్లకట్టమంచిలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
ప్రియాంక మృతదేహం

భర్త, బంధువులే కొట్టి చంపారని తల్లిదండ్రుల ఆరోపణ

బంగారుపాళ్యం, సెప్టెంబరు 30: బంగారుపాళ్యం మండలం గుండ్లకట్టమంచిలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మృతదేహంపై గాయాలున్నాయని.. భర్త, అతడి బంధువులే కొట్టి చంపారంటూ ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన ప్రకారం.. తమిళనాడు రాష్ట్రం సైనిగుంటకు చెందిన మంజుల, నాగరాజ్‌ దంపతుల కుమార్తె ప్రియాంక (22)కు, గుండ్లకట్టమంచికి చెందిన అరుణ్‌కుమార్‌తో రెండున్నరేళ్ల కిందట వివాహమైంది. ఆ తర్వాత అదనపు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి. ఆమె భర్త, బావ, తోడికోడలు కొట్టి హింసించేవారని ఆమె తల్లిదండ్రులకు ఫోను ద్వారా చెప్పేది. ఈ క్రమంలో బుధవారం రాత్రి 9 గంటలకు ప్రియాంక ఫోను చేసి, తనను తీవ్రంగా కొడుతున్నారని, ఈ రాత్రికే చంపేస్తామని బెదిరిస్తున్నట్లు తల్లిదండ్రులకు తెలిపింది. ఉదయం వచ్చి మాట్లాడతామని వాళ్లు చెప్పారు. గురువారం ఉదయం ఆమె భర్త తరపు బంధువులు ఫోనుచేసి ప్రియాంకకు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్తున్నామని, తొందరగా రావాలని చెప్పారు. వీరు తమ బంధువులకు సమాచారమిచ్చి.. గుండ్లకట్టమంచికి బయలుదేరుతుండగా, ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ప్రియాంక చనిపోయిందని, మృతదేహాన్ని ఇంటికి తీసుకొస్తున్నట్లు చెప్పారు. మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు గుండ్లకట్టమంచికి వచ్చి ఆరా తీయగా.. ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు. మెడపై నల్లని చారలు, మొహంపైన, కడుపు వద్ద నల్లగా కమిలివుండడం, ప్రైవేట్‌ పార్టులవద్ద వాచివుండడం, ముద్దలు ముద్దలుగా పసుపు పెట్టివుండడాన్ని గుర్తించి సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు. అప్పటివరకు మృతదేహం వద్దకు భర్తకానీ, ఆమె బంధువులు గానీ రాకపోవడంతో వాళ్లే హత్య చేసినట్లు ఆరోపించారు. దహనసంస్కారాలు చేయవద్దని అడ్డుకుని ప్రియాంక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ నరసింహారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. రాత్రి కావడంతో మృతదేహాన్ని గ్రామంలోనే ఉంచి రెవిన్యూ, పోలీసు సిబ్బందిని కాపలాగా ఉంచారు. శుక్రవారం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళ్యం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. టీమ్‌ ఆఫ్‌ డాక్టర్లచే శవపరీక్ష నిర్వహించారు. అనంతరం ప్రియాంక మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం వారి తల్లిదండ్రులు సైనిగుంటకు తీసుకెళ్ళారు. కాగా ప్రియాంక నర్సింగ్‌ కోర్సు చదివి, ఓ ప్రైవేటు వైద్యశాలలో నర్సుగా పనిచేస్తుండేదని, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ బిడ్డ మృతిపట్ల పోలీసులు లోతుగా విచారణ జరిపి, కారణమైన వారిని శిక్షించాలని మంజుల, నాగరాజ్‌ కోరారు. 

Updated Date - 2022-10-01T06:06:43+05:30 IST