బియ్యం.. సంకటం

ABN , First Publish Date - 2022-10-01T06:26:03+05:30 IST

రేషన్‌ మాఫియాకు దాడుల భయం పట్టుకుంది. అలాగే కేంద్రప్రభుత్వం తాజాగా ఆహారధాన్యాల ఎగుమతులపై పన్ను పెంచడం కూడా శరాఘాతంగా మారింది. ఫలితంగా రేషన్‌ బియ్యం అక్రమ రవాణా కాస్తంత నిదానించింది.

బియ్యం.. సంకటం

రేషన్‌ దుకాణాల్లో భారీగా నిల్వలు

కార్డుదారులకు రూ.10 చొప్పున   ఇచ్చి  స్టాక్‌పెట్టుకున్న వైనం

కేంద్రం ఆంక్షలతోపాటు  నె ల్లూరు జిల్లాలో తనిఖీలు

జంకుతున్న రైసుమిల్లుల మాఫియా

ఫలితంగా కొనుగోళ్లు తగ్గించేసిన అధికార పార్టీ నేతలు

ధర తగ్గించి ఇచ్చినా సరే ఇస్తామంటున్న డీలర్లు

వ్యాపారుల నుంచి స్పందన కరువు


రేషన్‌ మాఫియాకు దాడుల భయం పట్టుకుంది. అలాగే కేంద్రప్రభుత్వం తాజాగా ఆహారధాన్యాల ఎగుమతులపై పన్ను పెంచడం కూడా శరాఘాతంగా మారింది. ఫలితంగా రేషన్‌ బియ్యం అక్రమ రవాణా కాస్తంత నిదానించింది. ఇది డీలర్లకు తలనొప్పిగా మారింది. కొనుగోళ్లు లేక దుకాణాల్లో భారీగా స్టాకు పేరుకుపోయింది. ఇటు వడ్డీలకు అప్పులు తెచ్చి వాటిని కార్డుదారులకు కేజీకి రూ.10చొప్పున వారు ఇచ్చారు. తీరా కొనుగోళ్లు తగ్గడంతో చివరకు రూ.4 తగ్గించైనా తీసుకోమని అడుగుతున్నా స్పందన కరువైంది. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికారపార్టీ నాయకులు కొందరు రైసుమిల్లుల మాటున రేషన్‌ దందాకు తెరతీశారు. అలాగే కొందరు స్థానిక నేతలు డీలర్ల నుంచి బియ్యం సేకరించి బడా వ్యాపారులకు అమ్ముతున్నారు. నెల్లూరు జిల్లాలో అక్రమ రవాణా వాహనాలపై నిఘా పెరిగిపోవడంతో మాఫియా బియ్యం ఎత్తేందుకు జంకుతోంది. మొత్తంగా ఈ వ్యవహారం డీలర్లకు సంకటంగా మారింది.


ఒంగోలు(కలెక్టరేట్‌), సెప్టెంబరు 30: రేషన్‌ అక్రమ రవాణాకు సరికొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. గత మూడేళ్ల నుంచి మూడు పువ్వులు.. ఆరుకాయలుగా సాగిన దందాకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఇతర దేశాలకు ఆహార ఎగుమతులపై కేంద్రప్రభుత్వం ట్యాక్స్‌ పెంచడంతోపాటు ఆంక్షలు విధించడంతో రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఆసక్తిచూపడం లేదు. సాధారణ రోజుల్లో రేషన్‌ షాపులకు బి య్యం వచ్చిన నాలుగైదు రోజుల్లోనే రైస్‌మిల్లులకు తరలించి అ క్కడి నుంచి లారీల్లో కృష్ణపట్నం పోర్టుకు తరలించేవారు. అయితే తాజాగా ఆహారధాన్యాలపై కేంద్రప్రభుత్వం ఆంక్షలు విధించడం, ఇంకొకవైపు 20శాతం ట్యాక్స్‌ పెంపుదలతో వ్యాపారులు బియ్యం ఎగుమతులు చేసేందుకు వెనకాడుతున్నారు. ఇంకొకవైపు నెల్లూరు జిల్లాలో రేషన్‌ అక్రమ రవాణాపై విస్తృతంగా దాడులు చేస్తున్నారు. దాంతోపాటు రహదారులపై వెళ్లే వాహనాలను నిలుపుదల చేసి తనిఖీలు చేస్తుండటంతో వ్యాపారులు బియ్యం తీసుకెళ్లేందుకు ఆలోచిస్తున్నారు.


జిల్లావ్యాప్తంగా భారీగా నిల్వలు

కాగా పునర్విభజన తర్వాత జిల్లాలో 6.55లక్షల రేషన్‌కార్డులు ఉండగా ఒక్కొక్కరికి ప్రభుత్వం ఐదు కిలోల బియ్యాన్ని ఇస్తోంది. అలా నెలకు జిల్లావ్యాప్తంగా 10,393 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని సబ్సిడీపై ఇస్తోంది. ఇంకొకవైపు కేంద్రప్రభుత్వం కూడా తెల్లరేషన్‌ కార్డుదారులకు ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. అలా రెండు విడతలు కలిపి జిల్లావ్యాప్తంగా 20,700 మెట్రిక్‌ టన్నులు వస్తున్నాయి. అలా రెండు ప్రభుత్వాలు పంపిణీ చేస్తున్న బియ్యంలో 30 నుంచి 35శాతం మంది కార్డుదారులు మాత్రమే రేషన్‌ తీసుకుంటున్నారు. మిగిలిన 65శాతం బియ్యాన్ని రేషన్‌షాపుల వద్ద అధికారపార్టీ నేతలు కొనుగోలు చేసి రైస్‌మిల్లులకు తరలిస్తున్నారు. రైసుమిల్లుల్లో ఆ బియ్యాన్ని పాలిష్‌ వేసి గోతాలను మార్చి ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. అయితే తాజాగా కేంద్రప్రభుత్వం విధించిన ఆంక్షలతో ఇతర దేశాలకు బియ్యాన్ని ఎగుమతులు చేసేందుకు ఇబ్బందిగా మారింది. దీంతో కొనుగోళ్లను పూర్తిగా తగ్గించి వేశారు.


రేషన్‌షాపుల్లో  నిలిచిన బియ్యం

కాగా తాజా పరిస్థితులతో జిల్లావ్యాప్తంగా రేషన్‌ షాపుల్లో భారీగా బియ్యం నిల్వలు పేరుకుపోయాయి. అడపాదడపా అక్కడక్కడ రాత్రి సమయంలో వాహనాల్లో తరలించేందుకు ఒకరిద్దరు ప్రయత్నాలు చేశారు. అయితే జిల్లాలోని రైసుమిల్లులకు  సరఫరా చేసి అక్కడ స్టాక్‌ పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే పోలీసులు, విజిలెన్స్‌ అధికారులు విస్తృతంగా దాడులు చేస్తుండటంతో అక్కడి నుంచి బయటకు తరలించేందుకు ధైర్యం చేయలేకపోతున్నారు. ఎక్కడైనా ధైర్యం చేసి ఎత్తేందుకు ప్రయత్నం చేసినా ఏదో ఒకచోట ఆ వాహనాలను పోలీసులు పట్టుకుంటున్నారు. దీంతో రైస్‌మిల్లుల్లోనూ నిల్వలు పేరుకుపోవడంతో డీలర్ల వద్ద నుంచి కొనుగోలుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని సమాచారం.


ఒంగోలులో ఐదారుగురే కొనుగోలు

ఒంగోలులో అధికారపార్టీకి చెందిన ఐదారుగురు మాత్రమే ఈ బియ్యాన్ని ప్రస్తుతం కొనుగోలు చేస్తున్నారు. రైస్‌మిల్లుల తరఫున గతంలో కొనుగోలు చేసిన వారు ముందుకు రాకపోవడంతో ఇప్పుడు ఒంగోలులో ధరలు తగ్గించి ఇస్తే కొంటామని ఆ వ్యాపారులు డీలర్లతో తెగేసి చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాము బియ్యం కొనుగోలు చేయలేమని, తరలించాలంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నందున తాము కిలోకు రూ.13 మించి ఇవ్వలేమని చెప్తున్నారని డీలర్లే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. 


ధర తగ్గించినా లాభం లేదు

రేషన్‌ బి య్యం ధరలను కూడా భారీగా తగ్గించి కొనుగోళ్లు కొన్ని ప్రాంతాల్లో చేపడుతున్నారు. అయితే అవి స్థానిక అవసరం కోసం చేస్తున్నట్లు సమాచారం. డీలర్‌ వద్ద నుంచి నిన్నా మొన్నటివరకు కిలో రూ.17 నుంచి రూ.18 వరకు అధికారపార్టీ నేతలు కొనుగోలు చేశారు. అయితే రైసుమిల్లుల మాటున రేషన్‌ మాఫియా నడిపిన బడా వ్యాపారులు ప్రస్తుతం దాడులు పెరిగిన నేపథ్యంలో కొనుగోళ్లు తగ్గించేశారు. కనీసం రూ.13 నుంచి రూ.13.50లోపు అయినా సరే ఇచ్చేస్తామని డీలర్లు చెబుతున్నారు. అయితే ఆ ధరకు కూడా వ్యాపారులు కొనుగోలు చేసేందుకు ముందుకు రాకపోవడంతో రేషన్‌షాపుల్లో నిల్వలు భారీగా పెరుకుపోయాయి. జిల్లాకేంద్రమైన ఒంగోలులోని రేషన్‌ షాపుల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఒక్కొక్క షాపుల్లో రెండు కోటాలు కలిపి ఇచ్చే బియ్యం సరాసరిన ఒక్కొక్కదానిలో 200 నుంచి 300 బస్తాల వరకు నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది.


Updated Date - 2022-10-01T06:26:03+05:30 IST