ltrScrptTheme3

జీవ‘భ్రాంతి’...!

Oct 18 2021 @ 00:30AM
జీవాలు (ఫైల్‌)

నీరుగారిన ‘లక్ష్యం’ 

చేయూత డబ్బులతో లింకు

అవి బ్యాంకులోనే ఉంటేనే 

రుణం అంటూ మెలిక

ఆసక్తి చూపని లబ్ధిదారులు 

11,937 యూనిట్లకు

3,822 మాత్రమే మంజూరు

అధికారుల ఆపసోపాలు

ఒంగోలు (జడ్పీ), సెప్టెంబరు 28 : 

పథకాలను ఆర్భాటంగా ప్రకటిస్తున్న ప్రభుత్వం వాటి అమలు విషయంలో అసంబద్ధంగా వ్యవహరిస్తోంది. నిబంధనల పేరుతో లబ్ధిదారులకు బంధనాలు వేస్తోంది. ఒకదానితో మరొకటి లింకు పెట్టి వారి ఆశలను నీరుగారుస్తోంది. భారీ లక్ష్యాలను ప్రకటించి ప్రచారానికే పరిమితం చేస్తోంది. జీవక్రాంతి పథకం అమలు తీరును పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం పథకాన్ని ప్రవేశపెట్టి సర్కారు చెప్పింది. జిల్లాలో 11,937 యూనిట్లు లక్ష్యంగా నిర్దేశించినట్లు ప్రకటించింది. గత ఏడాది డిసెంబర్‌లో పథకాన్ని ప్రారంభించింది. కానీ ఇప్పటి వరకూ కేవలం 3,822 యూనిట్లు మాత్రమే మంజూరయ్యాయి. చేయూత కింద ఇచ్చే నగదుకు, పశుక్రాంతికి లింకు పెట్టడమే ఇందుకు కారణమైంది. దీనిపై లబ్ధిదారులు పెదవివిరుస్తున్నారు. 


ప్రభుత్వం పశుక్రాంతి పథకాన్ని ప్రకటించడంతో మహిళలు ఆనందించారు. బ్యాంకుల నుంచి రుణం ద్వారా ఇప్పించే గొర్రెలు, గేదెలతో ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని ఆశించారు. కానీ ఆతర్వాత ప్రకటించిన నిబంధనలు వారి ఆశలను నీరుగార్చాయి. ప్రభుత్వం 2020 డిసెంబరులో జీవక్రాంతి పథకాన్ని తెరపైకి తెచ్చింది. దీని కింద జిల్లాలో ఎనిమిది నెలల్లో 11,937 యూనిట్లను పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. లబ్ధిదారులు కూడా యూనిట్లు తీసుకునేందుకు ఆసక్తి కనబర్చారు. అనంతరం కొద్ది రోజుల తర్వాత  విధివిధానాలను ప్రకటించింది. సరికొత్త నిబంధన అమల్లోకి తెచ్చింది. 

చేయూత పథకంతో లింకు

జీవక్రాంతి పథకం ప్రారంభించేటప్పుడు చేయూత డబ్బుల ఊసే ప్రభుత్వం తేలేదు. తీరా విధివిధానాలు ప్రకటించేటప్పుడు మాత్రం మెలిక పెట్టింది. 2020 సెప్టెంబరులో తొలివిడత చేయూత డబ్బులు మహిళ బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. జీవక్రాంతి పథకం డిసెంబర్‌లో ప్రారంభించారు. కానీ మార్గదర్శకాల్లో మాత్రం చేయూత పథకం కింద ఇచ్చిన రూ. 18,750ను బ్యాంకులో ఉన్నట్లు చూపితేనే రుణం ఇచ్చేలా మెలిక పెట్టింది. ఈ విషయంలో ఎస్సీ, ఎస్టీలకు మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం బీసీ, మస్లింలకు మాత్రం తప్పనిసరి చేసింది. 


పథకం అమలు ఇలా..

జీవక్రాంతి పథకం కింద అర్హత ఉన్న లబ్ధిదారులకు  14 గొర్రెలు, ఒక పొట్టేలు కానీ ఆవు లేక గేదె ఒక యూనిట్‌గా ప్రభుత్వం పేర్కొంది. యూనిట్‌ విలువ 75,000 కాగా, లబ్ధిదారురాలు బ్యాంకులో ఉంచిన చేయూత డబ్బులు రూ. 18,750పోను మిగిలిన రూ. 56,250 రుణంగా మంజూరు చేయిస్తామని స్పష్టం చేసింది. ఆ మొత్తాన్ని వాయిదాల రూపంలో బ్యాంకులకు తిరిగి చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ పథకంపై ఆశలు పెంచుకొని తొలుత అంగీకారం తెలిపిన వారు చేయూత నగదుతో ముడి పెట్టడంతో   వెనక్కి తగ్గారు.  క్షేత్రస్థాయిలో యంత్రాంగం ఎంత కష్టపడ్డా చేయూత డబ్బులను తాము అప్పటికే వేరే అవసరాలకు వాడుకున్నామని చాలామంది చేతులెత్తేశారు.


తొలి దశలో 3,057 మందికి మాత్రమే లబ్ధి

జీవక్రాంతి తొలిదశలో 3,057 మంది పథకం కింద లబ్ధిపొందారు. ప్రభుత్వం పథకం ప్రారంభంలో నిర్దేశించుకున్న లక్ష్యానికి, దీనికి పొంతనేలేదు. చేయూత మెలిక లేనప్పుడు దాదాపు పదివేల మందిపైనే అంగీకారం తెలిపారు. సర్కారు చేయూత నగదుకు లింకు పెట్టడంతో చివరికి ఆ సంఖ్య 3,057కు పరిమితమైంది.  తొలుత సమ్మతించిన వారిలో కనీసం 30 శాతం కూడా పథకం పట్ల ఆసక్తి చూపడం లేదు. రెండో విడతలో 765 యూనిట్లు ఇచ్చారు. మొత్తం మీద ఇప్పటి వరకూ కేవలం 3,822యూనిట్లు మాత్రమే పంపిణీ చేయగలిగారు. క్షేత్రస్థాయిలో పశుసంవర్థకశాఖతోపాటు, డీఆర్‌డీఏ అధికారులు ఎంత శ్రమించినా లబ్ధిదారులు ససేమిరా అంటున్నారు. రెండో విడతలో భాగంగా ఈ సంవత్సరం జూన్‌లో ప్రభుత్వం చేయూత డబ్బులు మహిళల ఖాతాల్లో జమ చేసింది. వీరిలో మరికొంత మందిని జీవక్రాంతి పథకం లబ్ధిదారులుగా చేర్చాలని యంత్రాంగం కసరత్తు చేస్తోంది  


వందశాతం పైనే లక్ష్యాన్ని చేరుకున్నాం

తొలి విడతలో భాగంగా 3,057 మంది జీవక్రాంతి పథకం కింద లబ్ధి పొందారు. వందశాతానికి పైగా లక్ష్యాన్ని చేరుకున్నాం. రెండో విడతలో ఇప్పటి వరకు 765 మందికి  ఈ పథకం కింద లబ్ధి చేకూరింది. ఇంకా ఆసక్తి ఉన్నవారు ఎవరైనా ముందుకువస్తే వారికి కూడా యూనిట్లు మంజూరు చేస్తా.  మహిళలకు ఆర్థిక స్వావలంబన  చేకూర్చాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మేము నిరంతరం శ్రమిస్తున్నాం

కె. బేబీరాణి, పశుసంవర్థకశాఖ జేడీ

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.