తెలుగుతల్లి ఫ్లైఓవర్‌పై ప్రమాదం

ABN , First Publish Date - 2021-12-08T06:09:04+05:30 IST

accident on teluguthalli flyover

తెలుగుతల్లి ఫ్లైఓవర్‌పై ప్రమాదం


డివైడర్‌ను ఢీకొన్న బైక్‌... యువకుడు, బాలిక మృతి 


మహారాణిపేట, డిసెంబరు 7: ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు, బాలిక మృతిచెందారు. మంగళవారం సాయంత్రం నగరం లోని తెలుగుతల్లి ప్లైఓవర్‌పై జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతానికి చెందిన ప్రశాంత్‌ (22) రైల్వే న్యూకాలనీలో నివసిస్తూ సీతమ్మధారలోని ఓ సెలూన్‌ షాప్‌లో పనిచేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై మురళీనగర్‌ ఎన్జీవో కాలనీకి చెందిన ఐ.రాధిక (17)తో కలసి ఆశీల్‌మెట్ట నుంచి రైల్వేస్టేషన్‌ వైపు ఫ్లైఓవర్‌ మీదుగా వెళుతుండగా డివైడర్‌ను ఢీకొన్నాడు. ప్రమాదంలో ఇద్దరూ రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. టూటౌన్‌ సీఐ వెంకటరావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ సల్మాన్‌బేగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉపాధి కూలీలకు బకాయిలు విడుదల


జిల్లాకు రూ.42.56 కోట్లు...వారంలో ఖాతాలకు జమ

విశాఖపట్నం, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ‘ఉపాధి హామీ పథకం’ పనులు చేసిన కూలీలకు ఎట్టకేలకు బకాయిలు విడుదలయ్యాయి. ఈ ఏడాది ఆగస్టు నుంచి కూలీలకు వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన బడ్జెట్‌కు మించి పనులు జరగడంతో చెల్లింపుల్లో ప్రతిష్ఠంభన నెలకొంది. అయితే దేశవ్యాప్తంగా ఇదే సమస్య ఉత్పన్నం కావడంతో చివరకు కేంద్రం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు జిల్లాకు రూ.42.56 కోట్లు వచ్చాయి.  అత్యధికంగా పెదబయలు మండలానికి రూ.4.14 కోట్లు, కొయ్యూరుకు రూ.3.14 కోట్లు, గూడెంకొత్తవీఽధికి రూ.2.96 కోట్లు, చింతపల్లికి రూ.2.77 కోట్లు, ముంచంగిపుట్టుకు రూ.2.67 కోట్లు, డుంబ్రిగుడకు రూ.2.63 కోట్లు, అరకులోయకు రూ.2.38 కోట్లు, హుకుంపేటకు రూ.2.08 కోట్లు, అనంతగిరికి రూ.2.02 కోట్లు, పాడేరుకు రూ.1.87 కోట్లు, గొలుగొండకు రూ.1.22 కోట్లు, నాతవరానికి రూ.1.06 కోట్లు, మాకవరపాలేనికి రూ.94 లక్షలు, మాడుగులకు రూ.77 లక్షలు విడుదలయ్యాయి. మైదానంలో మిగిలిన మండలాల్లో రూ.60 లక్షల కంటే తక్కువ బకాయిలు ఉన్నాయి. ఈ వారంలో కూలీల ఖాతాలకు బకాయిలు జమ చేయనున్నారు.

Updated Date - 2021-12-08T06:09:04+05:30 IST