కుటుంబ పాలనకు చరమగీతం

ABN , First Publish Date - 2022-07-02T08:34:44+05:30 IST

బీజేపీని ఉత్తరాది పార్టీ అనంటే.. దక్షిణాదినా పాగా వేసిందని... పట్టణ పార్టీ అనంటే దేశవ్యాప్తంగా పల్లెల్లో విస్తృతమైందని .

కుటుంబ పాలనకు చరమగీతం

  • కేసీఆర్‌కు ఓటమి తప్పదు.. 
  • టీఆర్‌ఎస్‌ది రైతు వ్యతిరేక ప్రభుత్వం
  • తొలిసారి ‘బ్రహ్మోస్‌’ ఎగుమతి.. 
  • దేశంతో పాటు తెలంగాణకూ గర్వకారణం
  • బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సుధాంశు త్రివేది


హైదరాబాద్‌, జూలై 1, (ఆంధ్రజ్యోతి): బీజేపీని ఉత్తరాది పార్టీ అనంటే.. దక్షిణాదినా పాగా వేసిందని... పట్టణ పార్టీ అనంటే దేశవ్యాప్తంగా పల్లెల్లో విస్తృతమైందని .బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు సుధాంశు త్రివేది అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయంగా కుటుంబపాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పాలన కోసం బీజేపీ ఓ ఉద్యమం చేస్తోందని చెప్పారు. హరియాణాలో చౌతాలా కుటుంబం, పంజాబ్‌లో బాదల్‌ కుటుంబం, ఏపీలో చంద్రబాబు కుటుంబం, తాజాగా మహారాష్ట్రలో థాకరే కుటుంబ పాలనలు ఏమయ్యాయో జనం చూశారని.. రేప్పొద్దున తెలంగాణలోనూ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని, కేసీఆర్‌కు ఓటమి తప్పదని అన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చిన ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు.


2004లో హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు 

కేంద్రంలో ముందస్తు ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. 


తాజాగా ఏ అంశాలపై దృష్టి పెడుతున్నారు?

2004లో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా దేశవ్యాప్తంగా పార్టీ విస్తరించలేదు. సంకీర్ణ ప్రభుత్వం స్థాయిలో ఉన్నాం. ఇప్పుడలా కాదు. మా పార్టీ వ్యవస్థీకృతంగా, రాజకీయంగా, బౌగోళికంగా అన్నిరకాలుగా బలపడింది. ఇప్పుడు జాతీయ కార్యవర్గ సమావేశాల్లో దేశస్థాయిలో ఎలా వ్యవహరించాలన్న దానిపై ఒక రాజకీయ తీర్మానం, ఒక ఆర్థిక తీర్మానం ఆమోదిస్తాం. అదేవిధంగా వ్యవసాయ సంబంధిత అంశాలపైనా చర్చిస్తాం. బీజేపీ తదుపరి టార్గెట్‌ తెలంగాణ. ఆ దిశగా ఏం చేయాలన్న దానిపైనా సమావేశంలో చర్చిస్తాం.


తెలంగాణ టార్గెట్‌ అంటున్నారు. సంస్థాగతంగా 

మీకు ప్రస్తుతం ఉన్న బలానికి అది సాధ్యమవుతుందని భావిస్తున్నారా? 


త్రిపురలాంటి రాష్ట్రంలో దశాబ్దాల తరబడి ఇంకో పార్టీకి అవకాశం ఇవ్వని చోట కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. అసాధ్యం అనుకున్న రాష్ట్రాల్లోనూ పాగా వేశాం. బీజేపీపై,  మోదీపై ప్రజలకున్న నమ్మకం అలాంటిది. కుటుంబపాలనకు బీజేపీ వ్యతిరేకం. తెలంగాణలో కూడా అదే నడుస్తోంది. దీనిపై ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారు. అంతేకాదు.. రైతులను కే సీఆర్‌ నిర్లక్ష్యం చేశారు. కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రెండుసార్లు తగ్గించింది. దేశంలో అనేక రాష్ట్రాలు తమ పన్నులనూ తగ్గించాయి. కానీ తెలంగాణలో మాత్రం తగ్గించలేదు. ఇక మా సంస్థాగత బలం జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చూశారు. ఇప్పుడు జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా 119నియోజకవర్గాలకు వెళ్లాం. న ల్లగొండ జిల్లాకు నేను కూడా వెళ్లా. ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా వాతావరణం కనిపించింది.


పెట్రోల్‌ రేట్లు బాగా పెంచేసి కొంతమేర కేంద్రం తగ్గించింది. 

కేంద్రమే ఇంకా తగ్గించాలన్న టీఆర్‌ఎస్‌ డిమాండ్‌పై ఏమంటారు? 


పెట్రోల్‌, డీజిల్‌ రేట్ల విషయంలో మార్కెట్‌ ధరల ప్రకారమే నడిచే పద్ధతి ఎప్పటినుంచో అమల్లో ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు తన పన్నులను తగ్గించింది. కొవిడ్‌ సమయంలో దేశంలో 80కోట్లమందికి ఉచితంగా రేషన్‌ అందించింది. చైనా సరిహద్దు ప్రాంతంలో వేలకోట్లతో అభివృద్ది చేశాం. అంతేకాదు...మన దేశం తొలిసారి బ్రహ్మోస్‌ క్షిపణులను ఎగుమతి చేయనుంది. ఫిలిప్పీన్స్‌ తొలి ఆర్డర్‌ ఇచ్చింది. ఇది దేశానికే కాకుండా....తెలంగాణకూ గర్వకారణమే. క్షిపణులపై పరిశోదన చేసే డీఆర్‌డీవో తెలంగాణలోనే ఉంది.  


డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం అని ప్రచారం చేస్తున్నారు. 

అంటే కేంద్రం, రాష్ట్రాల్లోనూ రెండు ప్రభుత్వాలు మీవి ఉంటేనే సాయం చేస్తారా?  


 కేంద్రంలో, రాష్ట్రంలో వేర్వేరు రాజకీయ పార్టీల ప్రభుత్వాలుంటే సాయం అందించబోమని కాదు. కానీ కేంద్రం-రాష్ట్రం కలిసి వెళ్తే తెలంగాణలో అద్భుతాలు సాధించవచ్చు. తెలంగాణలో ఉన్న అభివృద్ధి అవకాశాలు అపారం. వాటిని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అందిపుచ్చుకోలేకపోతోంది. అందుకే డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం ఏర్పడితే వాటన్నింటినీ సాకారం చేయవచ్చని చెబుతున్నాం.

Updated Date - 2022-07-02T08:34:44+05:30 IST