ప్చ్‌.. దేవుడా...!

ABN , First Publish Date - 2021-05-07T06:46:57+05:30 IST

జిల్లాలో పాజిటివ్‌లు భారీఎత్తున పుట్టుకొస్తున్నాయి. పుట్టగొడుగుల్లా విస్తరిస్తూ అన్ని ప్రాంతాలను కబళించేస్తున్నాయి.

ప్చ్‌.. దేవుడా...!

జిల్లాలో కొవిడ్‌ విలయతాండవం

వరుసగా కల్లోలం సృష్టిస్తున్న కేసులు

 గురువారం జిల్లావ్యాప్తంగా 3,531 పాజిటివ్‌లు నమోదు

 కొవిడ్‌ చరిత్రలో ఒక్కరోజులో ఇన్ని కేసులు ఇదే తొలిసారి

దేశంలో వేగంగా కేసులు విస్తరిస్తున్న 30 జిల్లాల్లో మనది 17వ స్థానం

 వేలాది కేసులతో ఆక్సిజన్‌, ఐసీయూ, వెంటిలేటర్‌ బెడ్లు ఫుల్‌

ఆసుపత్రుల్లో ఒక్కో పడకపై ఇద్దరేసి కొవిడ్‌ బాధితులకు చికిత్స

 కొత్తగా ఆరోగ్యం విషమిస్తే ఆసుపత్రుల్లో ఒక్క పడకకూ దిక్కులేని వైనం

మరోపక్క వేలల్లో పోటెత్తుతున్న పేషెంట్లతో ఆక్సిజన్‌కు కటకట

 ప్రాణవాయువు కొరతతో ప్రైవేటు ఆసుపత్రుల నిస్సహాయత

జిల్లాలో కొవిడ్‌ కల్లోలం సృష్టిస్తోంది. కనికరం లేకుండా మహమ్మారి      విలయతాండవం చేస్తోంది. ఒకటికాదు... వందకాదు.. వేలాది మందిని వైరస్‌ చుట్టుముట్టేస్తోంది. అమాంతం ప్రాణాలను హరించేస్తోంది. చిన్నాపెద్దా..   ముసలీముతకా ఎవరినీ విడిచిపెట్టకుండా వణికించేస్తూ ప్రాణభయంతో విలవిల్లాడేలా చేస్తోంది. రాకాసి వైరస్‌తో పోరాడే క్రమంలో కొందరు కన్నుమూస్తుండగా మరికొందరు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. ఇంకొందరు మనోధైర్యంతో పోరాడి విజేతలవుతున్నారు. ఇవన్నీ ఒకెత్తయితే కొవిడ్‌ మరణాల ధాటికి జిల్లాలో వందలాది కుటుంబాలు అనాథలవుతున్నాయి. కాగా జిల్లా కొవిడ్‌ చరిత్రలో ఎప్పుడులేని విధంగా గురువారం అత్యధికంగా 3,531 పాజిటివ్‌లు నమోదయ్యాయి. అటు దేశవ్యాప్తంగా భారీస్థాయిలో పాజిటివ్‌లు నమోదవుతూ ప్రమాదకరంగా ఉన్న 30 జిల్లాల జాబితాలో తూర్పు 17వ స్థానంలో ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. వీటన్నింటి నేపథ్యంలో     కొవిడ్‌ విలయంతో తూర్పు చిగురుటాకులా వణుకుతోంది. 

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో పాజిటివ్‌లు భారీఎత్తున పుట్టుకొస్తున్నాయి. పుట్టగొడుగుల్లా విస్తరిస్తూ అన్ని ప్రాంతాలను కబళించేస్తున్నాయి. వరుసపెట్టి వందలుదాటి వేలు.. అంతకు మించి రెట్టింపవుతున్నాయి. దీంతో కేసులకు అడ్డుకట్ట పడక అధికారులు తలలుపట్టుకుంటున్నారు. వేలాదిమంది హాహాకారాలు చేస్తున్నారు. టెస్ట్‌ల సంఖ్య పెరిగేకొద్దీ వైరస్‌ బారినపడ్డ బాధితులు అంతకంతకూ పెరుగుతూనే ఉండడంతో పరిస్థితి ఏం చేయాలో దిక్కుతోచని నిస్సహాయ స్థితిలోకి నెట్టేస్తోంది. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి మొదలు పాజిటివ్‌లు వందల నుంచి వేలల్లోకి చేరిపోవడంతో ఆసుపత్రులన్నీ బాధితుల రోదనలతో మిన్నంటుతున్నాయి. దీంతో జనం బిక్కుబిక్కుమంటూ ప్రాణభయంతో వణుకుతున్నారు. అటు జిల్లా కొవిడ్‌ చరిత్రలో తొలిసారి పాజిటివ్‌లు ఊహించనంత స్థాయిలో నమోదయ్యాయి. ఏకంగా గురువారం ఒక్కరోజులో 3,531 మందికి వైరస్‌ సోకింది. గతేడాది మార్చి నుంచి జిల్లాలో తొలివిడత కొవిడ్‌ ప్రభావంచూపగా, జూన్‌, జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో పాజిటివ్‌ల్లో వరుసగా వేలల్లో నమోదయ్యాయి. కానీ ఎప్పుడూ 2,500 నుంచి 2,800 మధ్యలో ఉండేవి. కానీ ఎప్పుడూ మూడు వేల కేసులు దాటలేదు. కానీ ప్రస్తుత సెకండ్‌వేవ్‌లో పాజిటివ్‌లు అడ్డూఅదుపూలేకుండా పరుగులు తీస్తున్నాయి. అందులోభాగంగా ఒక్కరోజులో 3,531గా నమోదవడం సర్వత్రా నోరెళ్లబెట్టేలా చేస్తోంది. గురువారం నాటి భారీ పాజిటివ్‌ల సంఖ్యతో రాష్ట్రంలో జిల్లా తొలిస్థానంలో నిలిచింది. అటు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్‌ల్లోను జిల్లా తొలిస్థానంలోనే ఉంది. దీంతో కొవిడ్‌ విలయం జిల్లాలో ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోపక్క దేశవ్యాప్తంగా భారీగా కేసులు నమోదవుతున్న తొమ్మిది రాష్ట్రాల్లోని 30 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించగా, ఆ జాబితాలో జిల్లా 17వ స్థానంలో నిలవడం మహమ్మారి విలయాన్ని సూచిస్తోంది. అటు తొలిసారి కొవిడ్‌ వేవ్‌లోను దేశవ్యాప్తంగా పాజిటివ్‌లు అత్యంతభారీగా ఉన్న పది జిల్లాల్లోను తూర్పుగోదావరి ఏడో స్థానంలో నిలిచింది. అప్పుడు,    ఇప్పుడు పాజిటివ్‌ల్లో జిల్లా దేశవ్యాప్తంగా అందరి దృష్టిలో నిలుస్తూనే ఉంది. అయితే సెకండ్‌వేవ్‌లో పాజిటివ్‌ల తీవ్రత అధికంగా ఉన్న 30 జిల్లాలు ఎందుకు ఉన్నాయనేదానిపై కేంద్రం ప్రత్యేక నివేదిక విడుదల చేసింది. అందులోభాగంగా జిల్లా గురించి ప్రస్తావించింది. ఏప్రిల్‌ 13 నుంచి 19 వరకు జిల్లాలో 4,300 పాజిటివ్‌లు నమోదైతే, 20 నుంచి 26 మధ్య 6,034 కేసులు, ఏప్రిల్‌ 27 నుంచి మే 3 మధ్య ఏకంగా 13,458 కేసులు నమోదయ్యాయి. దీన్నిబట్టి వేగంగా కేసులు నమోదవుతున్న ప్రమాదకర జిల్లాగా నిర్ధారించింది. కాగా గురువారం జిల్లాలో నమోదైన మొత్తం పాజిటివ్‌లతో కలిపి మొత్తం కేసులు 1,56,156కు చేరుకోగా, వివిధ ఆసుపత్రులు, హోంఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న పాజిటివ్‌ బాధితులు 20,603గా ఉన్నారు. కొవిడ్‌ మరణాలు గురువారం జిల్లాలో తొమ్మిది మంది మృతిచెందినట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 745గా నమోదైంది. 

పడకలేవీ?

వరుసపెట్టి వేలల్లో పాజిటివ్‌లు రావడం, అందులో సగానికిపైగా ఆక్సిజన్‌, ఐసీయూ, వెంటీలేటర్‌పైనే ఉండాల్సిన పరిస్థితుల నేపథ్యంలో ఎక్కడా పడకలు దొరకడం లేదు. దీంతో కొత్తగా కొవిడ్‌ నిర్ధారణ అయి పరిస్థితి క్షీణించిన వారికి బెడ్‌ దొరకడం కనాకష్టంగా ఉంది. ఒకరకంగా చెప్పాలంటే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పరిస్థితి విషమించి ఎక్కడికివెళ్లినా పడక లేదనే సమాధానం వస్తోంది. దీంతో ఏంచేయాలో తెలియక కొవిడ్‌ బాధితులు ఆరుబయట పడిగాపులు కాస్తున్నారు. తీరా సకాలంలో చికిత్స అందక ఎంతమంది మరణిస్తున్నారో లెక్కేలేదు. ఇటీవల రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట బెడ్‌ దొరక్క ఓ వ్యక్తి వచ్చిన ఆటోలోనే కూలబడి మరణించడం బెడ్‌లు లేని కొరతను చాటుతోంది. కాకినాడ జీజీహెచ్‌, రాజమహేంద్రవరం డీహెచ్‌, అమలాపురం కిమ్స్‌, జీఎస్‌ఎల్‌ ఇలా అత్యధిక ఐసీయూ, ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ ఉన్న ఈ ఆసుపత్రుల్లో అన్ని పడకలు నిండిపోయాయి. అంతేకాదు చేసేదిలేక పరిస్థితుల నేపథ్యంలో కొన్నిచోట్ల ఒకే పడకపై ఇద్దరిని ఉంచి చికిత్స చేస్తున్నారు. బయటేమో పడక కోసం పదుల సంఖ్య కొవిడ్‌ బాధితులు ఎదురుచూస్తున్నారు. పేరుకు కలెక్టర్‌తో సహా ఇతర జిల్లా అధికారులేమో వేలల్లో పడకలు ఉన్నట్టు ఆర్భాటంగా చెబుతున్నారు. తీరా అవన్నీ కొవిడ్‌కేర్‌ సెంటర్‌లలో ఉంటున్నాయి. అక్కడ ఆక్సిజన్‌, ఐసీయూ, వెంటిలేటర్‌ ఉండవు. కానీ అవసరమేమో వీటికే. ఇవేవీ లేకుండా పడకలేం చేసుకోవాలని బాధితులు ప్రశ్నిస్తున్నారు. గురువారం సాయంత్రం నాటికి ప్రభుత్వం ప్రకటించిన పడకల ఖాళీల వివరాలు చూస్తే జీజీహెచ్‌, డీహెచ్‌, జీఎస్‌ఎల్‌, కిమ్స్‌ తదితర ఆసుపత్రుల్లో ఒక్క ఆక్సిజన్‌, ఐసీయూ, వెంటిలేటర్‌ బెడ్‌ లేదు. మొత్తం 77 ప్రభుత్వ, ప్రైవేటు కొవిడ్‌ ఆసుపత్రుల్లో 651 ఐసీయూ పడకలుంటే, 231 పడకలు ఖాళీగా చూపిస్తున్నారు. కానీ ఇవన్నీ ఊరుపేరులేని ఆసుపత్రులు. ఆక్సిజన్‌ పడకలు మొత్తం ఆసుపత్రుల్లో 2,682 కాగా, 412 ఖాళీగా చూపిస్తున్నారు. ఇవన్నీ ప్రైవేటు ఆసుపత్రుల్లో. వాస్తవానికి ఈ ఆసుపత్రులకు తీవ్రమైన ఆక్సిజన్‌ కొరత ఉండడంతో వేరేచోటకు వెళ్లిపోవాలంటూ బాధితులకు తెగేసి చెబుతున్నాయి. ఎవరికైనా పరిస్థితి విషమించి పడక అవసరం ఏర్పడితే దేవుడే దిక్కు అన్నట్టు జిల్లాలో పరిస్థితి తయారైంది.

ఏ మండలంలో ఎన్ని పాజిటివ్‌లంటే...

కాకినాడలో అత్యధికంగా 449 కేసులు

జిల్లావ్యాప్తంగా గురువారం 3,531 పాజిటివ్‌లు నమోదవగా, వీరిలో 2,917 మందిని హోం ఐసోలేషన్‌ చికిత్సకు అనుమతించారు. కొత్తగా ఎనిమిది కంటైన్మెంట్‌ జోన్లను విధించారు. కాగా కాకినాడలో అత్యధికంగా 449 పాజిటివ్‌లు నమోదవగా, కాకినాడ రూరల్‌లో 190 నిర్ధారణ అయ్యాయి. రాజమహేంద్రవరంలో 394, రాజమహేంద్రవరం రూరల్‌లో 223 చొప్పున నమోదయ్యాయి. కె.గంగవరం 109, అల్లవరం 141, అమలాపురం 149, రామచంద్రపురం 156, రాయవరం 103, ఉప్పలగుప్తం 98, తుని 84, యు.కొత్తపల్లి 62, తొండంగి 52, సఖినేటిపల్లి 61, రాజోలు 48, రంగంపేట 43, రాజవొమ్మంగి 40, పిఠాపురం 44, పెద్దాపురం 47, పెదపూడి 30, పి.గన్నవరం 45, ముమ్మిడివరం 49, మామిడికుదురు 85, మలికిపురం 63, కొత్తపేట 57, కపిలేశ్వరపురం 42, కాజులూరు 47, బిక్కవోలు 88, అనపర్తి 39, ఆలమూరు 62 చొప్పున నమోదయ్యాయి. కాగా గురువారం 10,316 మందికి వ్యాక్సిన్‌ వేయగా, ఇంతవరకు వ్యాక్సిన్‌ 4,87,344 మందికి పంపిణీ పూర్తయింది.

కొవిడ్‌తో జీజీహెచ్‌ హెడ్‌నర్సు పద్మావతి మృతి

జీజీహెచ్‌ (కాకినాడ), మే 6: కాకినాడ జీజీహెచ్‌లో హెడ్‌ నర్సుగా విధులు నిర్వహిస్తున్న తిరుకువల్లూరి పద్మావతి (58) కొవిడ్‌బారిన పడి గురువారం మృతి  చెందింది. హెడ్‌నర్స్‌ మృతితో జీజీహెచ్‌లో విషాదఛాయలు అలముకున్నాయి. మూడున్నర దశాబ్దాలుగా స్టాఫ్‌       నర్స్‌గా, హెడ్‌ నర్స్‌గా ఆమె సేవలందించింది. ఇటీవల విధి నిర్వహణలో ఉండగా కొవిడ్‌ లక్షణాలు కనిపించగా టెస్ట్‌ చేయించగా పాజిటివ్‌ నిర్థారణైంది. హోం ఐసోలేషన్‌లో ఉంటున్న క్రమంలో ఆరోగ్యపరిస్థితి క్షీణించడంతో జీజీహెచ్‌లో ఈనెల 3న చేరింది. చికిత్స పొందుతూ కోలుకుంటున్న క్రమంలో ఆరోగ్యం విషమించి గురువారం మృతి చెందింది. పద్మావతికి కుమారుడు, కుమార్తె. భర్త కొన్నేళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందగా, కుమారుడు గత ఏడాది గుండెపోటుతో మృతి చెందాడు. కుమార్తె మృ దుల గర్భిణి. ఈమెకూ కరోనా సోకడంతో  జీజీహెచ్‌లో చికిత్స కోసం చేరగా 4న ప్రసవించిం ది. ఈ నేపథ్యంలో కొవిడ్‌తో తల్లి పద్మావతి మృ తి చెందడంతో ఆఖరిచూపునకూ  నోచుకోలేదు. కాగా ఆమె మృతదేహాన్ని సహచర నర్సులు, హెడ్‌ నర్సులు సందర్శించి నివాళులర్పించారు.    

జైలు వార్డర్‌ రామాంజనేయులు మృతి

రాజమహేంద్రవరం సిటీ, మే6: రాజమహేంద్రవరం సబ్‌జైలులో వార్డర్‌గా పని చేస్తున్న కె. రామాంజనేయులు కరోనాతో మృతిచెందారు. కొత్తపేట సబ్‌జైలు నుంచి డిప్యూటేషన్‌పై రాజ మహేంద్రవరం సబ్‌జైలు డీఎస్పీ కార్యాలయం లో పనిచేస్తున్న ఆయన గత కొద్దిరోజుల కింద ట కరోనా బారినపడడంతో సెలవు పెట్టి ఇంటి వద్ద ఐషోలేషన్‌లో ఉన్నారు. గురువారం పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం ప్రకాష్‌ నగర్‌లోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా, అక్కడ మరణించారు. రామాంజనేయులు మృతిపట్ల ఇక్కడి సబ్‌జైలు సిబ్బంది సంతాపం ప్రకటించారు.


Updated Date - 2021-05-07T06:46:57+05:30 IST