ఖాళీ జాగా.. వేసేయ్‌ పాగా..!

ABN , First Publish Date - 2022-01-22T03:45:36+05:30 IST

ఉదయగిరి పట్టణంలో ఖాళీ జాగా కనిపిస్తే పాగా వేస్తున్నారు. పాగా వేసిన స్థలాల్లో గుట్టుచప్పుడు కాకుండా రాత్రికిరాత్రే బేస్‌మట్టాలు నిర్మిస్తూ కబ్జా చేస్తున్నారు.

ఖాళీ జాగా.. వేసేయ్‌ పాగా..!
ఆక్రమణకు గురైన ఆర్‌అండ్‌బీ స్థలం

ప్రభుత్వ స్థలం కనిపిస్తే కబ్జా

వందలాది అంకణాల ఆక్రమణ

గుట్టుచప్పుడు కాకుండా నిర్మాణం

రూ.కోటి విలువైన స్థలాలు హాంపట్‌

ఉదయగిరి, జనవరి 21: ఉదయగిరి పట్టణంలో ఖాళీ జాగా కనిపిస్తే పాగా వేస్తున్నారు. పాగా వేసిన స్థలాల్లో గుట్టుచప్పుడు కాకుండా రాత్రికిరాత్రే బేస్‌మట్టాలు నిర్మిస్తూ కబ్జా చేస్తున్నారు. రోజురోజుకు స్థలాల ఆక్రమణకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. స్థలాలు ఆక్రమించి రూ.లక్షలకు విక్రయించి జేబులు నింపుకొంటున్నారు.

రూ.కోటి విలువన స్థలాలు అన్యాక్రాంతం : పట్టణంలోని పలు సర్వే నెంబర్లలో రూ.కోటి విలువ కలిగిన స్థలాలను కొందరు కబ్జా చేసి గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తూ సొమ్ము చేసుకొంటున్నారు. మరికొందరు ఏకంగా భవంతులు నిర్మిస్తున్నారు. పట్టణంలోని సర్వేనెంబర్‌ 60/2బీ 96 ఎకరాల్లో కొంతమంది స్థలాలను ఆక్రమించారు. అలాగే 1147, 67, 1212, 45/2, 50, 1282, 1137 సర్వేనెంబర్లలో వందలాది అంకణాలు కబ్జా చేసి బేస్‌మట్టాలు వేసి విక్రయించుకొంటున్నారు. అలాగే పలువురు ఆయా స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పట్టణంలో అంకణం రూ.50 వేల నుంచి రూ.2.50 లక్షల వరకు ధర పలుకుతోంది. కొందరు ప్రభుత్వ స్థలాలను ఏకంగా అన్యాక్రాంతం చేస్తున్నారు. మరికొందరు ధనవంతులు సైతం ఖాళీ స్థలాలను అక్రమించి బేస్‌మట్టాలు నిర్మించి లక్షలాది రూపాయలకు విక్రయిస్తున్నారు. ఉదయగిరి పట్టణంలోని గ్రంంఽథాలయం వెనుకవైపు, ఈద్గా కట్ట, చింతల్‌, షబ్బీర్‌కాలనీ, హుస్సేన్‌కుంట, స్టేట్‌పేట, పూసల కాలనీ, నెల్లూరు, కావలి మార్గాల్లోని బీసీ కాలనీలు, ఆనకట్ట సమీపంలో రోడ్ల భవనాల శాఖకు చెందిన స్థలాలతోపాటు అనేకచోట్ల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలాలను కొందరు గుట్టుచప్పుడు కాకుండా అక్రమించుకుని బేస్‌మట్టాలు నిర్మించుకొన్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి స్థలాలు కబ్జా జరగకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. 


Updated Date - 2022-01-22T03:45:36+05:30 IST