తిరుపతికి త్వరలో మరింత ‘ప్రాణవాయువు’

ABN , First Publish Date - 2021-05-15T06:16:45+05:30 IST

తిరుపతి రుయా, స్విమ్స్‌-పద్మావతి కొవిడ్‌ ఆస్పత్రుల్లో 10 కేఎల్‌ సామర్థ్యంతో రెండు ఆక్సిజన్‌ ట్యాంకులను ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన నిర్మిస్తోంది.

తిరుపతికి త్వరలో మరింత ‘ప్రాణవాయువు’

రుయా, స్విమ్స్‌లో 10కేఎల్‌ సామర్థ్యంతో రెండు ఆక్సిజన్‌ ట్యాంకుల ఏర్పాటు 


తిరుపతి, ఆంధ్రజ్యోతి: కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రతతో బాధితులు ‘ఊపిరి’ తీసుకోలేకపోతున్నారు. అత్యధిక పేషెంట్లకు ప్రాణవాయువు అవసరమవుతోంది. ఆక్సిజన్‌ బెడ్లకు డిమాండు పెరిగింది. ఈ క్రమంలో తిరుపతిలోని రుయా, స్విమ్స్‌- పద్మావతి కొవిడ్‌ ఆస్పత్రుల్లో 10కేఎల్‌ సామర్థ్యంతో రెండు ఆక్సిజన్‌ ట్యాంకులను ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన నిర్మిస్తోంది. స్విమ్స్‌లో ట్యాంకర్‌ పనులు శరవేగంగా జరుగుతుండగా, రుయాలో సోమవారం మొదలయ్యాయి. రుయాలో పనులు పదిరోజుల్లో పూర్తవుతాయని,  స్విమ్స్‌లో వారంలో పూర్తవుతాయని ఏపీ ఎంఐడీసీ ఇంజనీరు రమేష్‌ తెలిపారు. ఇక, 200 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి. వీటిని కొవిడ్‌ సెంటర్లలో వినియోగించనున్నారు. మదనపల్లెలో 200 ఎల్పీఎం (లీటర్‌ పర్‌ మినిట్‌) సామర్థ్యం గల ఆక్సిజన్‌ జనరేటర్లను ఏర్పాటు చేయనున్నారు. నేషనల్‌ హైవే అథారిటీ సౌజన్యంతో దీనిని నిర్మించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లాలో రోజుకు 49.56 టన్నుల ఆక్సిజన్‌ అవసరం. ఇందులో డీ-టైప్‌ సిలిండర్ల ద్వారా 19.87 టన్నులు, స్టోరేజీ ట్యాంకుల ద్వారా 29.69 టన్నులు సరఫరా అవుతోంది. కొత్తగా ఏర్పాటయ్యే ఆక్సిజన్‌ ట్యాంకులు, జనరేటర్లు అందుబాటులోకి వస్తే ఆక్సిజన్‌ కొరత తీరినట్టేనని అధికారులు చెబుతున్నారు. 


మెడికల్‌ ఆక్సిజన్‌ తయారీ యూనిట్లు ఇవే

ఏర్పేడు మండలంలోని శ్రీకృష్ణ ఇండస్ట్రియల్‌ గ్యాసెస్‌ యూనిట్‌ 10కేఎల్‌ , పూడిలోని శ్రీరాఘవేంద్ర ఆక్సిజన్‌ కంపెనీ, సప్తగిరిలోని ఎయిర్‌ ప్రొడక్ట్స్‌ 13 కేఎల్‌ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఇవి గంటకు 40 సిలిండర్లకు ఆక్సిజన్‌ నింపగలవు. ఇక జిల్లాలోని 8 మెడికల్‌ ఆక్సిజన్‌ డిస్ట్రిబ్యూటర్ల నుంచి చిన్న, పెద్ద సిలిండర్లు కలిపి రోజుకు 1008 సరఫరా అవుతున్నాయి. మదనపల్లెలో 200 ఎల్పీఎం జనరేటర్‌ అందుబాటులోకి వస్తే ఆక్సిజన్‌ గురించి వెతుక్కోనవసరంలేదనేది అధికారుల అభిప్రాయం. 

Updated Date - 2021-05-15T06:16:45+05:30 IST