హైకోర్టుకు 10 మంది కొత్త జడ్జిలు

ABN , First Publish Date - 2022-03-23T09:00:12+05:30 IST

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన 12 మంది పేర్లలో 10 మంది పేర్లకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోద ముద్ర వేశారు.

హైకోర్టుకు 10 మంది కొత్త జడ్జిలు

  • కొలీజియం సిఫారసు చేసిన వారిలో ఇద్దరికి లభించని రాష్ట్రపతి ఆమోదం
  • వీరిలో ఐదుగురు న్యాయవాదులు.. ఐదుగురు న్యాయాధికారులు
  • మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం
  • న్యాయవాదుల కోటాలో ఇద్దరికి లభించని ఆమోదం
  • మొత్తం 29కి పెరిగిన జడ్జిల సంఖ్య.. ఇంకా 13 ఖాళీలు


హైదరాబాద్‌, మార్చి 22(ఆంధ్రజ్యోతి): తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన 12 మంది పేర్లలో 10 మంది పేర్లకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోద ముద్ర వేశారు. దీంతో న్యాయమూర్తుల నియామకాలను నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. వీరిలో న్యాయవాదుల కోటా నుంచి ఐదుగురు, న్యాయాధికారుల (జ్యుడీషియల్‌ ఆఫీసర్స్‌) కోటా నుంచి ఐదుగురు ఉన్నారు. న్యాయమూర్తులుగా నియమితులైనవారిలో కాసోజు సురేందర్‌, సూరేపల్లి నందా, ముమ్మినేని సుధీర్‌ కుమార్‌, జువ్వాడి శ్రీదేవి, నచ్చరాజు శ్రవణ్‌కుమార్‌, జి.అనుపమా చక్రవర్తి, ఎంజీ ప్రియదర్శిని, సాంబశివరావునాయుడు, ఏనుగు సంతోష్‌ రెడ్డి, డాక్టర్‌ దేవరాజు నాగార్జున్‌ ఉన్నారు. కాగా, న్యాయవాదుల కోటా నుంచి ఏడుగురిని, న్యాయాధికారుల కోటా నుంచి ఐదుగురిని హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం గత నెలలో రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. అయితే, న్యాయవాదుల కోటాలో చాడా విజయభాస్కర్‌రెడ్డి, మీర్జా సైఫుల్లా బేగ్‌ నియామకానికి ఆమోదం లభించలేదు. కొత్త న్యాయమూర్తులు గురువారం ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.


ఏడు నెలల్లో 17 మంది నియామకం

హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 42. ప్రస్తుతం 19 మంది ఉన్నారు. మంగళవారం పదిమంది నియామకంతో న్యాయమూర్తుల సంఖ్య 29కి పెరిగింది. ఇంకా 13 ఖాళీలున్నాయి. గత ఏడాది ఆగస్టులో న్యాయాధికారుల 


కోటాలో ఏడుగురు న్యాయమూర్తులు నియమితుల య్యారు. తాజా నియామకాలతో ఏడు నెలల్లో తెలంగాణ హైకోర్టుకు 17 మంది న్యాయమూర్తులు వచ్చినట్లయింది. 2019 జనవరి 1న తెలంగాణ హైకోర్టు ఏర్పడింది. అప్పుడు న్యాయమూర్తుల సంఖ్య 24 మాత్రమే. జస్టిస్‌ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ సంఖ్యను 42కు పెంచారు.


కొత్తవారిలో నలుగురు మహిళలు.. 

కొత్తగా నియామకమైన 10 మంది న్యాయమూర్తుల్లో నలుగురు మహిళలున్నారు. వీరితో కలిపి హైకోర్టులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య పదికి చేరింది. దీంతో దేశంలో మద్రాస్‌ హైకోర్టు తర్వాత తెలంగాణ హైకోర్టులోనే అత్యధిక మహిళా న్యాయ మూర్తులున్నట్లయింది.


న్యాయవాదుల కోటా నుంచి న్యాయమూర్తులు

కాసోజు సురేందర్‌ : ప్రమీలాదేవి, లక్ష్మీనారాయణ దంపతులకు 1968లో మహబూబ్‌నగర్‌ జిల్లాలో జన్మించారు. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో పాఠశాల విద్య చదివారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. 1992లో ఉమ్మడి ఏపీ హైకోర్టులో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. ప్రముఖ క్రిమినల్‌ లాయర్‌ పి.సీతాపతి వద్ద జూనియర్‌గా చేరారు. ఏసీబీ, సీబీఐ సహా అన్ని క్రిమినల్‌ కోర్టుల్లో ప్రాక్టీస్‌ చేశారు. ప్రస్తుతం హైకోర్టులో సీబీఐ తరఫు న్యాయవాదిగా నాలుగోసారి సేవలందిస్తున్నారు. కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తరఫున స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరిస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోకుల్‌ ఛాట్‌, లుంబినీ పార్కు, దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల కేసు, సత్యం కుంభకోణం కేసుల్లో ప్రభుత్వ ఏజెన్సీల తరఫున వాదనలు వినిపించారు. ఏపీ ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్‌ కేసుల్లో సీబీఐ తరఫున వాదనలు వినిపించారు.


సూరేపల్లి నందా: సికింద్రాబాద్‌కు చెందిన బి.దానప్ప, మీరా దంపతులకు 1969 ఏప్రిల్‌ 4న జన్మించారు. బీఏ ఇంగ్లిష్‌ లిటరేచర్‌ చేశారు. ఎల్‌ఎల్‌బీ అనంతరం 1993లో ఉమ్మడి ఏపీ హైకోర్టులో న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్నారు. 28 ఏళ్లపాటు సివిల్‌, క్రిమినల్‌, రెవెన్యూ, కార్మిక, సర్వీసులు సహా అన్ని విభాగాల్లో ప్రాక్టీస్‌ చేశారు. లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా తరఫున పలు కార్యక్రమాల్లో సేవలందించారు. రాష్ట్ర ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా, కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా, నిమ్స్‌, కార్పొరేషన్‌ బ్యాంకు కౌన్సెల్‌గా, హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ కార్యదర్శిగా వ్యవహరించారు. న్యాయ సేవల్లో కృషికి గుర్తింపుగా ఆచార్య చాణక్య సద్భావన పురస్కారం అందుకున్నారు. ఇటీవలే హైకోర్టును ఈమెను డిజిగ్నేటెడ్‌ సీనియర్‌ న్యాయవాదిగా గుర్తించింది.


జువ్వాడి శ్రీదేవి: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన జువ్వాడి సూర్యారావు, భారతి దంపతులకు 1972లో జన్మించారు. 1997లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు చేయించుకున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌ కోర్టులో 2008 వరకు అడిషనల్‌ పీపీగా పనిచేశారు. 2017 వరకు హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా సేవలందించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా సేవలందిస్తున్నారు. ఆమె భర్త శ్రీహరిరావు న్యాయవాదిగా పనిచేస్తున్నారు.


నచ్చరాజు శ్రవణ్‌కుమార్‌: సిద్దిపేట జిల్లా గుగ్గిళ్ల గ్రామానికి చెందిన శ్రవణ్‌కుమార్‌.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పెద్ద కుమార్తె శారద, వెంకటకిషన్‌రావు దంపతుల కుమారుడు. 1967లో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీకాం, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. రాంచీ బిట్స్‌లో ఎంబీఏ, నల్సార్‌ యూనివర్సిటీలో సైబర్‌ లాలో పీజీ డిప్లొమా చేశారు. 2005లో ఉమ్మడి ఏపీ హైకోర్టులో న్యాయవాదిగా నమోదు చేయించుకున్నారు. సివిల్‌, ట్యాక్స్‌, కంపెనీ లా విభాగాల్లో ప్రాక్టీసు చేశారు. ప్రస్తుతం హైకోర్టులో నీటిపారుదల శాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాదిగా సేవలందిస్తున్నారు.


న్యాయాధికారుల కోటా నుంచి..

జి.అనుపమా చక్రవర్తి: ప్రస్తుతం తెలంగాణ వ్యాట్‌ ట్రైబ్యునల్‌ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. స్వస్థలం ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పాలకొండ గ్రామం. 1970లో ఎన్‌.కృష్ణచందర్‌రావు, మహాలక్ష్మి దంపతులకు జన్మించారు. విశాఖపట్నంలోని ఎన్‌బీఎం లా కాలేజీలో చదివారు. 1994లో ఉమ్మడి ఏపీ హైకోర్టులో న్యాయవాదిగా నమోదు చేయించుకున్నారు. సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వద్ద జూనియర్‌ న్యాయవాదిగా చేరారు. 2008లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. అదనపు జిల్లా జడ్జిగా సర్వీస్‌ ప్రారంభించారు. తెలంగాణ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ మెంబర్‌ సెక్రటరీగా.. హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌గా, కో ఆపరేటివ్‌ ట్రైబ్యునల్‌ చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు.


మాటూరి గిరిజా ప్రియదర్శిని: అప్పారావు, నాగరత్నమ్మ దంపతులకు ఏపీలోని విశాఖపట్నం లో జన్మించారు. పొలిటికల్‌ సైన్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, సోషియాలజీ చదివారు. విశాఖపట్నం ఎన్‌బీఎం లా కాలేజీలో న్యాయవిద్య పూర్తిచేశారు. 1995లో ఉమ్మడి ఏపీ హైకోర్టులో న్యాయవాదిగా నమోదు చేయించుకున్నారు. విశాఖపట్నం జిల్లా కోర్టులో ఏడేళ్లు ప్రాక్టీస్‌ చేశారు. 2008లో గుంటూరు అదనపు జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం కరీంనగర్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. 


సాంబశివరావు నాయుడు: ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన సాంబశివరావు నాయుడు.. 1962లో సత్యనారాయణ, సూర్యావతి దంపతులకు జన్మించారు. వీరిది వ్యవసాయ కుటుంబం. మూడో ఏటనే తండ్రిని కోల్పోయారు. ఇంటర్‌ రామచంద్రాపురంలో, డిగ్రీ అమలాపురంలో, ఎల్‌ఎల్‌బీ ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పూర్తి చేశారు. క్రిమినల్‌ లాయర్‌ పిల్లా జానకిరామయ్య వద్ద జూనియర్‌గా ప్రాక్టీస్‌ చేశారు. 1991లో జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికై.. వివిఽధ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌ ఏసీబీ కోర్టు ప్రిన్సిపల్‌ స్పెషల్‌ జడ్జిగా పనిచేస్తున్నారు.


ఏనుగు సంతోష్‌రెడ్డి: జగిత్యాల జిల్లా జోగిన్‌పల్లి గ్రామానికి చెందినవారు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు నారాయణరెడ్డి వీరి తండ్రి. జగిత్యాల ఎస్‌కేఎన్‌ఆర్‌ కాలేజీలో డిగ్రీ, అనంతపురంలోని ఎస్‌కే యూనివర్సిటీ నుంచి లా, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. 1985లో ఉమ్మడి ఏపీ హైకోర్టులో న్యాయవాదిగా నమోదు చేయించుకున్నారు. కరీంనగర్‌ జిల్లా కోర్టులో ప్రాక్టీస్‌ చేశారు. 1991లో జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికయ్యారు. రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ మెంబర్‌ సెక్రటరీ సహా వివిధ హోదాల్లో పనిచేశారు. 2013లో ఉమ్మడి ఏపీలో న్యాయ శాఖ కార్యదర్శిగా నియామకమయ్యారు. 2019లో రెండోసారి నియమితులయ్యారు.


డాక్టర్‌ దేవరాజు నాగార్జున్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తికి చెందిన డాక్టర్‌ దేవరాజు నాగార్జున్‌ 1962లో రామకృష్ణారావు, విమలా దేవి దంపతులకు జన్మించారు. వనపర్తిలో బీఎస్సీ, గుల్బర్గాలోని ఎస్‌ఎ్‌సఎల్‌ లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ, అక్కడి భారతీయ విద్యాభవన్‌లో పీజీ డిప్లొమా, అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌ చదివారు. నల్సార్‌ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. 1991లో జూనియర్‌ సివిల్‌  జడ్జిగా ఎంపికై వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ప్రిన్సిపల్‌ ప్రైవేట్‌ సెక్రటరీగా, ఏపీ పోలీస్‌ అకాడమీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌గా ఉన్నారు.


ముమ్మినేని సుధీర్‌కుమార్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లకు చెందిన ముమ్మినేని సుధీర్‌కుమార్‌ 1969లో నాగేశ్వరరావు, భరతలక్ష్మి దంపతులకు జన్మించారు. ఇంటర్‌ వరకు చర్లలో, ఏలూరు సీఆర్‌రెడ్డి కాలేజీలో డిగ్రీ, నాందేడ్‌ అంబేడ్కర్‌ మరఠ్వాడా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ చదివారు. 1994లో ఉమ్మడి ఏపీ హైకోర్టులో న్యాయవాదిగా నమోదు చేయించుకున్నారు. సీనియర్‌ న్యాయవాది ఎంఆర్‌కే చౌదరి వద్ద జూనియర్‌గా చేరారు. హైకోర్టు సహా హైదరాబాద్‌లోని అన్ని దిగువ కోర్టుల్లో ప్రాక్టీస్‌ చేశారు.

Updated Date - 2022-03-23T09:00:12+05:30 IST