వెయ్యేళ్ల చరిత్రకు వేదిక మంగోల్‌

ABN , First Publish Date - 2021-05-09T05:49:10+05:30 IST

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మంగోల్‌ గ్రామానికి వెయ్యేళ్ల ఘనమైన చారిత్రక నేపథ్యం ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఇక్కడ లభిస్తున్న చారిత్రక వస్తు, విశేషాలను పరిశీలించినపుడు గ్రామ చరిత్ర తెలుస్తున్నది.

వెయ్యేళ్ల చరిత్రకు వేదిక మంగోల్‌
మంగోలులో గడి ప్రవేశ ద్వారం

విభిన్న సంస్కృతుల ఆనవాళ్లు కలిగిన ప్రాచీన గ్రామం

ఎక్కడ చూసినా నాటి చరిత్రను వివరించే ఆధారాలు


కొండపాక, మే 8: సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మంగోల్‌ గ్రామానికి వెయ్యేళ్ల ఘనమైన చారిత్రక నేపథ్యం ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఇక్కడ లభిస్తున్న చారిత్రక వస్తు, విశేషాలను పరిశీలించినపుడు గ్రామ చరిత్ర తెలుస్తున్నది. ఇక్కడ విభిన్న సంస్కృతుల జీవన విధానం ఉన్నట్టు కొత్త తెలంగాణ చారిత్రక  బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్‌ చారిత్రక ఆధారాలను గుర్తించారు. 


శతాబ్దాలనాటి గడి బురుజు

మంగోల్‌లో అతిపెద్ద రాతితో నిర్మించిన గుండ్రటి కోట బురుజు వంటి గడీ  ముఖద్వారం ఉన్నది. గడి లోపల డంగుసున్నంతో నిర్మించిన ఎత్తైన గోడలతో గదులున్నాయి.  గడి ప్రవేశ ద్వారం వద్ద రెండువైపులా కాపలాదారులు ఉండేందుకు, బారాబందీ కోసం ఏర్పాట్లున్నాయి. గడి బయట గోడలో తాపడం చేసిన దేవత విగ్రహం ఉన్నది. తలపై పడగవిప్పిన సర్పమే కిరీటంగా వుంది. పెద్దచెవులకు గుండ్రని కుండలాలు, పెద్దకండ్లు, మెడలో కంఠికతో గడి రక్ష దేవత విగ్రహంగా భావిస్తున్నారు. మంగోల్‌లోని శివాలయం గర్భగుడిలో గజ్జులపట్టె, మువ్వల గొలుసుతో వున్న చాళుక్యుల కాలంనాటి నంది విగ్రహం ఉన్నది. గర్భగుడిలో తొలినాళ్ల కాకతీయ శైలితో చతురస్రాకార పానపట్టంపై శివలింగం ఉన్నది. లింగం వెనుక హనుమాన్‌ విగ్రహం ఉన్నది. 17వ శతాబ్దం నాటి సప్తమాతృకలతల విగ్రహం, 17, 18వ శతాబ్దాల నాటి సప్తాశ్వారూఢుడైన సూర్యుడి విగ్రహం ఉన్నాయి. బౌద్ధమత సంబంధ విగ్రహాలను పోలిన నాగముచుళిందను పోలిన నాగశిల్పం ఉన్నది. వీపడగలతో చేతుల్లో కత్తీడాలుతో ఊర్ధ్వ శరీరం మానవరూపం, అధోభాగం సర్పశరీరంతో నాగదేవత విగ్రహం ఉన్నది. మంగోల్‌లో మరోచోట 6 తలలు మాత్రమే కనిపిస్తున్న మందపు రాతిఫలకం మట్టిలో కూరుకుని ఉన్నది.

మంగోలు గ్రామానికి సమీపంలో దర్గాగా పిలిచే ముస్లిం సమాధులు ఉన్నాయి. వీటి గురించి వివరాలు తెలియలేదు. ఇక్కడే మట్టిలో కూరుకుపోయిన భారీ వీరగల్లు శిల్పం కనిపిస్తున్నది. కుడివైపు సిగతో.. చేతిలో ఆయుధంతో యుద్ధ భంగిమలో ఈ విగ్రహం ఉన్నది. గ్రామంలో మరోచోట అందమైన వీరగల్లు విగ్రహం గుర్తించారు. కుడివైపు సిగతో, చెవులకు పెద్ద కుండలాలు, చేతులకు దండకడియాలు, కాళ్లకు కడియాలు, పెండేరాలు, నడుమున మేఖల, వీరకాస, బొడ్లో చురకత్తితో ఎడమవైపుకు నడుస్తున్నట్టు ఉన్నదీ శిల్పం. రెండు చేతులతో పట్టుకున్న బల్లెంతో శత్రువును పొడిచి మట్టికరిపించిన భంగిమలో ఉన్నాడు. తలపై ఛత్రం ఛాయలు, శరీరంపై జందెంతో రాచ ఆహార్యంతో కనిపిస్తున్నది.


ఎనిమిదో శతాబ్దపు చరిత్ర ఆనవాళ్లు

మంగోల్‌ సమీపంలోని చిన్నగుట్టపై హజ్రత్‌ షాదుల్లా రహమతుల్లా అలీ దర్గా ఉన్నది. గుట్టపై రాతిగుండ్లకు చతుర్భుజుడైన భైరవుడి విగ్రహం, రెండుచేతుల్లో కత్తి, రక్తపాత్ర ధరించిన దేవత విగ్రహం చెక్కబడి ఉన్నాయి. గ్రామ శివార్లలో పొల్లాల్లో ఇటీవల వినాయకుడి విగ్రహం బయల్పడింది. ఈ విగ్రహం 8, 9వ శతాబ్దల్లో పాలించిన రాష్ట్రకూటుల నాలంనాటిదిగా గుర్తించారు. చతుర్బుజుడైన వినాయకుడి వెనుక కుడిచేతిలో పరశువు, ఎడమచేతిలో అంకుశం, ముందు కుడిచేతిలో దంతం, ఎడమచేతిలో కుడుములతో లలితాసనంలో కూర్చుని కనిపిస్తున్నాడు.

Updated Date - 2021-05-09T05:49:10+05:30 IST