గంటకు 10వేల కేసులు 62 మరణాలు

ABN , First Publish Date - 2021-04-21T07:36:16+05:30 IST

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ పట్టపగ్గాల్లేకుండా చెలరేగుతోంది. మరీ ముఖ్యంగా ఏప్రిల్‌ నెలలో మహమ్మారి కట్టలు తెంచుకుంది. ఈ నెల 18వ తేదీ ఆదివారం నమోదైన 2,61,500 కేసులు, 1,501 మరణాలను గంటల ప్రాతిపదికన లెక్కిస్తే.. గంటకు 10,895 కేసులు రాగా, 62 మంది ప్రాణాలు కోల్పోయారు...

గంటకు 10వేల కేసులు 62 మరణాలు

  • దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి తీరిది
  • కర్ణాటకలో రాత్రి కర్ఫ్యూ, వారాంతపు లాక్‌డౌన్‌
  • సినిమా హాళ్లు బంద్‌, స్థానిక ఎన్నికలు వాయిదా
  • రాహుల్‌, కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌కు కరోనా

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 20: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ పట్టపగ్గాల్లేకుండా చెలరేగుతోంది. మరీ ముఖ్యంగా ఏప్రిల్‌ నెలలో మహమ్మారి కట్టలు తెంచుకుంది. ఈ నెల 18వ తేదీ ఆదివారం నమోదైన 2,61,500 కేసులు, 1,501 మరణాలను గంటల ప్రాతిపదికన లెక్కిస్తే.. గంటకు 10,895 కేసులు రాగా, 62 మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం (2.73 లక్షల కేసులు- 1,619 మరణాలు) గంటకు 11,408 మంది వైరస్‌ బారినపడగా, 67 మంది చనిపోయారు. మరోవైపు ఏప్రిల్‌ 1న దేశంలో 72,330 పాజిటివ్‌లు, 459 మరణాలు నమోదయ్యాయి. ఈ లెక్కన నాడు గంటకు నమోదైన కేసులు 3,013 అయితే.. మరణాలు 19 మాత్రమే. కాగా, ఈ 20 రోజుల్లో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో బాధితులు, మృతులు పదిరెట్లపైగా పెరిగారు. 1వ తేదీన యూపీలో గంటకు 108 కేసులు నమోదయ్యాయి. మూడు గంటలకొకరు చనిపోయారు. 18వ తేదీన గంటకు 1,271 పాజిటివ్‌లు రాగా, ఐదుగురు చనిపోయారు. కేసులపరంగా ఢిల్లీలో ఇదే పరిస్థితి నెలకొంది.   మరణాలు యూపీ కంటే  రెట్టింపు ఉంటున్నాయి. మహారాష్ట్రలో ఏప్రిల్‌ 1న గంటకు 1,647 కేసులు, 9 మరణాలు నమోదయ్యాయి. తాజాగా 2,859 పాజిటివ్‌లు వస్తుండగా, 20 మంది చనిపోతున్నారు. కాగా, దేశంలో యాక్టివ్‌ కేసులు 20.31 లక్షలకు చేరాయి. 


పరీక్షలతో పాటే కొత్త కేసులూ తగ్గాయి

దేశంలో కొత్తగా 2,59,170 మంది వైరస్‌ బారినపడ్డారని, 1,761 మంది చనిపోయారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పని దినాల్లో 15 లక్షల పైగా పరీక్షలు చేస్తుండగా ఆదివారం 13.56 లక్షల టెస్టులే చేశారు. ఈ ఫలితాలను మంగళవారం వెల్లడించడంతో కేసుల్లో తగ్గుదల కనిపించింది. మరణాలు మాత్రం పెరగడం గమనార్హం. 


ఢిల్లీలో ఒక్క రోజే 240 మంది మృతి

ఢిల్లీలో ఆక్సిజన్‌కు తీవ్ర కొరత నెలకొంది. కొన్ని ఆస్పత్రుల్లో గంటల వ్యవధికే సరిపోయేంత నిల్వలున్నాయి. తమకు అత్యవసరంగా ఆక్సిజన్‌ సరఫరా చేయాలంటూ సీఎం కేజ్రీవాల్‌ కేంద్రాన్ని అభ్యర్థించారు. ఢిల్లీలో ఒక్క రోజులోనే 240 మంది చనిపోయారు. మహారాష్ట్ర (351)లో మృతులు తగ్గినా.. కర్ణాటక(146), ఛత్తీ్‌సగఢ్‌(175), యూపీ(167)లో భారీగా నమోదయ్యాయి. 


రాహుల్‌ గాంధీకి కరోనా

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (50)కి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. కేంద్ర ప్రజా ఫిర్యాదులు-పింఛన్ల శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ వైరస్‌ బారిన పడ్డారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ భార్య సునీతకు కొవిడ్‌ నిర్ధారణ అయింది. కేంద్రం ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) సుశీల్‌ చంద్రకు పాజిటివ్‌గా తేలింది. కాంగ్రెస్‌ నేత ఆనంద్‌ శర్మ కరోనాతో ఆస్పత్రిలో చేరారు. కుంభమేళాలో పాల్గొన్న నేపాల్‌ మాజీ రాజు జ్ఞానేంద్రకు వైరస్‌ నిర్ధారణ అయింది.


లాక్‌డౌన్‌పై మహా సీఎంకు మంత్రుల వినతి

మహారాష్ట్రలో బుధవారం రాత్రి నుంచే కఠిన ఆంక్షలతో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించాలని మంత్రులందరూ సీఎం ఉద్ధవ్‌ థాక్రేను కోరారు. దీనిపై బుధవారం సీఎం నిర్ణయం తీసుకోనున్నారు. కర్ణాటకలో బుధవారం నుంచి మే 4 వరకు రాత్రి కర్ఫ్యూ అమలు చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు. ఝార్ఖండ్‌ ప్రభుత్వం ఈ నెల 22 నుంచి 29వ తేదీ వరకు లాక్‌డౌన్‌ విధించింది. తమిళనాడు, కేరళలో రాత్రి నుంచి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. దుకాణాలను 6 గంటలకల్లా మూసివేయాలని అసోం ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. జమ్ము కశ్మీర్‌లో రాత్రి కర్ఫ్యూను అన్ని మున్సిపాలిటీలు, పట్టణ ప్రాంతాలకు విస్తరించారు.


Updated Date - 2021-04-21T07:36:16+05:30 IST