సౌదీలో 'ఫైజర్' వ్యాక్సినేషన్ వేగవంతం !

ABN , First Publish Date - 2020-12-25T15:55:40+05:30 IST

ఫైజర్ టీకాకు ఆమోదం తెలిపిన గల్ఫ్ దేశం సౌదీ అరేబియా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసింది.

సౌదీలో 'ఫైజర్' వ్యాక్సినేషన్ వేగవంతం !

రియాధ్: ఫైజర్ టీకాకు ఆమోదం తెలిపిన గల్ఫ్ దేశం సౌదీ అరేబియా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసింది. వారం రోజుల కింద టీకా పంపిణీ ప్రారంభించిన సౌదీ గురువారం నాటికి 10వేల మందికి వ్యాక్సినేషన్ పూర్తిచేసింది. ప్రస్తుతం రియాధ్ కేంద్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా కొనసాగుతున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. డిసెంబర్ 15న సౌదీ హెల్త్ మినిస్ట్రీ ప్రారంభించిన రిజిస్ట్రేషన్ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు సుమారు 5,00,178 మంది టీకా తీసుకునేందుకు నమోదు చేసుకున్నారు. "టీకా సురక్షితం, సమర్థవంతమైంది, ఎలాంటి దుష్ప్రభావం ఉండదు." అని ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ ట్వీట్ చేసింది. 


వ్యాక్సిన్ తీసుకోవాలనుకునే సౌదీ పౌరులు, నివాసితులు “Sehhaty” స్మార్ట్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అలాగే పౌరులు, విదేశీ నివాసితులకు ఈ టీకాను ఉచితంగా అందిస్తున్నట్లు సౌదీ అధికారులు వెల్లడించారు. కాగా, 65 ఏళ్లకు పైబడిన వారు, ఉబకాయం ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి మొదట వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు సౌదీ ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. సౌదీలో కొవిడ్ బాధితుల సంఖ్య 3.60 లక్షలు దాటగా.. ఇందులో 6,159 మంది మరణించారు.

Updated Date - 2020-12-25T15:55:40+05:30 IST