105 ఏళ్ల బామ్మ పొలం పనుల్లో చురుగ్గా!

ABN , First Publish Date - 2020-11-12T05:32:39+05:30 IST

చిన్నతనం నుంచే ఆమెకు వ్యవసాయ పనుల మీద ఆసక్తి. ఆ ఆసక్తితోనే అరవై ఏళ్లుగా సేంద్రీయ సాగు బాటలో అలసట తెలియకుండా సాగిపోతున్నారు. పలుగూ పార అందుకొని నేలను చదును చేయడం, పొలం గట్టున సేదతీరడం ఆమెకు ఎంతో ఇష్టం. 105 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా పొలం పనులు చేస్తున్న...

105 ఏళ్ల బామ్మ పొలం పనుల్లో చురుగ్గా!

చిన్నతనం నుంచే ఆమెకు వ్యవసాయ పనుల మీద ఆసక్తి. ఆ ఆసక్తితోనే అరవై ఏళ్లుగా సేంద్రీయ సాగు బాటలో అలసట తెలియకుండా సాగిపోతున్నారు. పలుగూ పార అందుకొని నేలను చదును చేయడం, పొలం గట్టున సేదతీరడం ఆమెకు ఎంతో ఇష్టం. 105 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా పొలం పనులు చేస్తున్న తమిళనాడుకు చెందిన పాపమ్మాళ్‌ను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. సత్తువ, కష్టపడే గుణం ఉండాలే కానీ ఏ పనైనా చేసేందుకు వయసు అడ్డంకి కాదని నిరూపిస్తున్న ఈ శతాధిక వృద్ధురాలి సాగు ప్రయాణమిది...


‘‘మా చిన్నతనంలో చదువు కొనేందుకు బడి కూడా ఉండేది కాదు. నేను ఆటల వల్లనే చాలా విషయాలు తెలుసుకున్నా.  పల్లన్‌ఘుజి (తమిళనాడులో, దక్షిణాదిలో ఒకప్పుడు ఎక్కువగా ఆడే ఆట) ఆట ద్వారా అంకెలను లెక్కించడం, గణితం నేర్చుకున్నాను. మా రోజుల్లో అయిదో తరగతి వరకు చదువుకున్నా చాలు టీచర్‌ ఉద్యోగానికి అర్హత సాధించేవాళ్లు’’ అని తన చిన్ననాటి రోజులను గుర్తుచేసుకుంటారు పాపమ్మాళ్‌. పసితనంలోనే ఆమెను వాళ్ల అమ్మమ్మ తన వెంట తెక్కంపట్టీకి తీసుకెళ్లింది. పాపమ్మాళ్‌ అక్కడే పెరిగి పెద్దయ్యారు. అమ్మమ్మ చిన్న కిరణా దుకాణం నడిపేవారు. ఆమె చనిపోయిన తరువాత పాపమ్మాళ్‌ చిన్న బడ్డీ కొట్టు తెరిచి టీ, టిఫిన్‌, స్నాక్స్‌ అమ్మేవారు. ఆమెకు సొంతంగా కొంత  భూమి కొనుక్కొని అందులో వ్యవసాయం చేయాలనే కోరిక ఉండేది. దాంతో వచ్చిన డబ్బులో కొంత దాచుకొనేవారు. అలా దాచుకున్న డబ్బుతో పది ఎకరాల భూమి కొన్నారు పాపమ్మాళ్‌. ఆ భూమిలో మొక్కజొన్న, పప్పుఽధాన్యాలు, పండ్ల మొక్కలు, కూరగాయలు సాగు చేయడం మొదలెట్టారు. తన పొలంలో పండిన వాటిని ఇంటి అవసరాలకు ఉపయోగించేవారు.




ఆమె వందో పుట్టిన రోజు పండగలా

అయితే వయసు పైబడడం వల్ల అంత భూమిలో సాగు చేయడం కష్టమవడంతో ఏడున్నర ఎకరాలను 25 ఏళ్ల క్రితం అమ్మేశారు. మిగిలిన రెండున్నర ఎకరాలలో వ్యవసాయం చేస్తున్నారు. ‘‘ఈతరం వాళ్లకు తొందరగా లాభం రావాలి. అందుకే వాళ్లు సేంద్రియ వ్యవసాయం చేసేందుకు ఆసక్తి చూపడం లేదు’’ అంటారు పాపమ్మాళ్‌. ఆమె వందో పుట్టిన రోజున ఊరంతా ఆమె ఫ్లెక్సీలు కట్టారు. గ్రామస్థులంతా వచ్చి ఆమెకు అభినందనలు తెలియజేశారు. ఇప్పుడు ఆమెకు 105 ఏళ్లు. ఈ వయసులోనూ ఆమె రోజూ తన పొలానికి వెళ్లి కాసేపు పనిచేసి వస్తారు. వందేళ్లు పైబడినా కూడా పూర్తి ఆరోగ్యంతో ఉన్న పాపమ్మాళ్‌ను అక్కడి వాళ్లు కొత్త దంపతులను ఆశీర్వదించేందుకు పెళ్లిళ్లకు పిలవడం పరిపాటి. ఈ వయసులోనూ ఆమె ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా... పాపమ్మాళ్‌ స్థానికంగా పండించిన తాజా కూరగాయలు, పండ్లను మాత్రమే తింటారు. అంతేకాదు పప్పు ధాన్యాలతో చేసిన అంబలి అంటే ఆమెకు చాలా ఇష్టం. అప్పుడప్పుడు మటన్‌ బిర్యానీ రుచిచూస్తారు. స్థానిక వంటకాలను తినాల్సిందిగా అందరికీ చెబుతారు కూడా. ఇష్టమైన పని చేసేందుకు, కష్టపడేందుకు వయసుతో పనిలేదని చాటుతున్న పాపమ్మాళ్‌ ఈతరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

Updated Date - 2020-11-12T05:32:39+05:30 IST