వైరస్‌.. సైరన్‌!

ABN , First Publish Date - 2021-04-18T05:42:00+05:30 IST

అధికారుల నిర్లక్ష్యం అమాయకుల ప్రాణాల మీదకు తెస్తోంది.

వైరస్‌.. సైరన్‌!

శానిటైజేషన్‌ లేకుండానే 108 పరుగులు

కరోనా బాధితులను తరలించిన అనంతరం అందులోనే సాధారణ పేషెంట్లు

కొవిడ్‌ పేషెంట్లకు ఆక్సిజన్‌ లేని వాహనం కేటాయింపు 


తెనాలి, ఏప్రిల్‌ 17, (ఆంధ్రజ్యోతి): అధికారుల నిర్లక్ష్యం అమాయకుల ప్రాణాల మీదకు తెస్తోంది. ఆపదలో ఉండి ఫోన్‌ చేస్తేచాలు పరుగులుపెడుతూ వచ్చే వాహనం కరోనా వైరస్‌ మోసుకొస్తోంది. రోగుల ఆసుపత్రి తీసుకొచ్చే 108 వాహనం శానిటైజేషన్‌ చేయకుండానే వాడేస్తున్నారు. కరోనా బాధితులను తీసుకువచ్చిన వాహనంలో ఆ తర్వాత సాధారణ రోగు లకు కూడా వినియోగిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు, 108 సిబ్బంది, మున్సిపల్‌ అధికారుల మధ్య ఏర్పడిన సమన్వయ లోపం రోగులకు శాపంగా మారుతోంది. జిల్లాలో 108 వాహనాలు 61 ఉంటే, వాటిలో ఏడింటిని మాత్రమే కొవిడ్‌ కేసుల కోసం కేటాయించారు. తెనాలి వైద్యవిధాన పరిషత్‌ జిల్లా వైద్యశాలకు రెండు, గుంటూరు సమగ్ర వైద్యశాలకు రెండు, అమరావతి, నరసరావుపేట, మాచర్లకు ఒక్కోటి చొప్పున కేటాయించారు. వీటిలో సగంపైగా పాతకాలంనాటి 108 వాహనాలున్నాయి. 


ఆక్సిజన్‌ లేని వాహనం

తెనాలి జిల్లా వైద్యశాలకు కేటాయించిన రెండు అబులెన్స్‌లలో ఒకదానికి నెల నుంచి ఆక్సిజన్‌ పైప్‌ పాడయిపోయి మూలనపెట్టారు. ఆక్సిజన్‌ లేదని తెలిసినప్పుడు మరో వాహనాన్ని కేటాయించాల్సిన 108 జిల్లా మేనేజర్‌కు ఈ విషయమే తెలియదంటే హాస్యాస్పదమే. కేవలం లెక్కకోసం మాత్రం వీటిని కేటాయించారు. మరో వాహనం చెరుకుపల్లికి సంబంధించినది. దీనిని జిల్లా వైద్యశాలలో అందుబాటులో ఉంచకుండా మిగిలిన వాహనాలతోపాటు మార్కెట్‌ యార్డు ఆవరణలనే ఉంచుతున్నారు. అంటే లెక్కకు మాత్రం వీటి కేటాయింపుల చూపించి, పనికిరాని వాటిని అలంకా రప్రాయంగా ఉంచి చేతులు దులుపుకొన్నారు. 


 కేంద్ర నిబంధనలు ఇవీ.. 

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదేశాల ప్రకారం కొవిడ్‌ కాకున్నా, రోగులను తీసుకొచ్చి ఆసుపత్రిలో చేర్చాక ఆ వాహనాన్ని తప్పనిసరిగా శానిటైజేషన్‌ చేయాలి. అయితే ఇక్కడ సాఽధారణ రోగులను తీసుకువచ్చాక శానిటైజేషన్‌ చేయటం అటుంచితే, కొవిడ్‌ బాధితులను తీసుకొచ్చిన వాహనాన్నే కనీసం శానిటైజేషన్‌ చేయకుండానే ఇతర రోగులకోసం పరుగులు తీయిస్తున్నారు. 


ఇదిగో ఇలా చేస్తున్నారు..

శుక్రవారం రాత్రి సమయంలో 108 వాహనాల ద్వారా 15 మంది వరకు కొవిడ్‌ బాధితులను వివిధ ప్రాంతాల నుంచి తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. తరలించిన వెంటనే ఆ వాహనాలను హైపో సొల్యూషన్‌ సాయంతో శానిటైజేషన్‌ చేసి, కనీసం అర్ధగంట వరకు ఉంచాలి. కానీ తెనాలి జిల్లా వైద్యశాల నుంచి ఒక కరోనా బాధితుడిని గుంటూరు సమగ్ర వైద్యశాలకు తీసుకెళ్లిన వాహనం తిరిగి వచ్చిన వెంటనే జనరల్‌ వార్డులో ఉన్న మరో సాధారణ రోగిని కూడా అదే వాహనంలో గుంటూరు తరలించారని సమాచారం. ఈ తరహాలోనే మరో వాహనంలో కొ ల్లూరు నుంచి ఒకరిని, ఇంకో వాహనంలో అమృతలూ రు మండలం నుంచి మరొకరిని తీసుకొచ్చారని చెబుతున్నారు. ఇదే తరహాలో గత పది రోజుల నుంచి జరుగుతోందని, దీనిగురించి పట్టించుకునేవారే లేరని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


పర్యవేక్షణ కరువు

 గతంలో హైపోసొల్యూషన్‌ స్ర్పే చేసేందుకు కావలసిన వాహనం, దానిపై పనిచేసేందుకు సిబ్బందిని మున్సిపల్‌ అధికారులు పంపుతారు. శానిటైజేషన్‌ సక్రమంగా జరుగుతుందా! లేదా అనేది డిప్యూటీ డీఎంహెచ్‌వో అధికారులు ఒక ఉద్యోగిని నియమించి పర్యవేక్షించేవారు. కానీ ఇప్పుడు అదేమీ జరగటంలేదు.  108 వాహన సిబ్బందే భయంతో పిచికారి చేస్తే మినహా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీనిని పర్యవేక్షించేందుకు ఆరోగ్యశాఖ నుంచి సిబ్బందీ లేరు. పల్నాడులో మాత్రం ఇంతటి దారుణ పరిస్థితులు లేవని చెబుతున్నారు.  


శానిటైజేషన్‌ లేకుండా వాహనాలు పంపొద్దన్నాం..

108 వాహనాలను ఒక రోగిని తీసుకొచ్చాక మరో రోగికోసం వెళ్లేప్పుడు తప్పనిసరిగా శానిటైజేషన్‌ చేయించాలని కచ్చితంగా ఆదేశాలిచ్చాం. సాధారణంగా డిప్యూటీ డీఎంహెచ్‌ఓ పరిధిలో ఇవన్నీ జరిగిపోతాయి. ఒకవేళ వాళ్లు చేయకున్నా శానిటైజేషన్‌ చేయించేలా ఆదేశాలిచ్చాం. అలా కాకుండా ఎక్కడైనా వాహనాలను తిప్పితే చర్యలు తీసుకుంటాం. పనిచేయని వాహనం కొవిడ్‌ కేసులకోసం కేటాయించిన విషయం తెలియదు విచారించి, నిజమైతే సరిచేయిస్తాం.

- సత్యనారాయణ, జిల్లా మేనేజర్‌


ఆక్సిజన్‌ పైపు పనిచేయని మాట వాస్తమే

కొవిడ్‌ కేసులకోసం కేటాయించిన వాహనాల్లో ఒకదానికి ఆక్సిజన్‌ పైపు పనిచేయని మాట వాస్తవమే. అది పాతవాహనం కావటం వల్ల దానిని సరిచేసేందుకు సిబ్బంది అందుబాటులో లేరు. అందువల్ల దానికి ప్రత్యామ్నాయాలపై ఆలోచిస్తున్నాం. వారంలో అదంతా సరైపోతుంది.

- జయకిషోర్‌, 108 తెనాలి ప్రాంత అధికారి 

Updated Date - 2021-04-18T05:42:00+05:30 IST