టెన్త్‌ విద్యార్థి ఆత్మహత్య.. ఆన్‌లైన్‌ చదవలేక నేనా!?

ABN , First Publish Date - 2021-07-10T19:32:44+05:30 IST

10 వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

టెన్త్‌ విద్యార్థి ఆత్మహత్య.. ఆన్‌లైన్‌ చదవలేక నేనా!?

హైదరాబాద్ సిటీ/అల్వాల్‌ : 10 వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అల్వాల్‌ ఎస్‌ఐ నవీన్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. భూదేవినగర్‌ ప్రాంతానికి చెందిన పీఎం. సంజీవ్‌కుమార్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు బీటెక్‌ చదువుతుండగా, చిన్న కుమారుడు ఆనంద్‌ కిషన్‌(15) స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. రోజూ చదువుకోవడానికి ఇంటి పై అంతస్తుకు సాయంత్రం 7-30కు వెళ్లి 8-30కు తిరిగి డిన్నర్‌కు వచ్చే వాడు. గురువారం రాత్రి కూడా అలాగే వెళ్లి డిన్నర్‌కు రాలేదు. 


దీంతో తండ్రి సంజీవ్‌కుమార్‌ కుమారుడిని పిలవడానికి ఇంటి పై అంతస్తుకు వెళ్లాడు. అక్కడ కనిపించకపోవడంతో తన ఇంటి పొరుగునే ఉండే రమేష్‌, రాజాలను పిలిచాడు. వాళ్లు తలుపులు తెరిచి చూడగా అక్కడ స్లాబ్‌ సీలింగ్‌కు దుస్తులు ఆరేసే తాడుతో ఉరివేసుకుని ఆనంద్‌ వేలాడుతూ కనిపించాడు. వెంటనే తాడును కత్తిరించి అతడిని కిందికి దించి వైద్యుడిని పిలిచారు. డాక్టర్‌ అక్కడికి చేరుకునే సమయానికే అతను మృతి చెందాడు. తన కుమారుడు మృధు స్వభావి అని, ఎవరితోనూ పెద్దగా మాట్లాడడని సంజీవ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఎందుకు చనిపోయాడో అర్థం కావడం లేదని రోదించాడు. ఆన్‌లైన్‌ క్లాస్‌ల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని స్థానికులు పేర్కొంటున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

Updated Date - 2021-07-10T19:32:44+05:30 IST