విమ్స్‌లో మరణ మృదంగం

ABN , First Publish Date - 2021-04-22T05:28:33+05:30 IST

జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. బుధవారం ఒక్కరోజే విశాఖ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (విమ్స్‌)లో కొవిడ్‌తో చికిత్స పొందుతున్న 11 మంది మృతిచెందారు. అయితే, అధికారులు మాత్రం వీటిని నిర్ధారించడం లేదు.

విమ్స్‌లో మరణ మృదంగం


కొవిడ్‌తో ఒక్కరోజే 11 మంది మృతి

గత మూడు రోజుల్లో పది మంది మృత్యువాత

సేవలు ప్రారంభమైన  నాలుగు రోజుల్లో 21 మంది


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. బుధవారం ఒక్కరోజే విశాఖ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (విమ్స్‌)లో కొవిడ్‌తో చికిత్స పొందుతున్న 11 మంది మృతిచెందారు. అయితే, అధికారులు మాత్రం వీటిని నిర్ధారించడం లేదు. కొవిడ్‌ వార్డులో చికిత్స పొందుతున్న ఎనిమిది మంది మధ్యాహ్నానికి, సాయంత్రం మరో ముగ్గురు మృతిచెందారు. ఒకేరోజు 11 మంది మృతిచెందడం ఆందోళన కలిగి స్తోంది. నాలుగు రోజుల కిందటే విమ్స్‌లో సేవలను ప్రారంభించారు. ఇక్కడ సేవలు ప్రారంభమైన మొదటి రోజు ముగ్గురు మృతిచెందగా, రెండో రోజైన సోమవారం ఐదుగురు, మంగళవారం మరో ఇద్దరు మృతి చెందారు. మూడు రోజుల్లో పది మంది మృతిచెందగా, బుధవారం ఒక్కరోజే ఏకంగా 11 మంది మరణించారు. విమ్స్‌లో సేవలు ప్రారంభమైన నాలుగు రోజుల్లో 21 మంది మృతిచెందడంతో అందరిలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. బాధితులకు సేవలు అందించడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఇందుకు కారణమన్న విమర్శలు వస్తున్నాయి. బాధితులను సరిగా చూడకపోవడం, అవసరమైన వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడం మరణాలకు కారణమని పలువురు పేర్కొంటున్నారు.  


మామ, కోడలు మృతి

మునగపాక: కరోనా మునగపాక మండలం నాగులాపల్లికి చెందిన ఇద్దరిని బలిగొంది. మృతులు మామ, కోడళ్లు కావడం గమనార్హం. నాగులాపల్లి చర్చిలో పాస్టర్‌గా  పనిచేస్తున్న మహిళ (35) మంగళవారం  విమ్స్‌లో, ఆమె మామ  (65)  బుధవారం విశాఖలోని ఛాతీ, అంటువ్యాధుల ఆస్పత్రిలో మరణించారు. వీరు ఇరువురూ కరోనాతో కన్నుమూసినట్టు మునగపాక పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ వెల్లడించారు. 

 

Updated Date - 2021-04-22T05:28:33+05:30 IST