క్వారీ యజమాని కిడ్నాప్‌ కేసులో 11మందికి జీవిత ఖైదు

ABN , First Publish Date - 2021-04-23T06:57:17+05:30 IST

ఐదేళ్ల క్రితం రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన కిడ్నాప్‌ కేసులో 11మంది నిందితులకు జీవిత ఖైదు పడింది.

క్వారీ యజమాని కిడ్నాప్‌ కేసులో 11మందికి జీవిత ఖైదు

  •  ఒకరికి పది సంవత్సరాల శిక్ష... ఇద్దరిపై కేసు కొట్టివేత
  •  
  • చిత్తూరు లీగల్‌, ఏప్రిల్‌ 22: ఐదేళ్ల క్రితం రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన కిడ్నాప్‌ కేసులో 11మంది నిందితులకు జీవిత ఖైదు పడింది.ప్రాసిక్యూషన్‌ కథనం మేరకు....యాదమరి మండలం గొందివాండ్లవూరుకు చెందిన  క్వారీ యజమాని భజలింగం  2016 జనవరి 5వ తేదీన స్కార్పియో వాహనంలో గుడియాత్తం వెళ్లి రాత్రి 8.30 గంటల సమయంలో తిరిగి వస్తుండగా పాచిగుంట వద్ద సుమోలో వచ్చిన కొంత మంది ఆయన్ను కిడ్నాప్‌ చేశారు. బంగారుపాళ్యం సమీపాన ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి రూ. 50 లక్షలు ఇస్తేనే వదిలిపెడతామని బెదిరించారు. దీంతో భజలింగం తన కుమారుడికి ఫోన్‌ చేసి విషయం చెప్పడంతో రూ. 50 లక్షలు తీసుకొచ్చి కిడ్నాపర్లకు ఇవ్వడంతో భజలింగాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు.అనంతరం భజలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు 
  • చిత్తూరు వెస్ట్‌ సీఐ ఆదినారాయణరెడ్డి, యాదమరి ఎస్‌ఐ రఘుపతి కేసు నమోదు చేశారు.నిందితుల కోసం గాలించి 2016 ఫిబ్రవరి 1న వరిగపల్లె వద్ద అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.చిత్తూరులోని తొమ్మిదవ అదనపు జిల్లా కోర్టులో గురువారం ఈ కేసు విచారణకు రాగా పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి పీవీఎస్‌ సూర్యనారాయణ మూర్తి 11మంది నిందితులకు జీవితఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు.బంగారుపాళ్యం మండలం తంబుగానిపల్లెకు చెందిన రాజేష్‌,నరేష్‌,  నక్కల హేమాద్రి,   మురళి, దండువారిపల్లెకు చెందిన భరత్‌కుమార్‌రెడ్డి,కొత్తవెంకటాపురానికి చెందిన హేమచంద్ర, దొరబాబు,  వాయల్పాడు మండలం మారేవాండ్లపల్లెకు చెందిన అవసాని సుదర్శన్‌,చింతపర్తికి చెందిన భరత్‌కుమార్‌, పీలేరు మండలం జాండ్లపెంటకు చెందిన విజయ్‌కుమార్‌, యాదమరి మండలం మోటాన్లపల్లెకు చెందిన నక్కల రాజశేఖర్‌ జీవిత ఖైదు పడిన వారిలో వున్నారు. అలాగే బంగారుపాళ్యం మండలం తంబుగానిపల్లె చెందిన నందకుమార్‌కు పది సంవత్సరాల జైలు శిక్ష విధించారు.అదే వూరికి చెందిన రాణెమ్మ, చిన్నమ్మలపై నేరం రుజువుకాకపోవడంతో వారిద్దరిపై కేసు కొట్టివేశారు.ఈ కేసులో మొత్తం 23మంది సాక్షులను న్యాయమూర్తి విచారించారు. ఏపీపీ హిమబిందు ప్రాసిక్యూషన్‌ తరపున వాదనలు వినిపించారు. 

Updated Date - 2021-04-23T06:57:17+05:30 IST