బ్రిటన్‌లో తెలుగు చిన్నారి అద్భుత ప్రతిభ.. The Royal ballet school లో అడ్మిషన్..!

ABN , First Publish Date - 2022-04-15T19:06:55+05:30 IST

బ్రిటన్‌కు చెందిన తెలుగు చిన్నారి అనీషా యడ్ల(11) అత్యంత అరుదైన అవకాశం దక్కించుకుంది. లండన్‌లోని ప్రఖ్యాత ‘ది రాయల్ బ్యాలే స్కూల్’‌లో పాశ్చాత సంప్రదాయిక నృత్య రీతి బ్యాలేను అభ్యసించే అమూల్యమైన అవకాశం పొందింది.

బ్రిటన్‌లో తెలుగు చిన్నారి అద్భుత ప్రతిభ.. The Royal ballet school లో అడ్మిషన్..!

లండన్: బ్రిటన్‌కు చెందిన తెలుగు చిన్నారి అనీషా యడ్ల(11) అత్యంత అరుదైన అవకాశం దక్కించుకుంది. లండన్‌లోని ప్రఖ్యాత The royal ballet school (ది రాయల్ బ్యాలే స్కూల్‌) పాశ్చాత్య సంప్రదాయిక నృత్య రీతి బ్యాలేను అభ్యసించే అమూల్యమైన అవకాశం పొందింది. బ్యాలేను నేర్పించే ప్రతిష్ఠాత్మక స్కూళ్లలో ‘ది రాయల్ బ్యాలే స్కూల్’ కూడా ఒకటి. ఇక అనీషా అడ్మిషన్ సాధించిన ఇయర్ 7 తరగతిలో కేవలం 12 మందికే ప్రవేశం ఉంటుంది. అయినా కూడా.. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మంది అభ్యర్థులు ఈ స్కూల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకుంటారు. 


ఇందుకోసం చాలా చిన్నతనం నుంచే ఈ నృత్యరీతికి సంబంధించిన ప్రాథమికాంశాల్లో శిక్షణ తీసుకుంటారు. చాలా మంది డ్యాన్సర్లకు.. ఈ స్కూల్‌లో అడ్మినిషన్ పొందటమనేది తమ జీవితంలో ఉండే ఒకే ఒక లక్ష్యం. ఇక ఈ స్కూల్‌లో శిక్షణ తీసుకున్న వారు తమ కెరీర్‌లో అత్యున్నత శిఖరాలు అందుకుంటారు. అలాంటి అరుదైన అవకాశాన్నే అనీషా యడ్ల నిరంతర కృషితో చేజిక్కించుకుంది. ఇందుకోసం అనీషా రెండేళ్ల పాటు కఠిన ట్రెయినింగ్ తీసుకుంది.


అనీషా తల్లిదండ్రులు తెలుగు వారే! పదిహేడేళ్ల క్రితం వారు ఇంగ్లండ్‌కు వలస వెళ్లారు. అనీషా తండ్రి సూర్యది విజయవాడ కాగా.. తల్లిది హైదరాబాద్. అయితే.. వారు భారతీయ సంస్కృతికి విలువనిచ్చే వారు కావడంతో అనీషా అచ్చ తెలుగు వాతావరణంలో పెరిగింది. ఇక.. అనీషా సాధించిన విజయంతో ఆ కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తోంది. కాగా.. పాశ్చాత్య సంప్రదాయిక కళ అయిన బ్యాలేలో భారతీయులకు ప్రాతినిథ్యం కల్పించాలన్న తన కల ఎట్టకేలకు నెలవేరిందని అనీషా స్థానిక మీడియాతో పేర్కొంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ స్కూల్‌ విద్యార్థుల్లో 90 శాతం మంది స్కాలర్‌షిప్ సాయంతో తమ అభ్యాసం కొనసాగిస్తారు. వారి ఖర్చులను స్కూల్ యాజమాన్యమే భరిస్తుంది. 


ఏమిటీ బ్యాలే.. 

పదిహేనవ శతాబ్దంలో ఇటాలియన్ రినైసాన్స్ కాలంలో పుట్టిన సంప్రదాయిక నృత్య కళే బ్యాలే.  ఫ్రాన్స్, రష్యా కళాకారుల కారణంగా ఈ నృత్య రీతి.. మరిన్ని మార్పులు సంతరించుకుని ప్రస్తుతం మనం చూస్తున్న బృంద ప్రదర్శన స్థాయికి చేరుకుంది. మహిళలు, పురుషులు ఇద్దరూ ఈ డ్యాన్స్‌ను నేర్చుకోవచ్చు. మహిళా కళాకారులను బ్యాలరీనా అని, పురుష కళాకారులను బ్యాలరీనో అని పిలుస్తారు. ఈ కళలో రాణించాలంటే శారీరక ధారుఢ్యం ఎంతో అవసరం. వివిధ భంగిమల్లో శరీరాన్ని వంపులు తిప్పాల్సి ఉంటుంది. అందుకే..  బ్యాలే కళాకారులు చాలా చిన్నతనం నుంచే తమ శిక్షణ ప్రారంభిస్తారు. అధిక శాతం మంది ముప్పైల్లో ఉండగా రిటైరవుతారు. 

Updated Date - 2022-04-15T19:06:55+05:30 IST