తండ్రికి షాక్ ఇచ్చిన 11 ఏళ్ల బాలిక.. ఇంతకీ ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2020-11-17T23:08:33+05:30 IST

ఒడిశాలో 11 ఏళ్ల బాలిక 10 కిలోమీటర్లు నడిచి వెళ్లి మరీ తన తండ్రిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఒడిశాలోని...

తండ్రికి షాక్ ఇచ్చిన 11 ఏళ్ల బాలిక.. ఇంతకీ ఏం చేసిందంటే..

10 కిలోమీటర్లు నడిచి వెళ్లి తండ్రిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన 11 ఏళ్ల బాలిక..!

కేంద్రపర: ఒడిశాలో 11 ఏళ్ల బాలిక 10 కిలోమీటర్లు నడిచి వెళ్లి మరీ తన తండ్రిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఒడిశాలోని కేంద్రపర జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే... కేంద్రపర జిల్లాలోని ఓ గ్రామంలో నివాసముంటున్న శుశ్రీ అనే 11 ఏళ్ల బాలిక ఆరవ తరగతి చదువుతోంది. ప్రభుత్వం కరోనా నేపథ్యంలో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి డబ్బును నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమ చేసి, బియ్యాన్ని కూడా ఇంటికే పంపుతోంది. శుశ్రీకి కూడా తన బ్యాంకు అకౌంట్లో డబ్బులు పడేవి. అయితే.. ఆ డబ్బును, తనకు వచ్చే బియ్యాన్ని తండ్రి బలవంతంగా తీసుకుంటున్నాడని శుశ్రీ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. శుశ్రీ తల్లి చనిపోవడంతో తన తండ్రి రెండో పెళ్లి చేసుకుని తన బాగోగులు చూసుకోవడం లేదని, కానీ.. బ్యాంకు అకౌంట్లో జమ అవుతున్న డబ్బును మాత్రం బలవంతంగా తీసుకుంటున్నాడని, బియ్యాన్ని కూడా తీసుకువెళ్లి పోతున్నాడని శుశ్రీ ఫిర్యాదులో పేర్కొంది.


డబ్బును అడిగితే తన తండ్రి రమేష్ ఇచ్చే వాడు కాదని, తనకు న్యాయం చేయాలని ఆ ఫిర్యాదులో శుశ్రీ కోరింది. ఆమె ఫిర్యాదును పరిశీలించిన కేంద్రపర కలెక్టర్ సమర్థ్ వర్మ మాట్లాడుతూ.. ఆమె అకౌంట్లో డబ్బును జమ చేయాలని డీఈవోకు ఆదేశాలు పంపినట్లు తెలిపారు. ఆమె తండ్రి తీసుకున్న ఆ డబ్బును, బియ్యాన్ని కూడా శుశ్రీకి అందేలా చూడాలని డీఈవోను కలెక్టర్ ఆదేశించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో.. పాఠశాలలు మూతపడటంతో విద్యార్థులు ఆకలితో అలమటించే పరిస్థితి రాకూడదని, ప్రభుత్వం రోజుకు 150 గ్రాముల బియ్యం, 8.10 రూపాయల డబ్బును విద్యార్థుల ఖాతాల్లో జమ చేసింది. నెలకోసారి ఈ డబ్బు, బియ్యం విద్యార్థులకు అందేవి.

Updated Date - 2020-11-17T23:08:33+05:30 IST