111 జీవోను ఎత్తేస్తాం

ABN , First Publish Date - 2022-03-16T08:19:54+05:30 IST

రంగారెడ్డి జిల్లాలో అమల్లో ఉన్న 111 జీవోను ఎత్తివేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు.

111 జీవోను ఎత్తేస్తాం

  • నిపుణుల కమిటీ నివేదిక రాగానే చర్యలు.. 
  • మొత్తం 84 గ్రామాలకు ఊరట
  • వీఆర్‌ఏలను ఇరిగేషన్‌లో లష్కర్లుగా నియమిస్తాం
  • మధ్యాహ్న భోజన కార్మికుల వేతనం 3వేలకు పెంపు
  • సెర్ప్‌ ఉద్యోగులకు ‘ప్రభుత్వ’ జీతాలు 
  • మెప్మా, ఐకేపీ సిబ్బందికీ  వారితో సమానంగా
  • తొలగించిన ఫీల్డ్‌ అసిస్టెంట్లందరూ తిరిగి విధుల్లోకి.. 
  • నెలాఖరులోపు 40 వేల మందికి దళితబంధు 
  • పోడు భూముల సమస్యలకూ త్వరలో పరిష్కారం 
  • ఉక్రెయిన్‌ విద్యార్థుల చదువు ఖర్చు భరిస్తాం
  • శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడి


హైదరాబాద్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లాలో అమల్లో ఉన్న 111 జీవోను ఎత్తివేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రజల తాగునీటి అవసరాల కోసం నిర్మించిన హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ జంట జలాశయాలు కలుషితం కాకుండా, ఎలాంటి ప్రతిబంధకాలు తలెత్తకుండా ఉండేందుకు గత ప్రభుత్వాలు 111 జీవోను అమల్లోకి తెచ్చాయని గుర్తు చేశారు. అయితే ఆ జంట జలాశయాల నీళ్లు గ్రేటర్‌ హైదరాబాద్‌కు అవసరంలేదని, సింగూరు జలాశయం నుంచి కూడా తాగునీటిని తీసుకోవడంలేదని తెలిపారు. మంగళవారం శాసనసభలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య చేసిన విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి స్పందించి ఈ ప్రకటన చేశారు. హైదరాబాద్‌ ప్రజల కోసం సుంకిశాల నుంచి కొంత నీటిని, కృష్ణా జలాలను మరికొంత తీసుకుంటున్నామన్నారు. మల్లన్నసాగర్‌ జలాశయం నుంచి గ్రావిటీ ద్వారా హైదరాబాద్‌కు గోదావరి జలాలను తీసుకొచ్చే పనులు కూడా పురోగతిలో ఉన్నాయని చెప్పారు. రాబోయే వందేళ్ల వరకు తాగునీటి సమస్య ఉండబోదన్నారు. జంట జలాశయాల తాగునీరు హైదరాబాద్‌కు అవసరం లేనపుడు 111 జీవో అమలు చేయడం కూడా అర్థరహితమని పేర్కొన్నారు. నిపుణుల కమిటీ కూడా వేశామని, నివేదిక రాగానే జీవోను ఎత్తివేస్తామని ప్రకటించారు. అయితే ఒకేసారి జీవోను ఎత్తివేస్తే బాగుండదని, గ్రీన్‌ జోన్లు ఏర్పాటు చేస్తూ, మాస్టర్‌ ప్లాన్‌ను, నిపుణుల కమిటీ మార్గదర్శకాలను అమలు చేస్తూ.. క్రమంగా ఎత్తివేస్తామని అన్నారు.  


దేవాలయ భూములను కాపాడుకుంటాం..

రాష్ట్రంలో దేవాలయ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుకుంటామని సీఎం కేసీఆర్‌ అన్నారు. గజం భూమి కూడా అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం పరిరక్షిస్తుందన్నారు. దేవరయాంజాల్‌ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని, వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్‌ శాసనసభలో చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి స్పందించారు. దేవరయాంజాల్‌ భూములపై నలుగురు ఐఏఎ్‌సలతో కమిటీ వేశామని, ఆ నివేదిక ఇంకా రాలేదన్నారు. ఇక కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత భట్టివిక్రమార్క చేసిన విజ్ఞప్తి మేరకు ఎస్సీ ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియను తక్షణమే పూర్తిచేయాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను సీఎం ఆదేశించారు. కాగా, రాష్ట్రంలోని 1.55 కోట్ల ఎకరాల భూమి వివరాలు ధరణి పోర్టల్‌లోకి ఎక్కాయన్నారు. వీఆర్‌ఏలకు ఉపాధి కల్పించేందుకు వారిని నీటిపారుదల శాఖలోకి తీసుకొని లష్కర్లుగా నియమిస్తామని సీఎం ప్రకటించారు. 


బచావత్‌ ట్రైబ్యునల్‌కే అధికారం..

కృష్ణా, గోదావరి నదులపై అధికారం బచావత్‌ ట్రైబ్యునల్‌కే ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. 1974లో అవార్డైన ట్రైబ్యునల్‌.. సుప్రీంకోర్టు తీర్పుతో సమానమన్నారు. గోదావరి, కృష్ణా నదుల్లో మన రాష్ట్రానికి హక్కులను సబ్‌ బేసిన్ల వారీ గా కేటాయిస్తూ తీర్పు ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను హరించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రాల అనుమతి లేకుండా చుక్క నీటిని కూడా కేంద్రం తీసుకునేందుకు అవకాశం లేదన్నారు. నాగార్జునసాగర్‌ చివరి ఆయకట్టు పరిధిలో ఉన్న ఖమ్మం జిల్లాలోని మధిర, సత్తుపల్లి, వైరా నియోజకవర్గాలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మించే రాయలసీమ ఎత్తిపోతల పథకంతో నష్టం జరుగుతుందని, ఈ మూడు నియోజకవర్గాలు ఎడారిగా మారే ప్రమా దం ఉందని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క సభలో ప్రస్తావించారు. దీనిపై సీఎం కేసీఆర్‌ స్పంది స్తూ.. నాగార్జునసాగర్‌ చివరి ఆయకట్టుకు ఎలాంటి నీటి కొరత రానివ్వబోమని, సీతారామ ఎత్తిపోతల పథకంతో పూర్తిస్థాయిలో నీటి సరఫరా జరుగుతుందని ప్రకటించారు. ఈ కాలువలను నిర్మించే క్రమంలో ఒక టి, రెండు చోట్ల ఏపీ భూభాగంలోకి కాలువలు వెళ్లి, మళ్లీ తెలంగాణ భూభాగంలోకి వచ్చే పరిస్థితి ఉందన్నారు. ఈ సమస్యపై ఏం చేయాలనే దానిపై స్పష్టత కోసం ఓ సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. 


మధ్యాహ్న భోజన కార్మికుల వేతనం పెంపు

మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనాన్ని రూ.1000 నుంచి రూ.3 వేలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ప్రస్తుతం ఇస్తున్న గౌరవ వేతనం ఏమాత్రం సరిపోవడంలేదని, దానిని పెంచాలని వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ చేసిన విజ్ఞప్తికి సీఎం స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 54,210 మంది మధ్యాహ్న భోజన కార్మికులు ఉన్నారని, వారి వేతనాన్ని పెంచాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావుకు సీఎం సూచించారు. 

Updated Date - 2022-03-16T08:19:54+05:30 IST