ఉపాధిలో 11వ స్థానం

ABN , First Publish Date - 2022-05-05T06:53:01+05:30 IST

రాష్ట్రస్థాయిలో జిల్లా ఉపాధి హామీ పథకానికి 11వ స్థానం దక్కింది. వేసవిలో వ్యవసాయ పనులు దాదాపుగా పూర్తికావడంతో రైతులు, కూలీలు ఉపాధి పనులపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ప్ర స్తుతం జిల్లావ్యాప్తంగా రోజుకు 62వేల 972 మంది కూలీలకు ఉపాధిని కల్పిస్తున్నారు.

ఉపాధిలో 11వ స్థానం
జిల్లాలో పనులు చేస్తున్న ఉపాధి కూలీలు

జిల్లాలో రోజుకు 62వేల 972 మంది కూలీలకు ఉపాధి కల్పన

మొత్తం 468 జీపీలు ఉండగా.. ఒక్కో గ్రామ పంచాయతీ నుంచి 130 మందికి ఉపాధి

ఇప్పటి వరకు 6లక్షల11వేల పని దినాలు పూర్తి

9,657 మందికి కూలీ డబ్బుల  చెల్లింపుల్లో ఇబ్బందులు

నిరుపేద కూలీలకు అండగా నిలుస్తున్న ఉపాధి హామీ పథకం

జిల్లావ్యాప్తంగా లక్షా 75 వేల జాబ్‌కార్డులు ఉండగా, మొత్తం 3లక్షల 68 వేల మంది కూలీలు

ఆదిలాబాద్‌, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయిలో జిల్లా ఉపాధి హామీ పథకానికి 11వ స్థానం దక్కింది. వేసవిలో వ్యవసాయ పనులు దాదాపుగా పూర్తికావడంతో రైతులు, కూలీలు ఉపాధి పనులపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ప్ర స్తుతం జిల్లావ్యాప్తంగా రోజుకు 62వేల 972 మంది కూలీలకు ఉపాధిని కల్పిస్తున్నారు. జిల్లాలో 468 గ్రామ పంచాయతీల వారీగా ఒక్కో గ్రామ పంచాయతీ నుంచి సుమారుగా 130 మంది కూలీలు ఉపాధిని పొందుతున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖాధికారులు పేర్కొంటున్నారు. జిల్లావ్యాప్తంగా లక్షా 75వేల జాబ్‌కార్డులు ఉండగా, మొత్తం 3లక్షల 68వేల మంది కూలీలు ఉన్నారు. ఇందులో లక్షా 13 వేల మంది కూలీలు యాక్టివ్‌గా పని చేస్తున్నారు. గత పక్షం రోజులుగా జిల్లాలో ముమ్మరంగా ఉపాధి పనులు కొనసాగుతున్నాయి. ఈనెల ఆఖరి వరకు లక్ష మంది కూలీలకు పని కల్పించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో మండిపోతున్న ఎండల దాటికి కొంత ఇబ్బందికర పరిస్థితులే కనిపిస్తున్నా.. కు టుంబ పోషణ భారం కావడంతో పనులు చేయక తప్పడం లేదని కూలీలు వాపోతున్నారు. ఇదివరకే కొంత మంది కూలీలు వడదెబ్బ బారీన పడి అస్వస్థతకు గురైన దాఖలాలు కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూలీలను ఆదుకునేందుకు రూ.236 నుంచి రూ.257 వరకు కూలీని పెంచడంతో పనులు చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. మొత్తానికి నిరుపేద కూలీలకు ఉపాధి హామీ పథకం అండగా నిలుస్తోందని చొప్పొచ్చు.

36.54 లక్షల పని దినాలే టార్గెట్‌

ఈ ఆర్థిక సంవత్సరంలో 36లక్షల 54వేల పని దినాలను టార్గెట్‌గా పెట్టుకున్న గ్రామీణాభివృద్ధి శాఖాధికారులు.. ఇప్పటి వరకు 6లక్షల 11 వేల పని దినాలను మాత్రమే పూర్తి చేశారు. మిగితా 30 లక్షల పని దినాలను వచ్చే ఏప్రిల్‌ మాసం వరకు పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం జిల్లాలో ఉపాధి హామీ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గ్రామాల్లో కూలీలకు అధికారులు అవగాహన కల్పించడంతో ముందుకు వస్తున్నారు. జిల్లాలో ఎక్కువగా వ్యవసాయ ఆధారిత కుటుంబాలే కావడం, సరిపడా నీటి వనరులు కూడా లేకపోవడంతో వేసవి సమయంలో ఉపాధి పనులు చేసేందుకు కూలీలు ముందుకు వస్తున్నారు. అయితే మరింత అవగాహన కల్పిస్తే కూలీల సంఖ్య బారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడం కూడా కూలీల హాజరుపై ప్రభావం చూపుతోందని అధికారులు పేర్కొంటున్నారు.

విధుల్లో చేరని ఫీల్డ్‌ అసిస్టెంట్లు

గత రెండేళ్ల క్రితం ఉద్యోగ భద్రత కల్పించాలని ఆందోళన చేపట్టిన ఫీల్డ్‌ అసిస్టెంట్‌లను ప్రభుత్వం విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. దీంతో గ్రామాల్లో ఉపాధి పనుల పర్యవేక్షణ బాధ్యతను గ్రామ పంచాయతీలకు అప్పగించారు. ప్రస్తుతం స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శిలే ఉపాధి హామీ పనులపై పర్యవేక్షణ చేపడుతు న్నారు. అలాగే అందుబాటులో ఉన్న టెక్నికల్‌ అసిస్టెంట్‌ల సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారు. పనుల గుర్తింపు, కూలీలకు వస తులను కల్పించడం, తదితర విషయాలను గ్రామ సర్పంచ్‌, కార్య దర్శులకే అప్పగించారు. జిల్లాలోని 468 గ్రామ పంచాయతీలలో ఉపాధి పనులు యధావిధిగా కొనసాగుతున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫీల్డ్‌అసిస్టెంట్లను తిరిగి విఽధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చినా.. అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. మరో నెల రోజులు మాత్రమే ముమ్మరంగా ఉపాధి పనులు కొనసాగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో కూలీల సంఖ్య తగ్గుముఖం పట్టనుంది. కాని కొన్ని గ్రామాలలో సర్పంచ్‌ల పెత్తనం పెరిగిపోవడం, పనులపై కార్యదర్శులకు అవగాహన లేకపోవడం తో అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు ఎదురవుతు న్నాయి. జిల్లావ్యాప్తంగా 9,657 మందికి కూలి డబ్బుల చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీరందరికీ తిరిగి నూతన పోస్టల్‌ అకౌంట్ల ద్వారా చెల్లింపులు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, త్వరలోనే అన్నింటినీ పరిష్కరిస్తామని అధికారులు చెబుతున్నారు.

ప్రతీ ఒక్కరికీ పని కల్పిస్తాం

: రవీందర్‌ రాథోడ్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఏపీడీ, ఆదిలాబాద్‌

పని అడిగిన ప్రతీఒక్కరికి ఉపాధిని కల్పిస్తున్నాం. ఈ దిశగా గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ కూలీలు ముందుకు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ నెలాఖరు వరకు లక్ష మందికి పైగా కూలీలకు పని కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. కొత్త వారికి జాబ్‌కార్డులను అందజేస్తాం. కొంతమందికి కూలి చెల్లింపుల్లో ఇబ్బందు లు ఎదురవుతున్నాయి. వాటిని వెంటనే పరిష్కరిస్తాం.  పోస్టాఫీసు ద్వారా కూలి డబ్బులను వారి అకౌంట్‌లో జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడ అక్రమాలు, అవినీతి జరుగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాం. కూలీలు వేసవి జాగ్రత్తలు పాటించాలి. 

Read more