మ్యాచ్‌ ఓడినా... మనసులు గెలిచింది!

Jul 26 2021 @ 00:13AM

ఆరుగురు సభ్యుల బృందానికి ముందు నిలబడి... తమ దేశ పతాకాన్ని మోస్తూ సగర్వంగా నడచిన పన్నెండేళ్ళ అమ్మాయి... తొలి మ్యాచ్‌లో ఓటమిని హుందాగా స్వీకరించి క్రీడాభిమానుల హృదయాలను గెలుచుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో అతి పిన్న వయస్కురాలిగా బరిలోకి దిగి అందరినీ ఆకర్షించిన ఆమె... హెంద్‌ జజా. ‘‘ఇది పరాజయం కాదు, లక్ష్యం వైపు నేను వేసిన మరో అడుగు’’ అంటున్న సిరియా టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి విశేషాలు ఇవి...


ఉగ్రవాద దాడుల భయం, అంతర్యుద్ధంతో కల్లోలం... ఎక్కడ చూసిన అనిశ్చితి, అభద్రత. ఇలాంటి భయాల నుంచి దృష్టి మళ్ళించడానికి ‘ఆటే శరణ్యం’ అనుకుంది హెంద్‌ జజా. సిరియాలోని హామా ఆమె సొంత ఊరు. అశాంతికి నిలయంగా మారిన ఆ నగరంలో సౌకర్యాలు అంతంతమాత్రం. మిగతా పిల్లల్లాగానే సాగిపోతున్న ఆమె జీవితం అయిదేళ్ళ వయసులో కొత్త మలుపు తీసుకుంది. జజా అన్న టేబుల్‌ టెన్నిస్‌ బాగా అడతాడు. అతని ఆటను గమనిస్తూ... క్రమంగా దానిపట్ల ఆమె ఆకర్షితురాలైంది. అన్నతో పాటు ఆడడం మొదలెట్టింది. స్థానిక టేబుల్‌ టెన్నిస్‌ కోచ్‌ అల్జిమాన్‌ ఒక రోజు ఆమె ప్రాక్టీస్‌ చేయడం చూసి, ఆమెలో నైపుణ్యాన్ని గుర్తించాడు. జజా కుటుంబం అనుమతితో ఆమెకు శిక్షణ ప్రారంభించాడు. రెండేళ్ళలోనే... ఖతార్‌లో జరిగిన అంతర్జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో తన ప్రతిభను జజా ఘనంగా చాటుకుంది. తరువాత ఆమె శిక్షణ డమాస్కస్‌ నగరానికి మారింది. అక్కడ తరచూ విద్యుత్‌ సరఫరాలో కోతలు ఉంటాయి. అందుకని ప్రాక్టీస్‌ పగలే పూర్తి చేసుకోవాలి. ఆమెతో ఆడడానికి ఎక్కువమంది దొరికేవారు కాదు. ప్రాక్టీ్‌సకు అవసరమైన సరంజామా సమకూర్చుకోవడం కష్టమయ్యేది. ఇవేవీ ఆమె పట్టుదలను దెబ్బతియ్యలేకపోయాయి. జోర్డాన్‌లో జరిగిన ‘వెస్ట్రన్‌ ఆసియా ఒలింపిక్స్‌ క్వాలిఫికేషన్‌ టోర్నమెంట్‌’లో... నలభై రెండేళ్ళ లెబనాన్‌ క్రీడాకారిణి మరియానా షహకియన్‌తో తలపడి, ఉమెన్‌ సింగిల్స్‌ టైటిల్‌ గెలిచి, తాజా ఒలింపిక్స్‌ లో చోటు ఖరారు చేసుకుంది. 


నాకిది మంచి పాఠం...

‘‘కాంక్రీట్‌ నేల మీద, విరిగి పోయిన పాత టేబుళ్ళ ముందు ప్రాక్టీస్‌ చేసేదాన్ని కరెంట్‌ ఎప్పుడు పోతుందో తెలీదు. ఏ వైపు నుంచి పేలుడు శబ్దం వినిపిస్తుందో తెలీదు. ఈ పరిస్థితుల్లో ఆట మీద ఏకాగ్రత నిలుపుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది’’ అని గుర్తు చేసుకుంది జజా. 1968 తరువాత... ఒలింపిక్స్‌లో పాల్గొన్న అతి పిన్నవయస్కురాలుగా... క్రీడాభిమానుల దృష్టినీ, మీడియా దృష్టినీ ఆమె ఆకర్షించింది. ఇంత చిన్న వయసులో ఒలింపిక్స్‌ స్థాయికి చేరడం చిన్న విషయం కాదు. ముఖ్యంగా టేబుల్‌ టెన్నిస్‌ విభాగంలో పోటీ చాలా ఎక్కువ. తొలి మ్యాచ్‌లోనే సీనియర్‌ క్రీడాకారిణిని ఆమె ఎదుర్కోవాల్సి వచ్చింది. జజా ప్రత్యర్థి లియూ జియా సామాన్యురాలు కాదు. ఆమె వయసు జజా వయసు కన్నా మూడింతల పైనే (39), జజా పుట్టడానికి ముందే మూడు... మొత్తంగా ఆరు ఒలింపిక్స్‌లో పాల్గొన్న అనుభవం ఆమె సొంతం. ఈ మ్యాచ్‌లో జజా పరాజయం పాలైనా, లియూకూ గట్టి పోటీ ఇవ్వగలిగింది. ‘‘టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనడమే ఒక విజయం. నన్ను గెలవమని ఎవరూ అడగలేదు. బాగా ఆడమన్నారు. అయితే నేను మ్యాచ్‌ గెలవాలనుకున్నాను. ఇంకా బాగా ఆడగలననుకున్నాను. కానీ ఎదురుగా ఉన్నది గట్టి ప్రత్యర్థి. నాకిది ఓ మంచి పాఠం. మొదటి ఒలింపిక్స్‌లోనే దీన్ని నేర్చుకోగలిగాను. వచ్చేసారి మరింత కష్టపడతాను, మరింత మెరుగైన ఫలితం సాధిస్తాను. నా లక్ష్యాన్ని సాధించే దిశగా మరో అడుగు ముందుకు పడిందనుకుంటున్నా’’ అంటూ వయసు చిన్నదైనా తన పరిణతిని చాటుకుంది జజా. విమాన ప్రయాణం వల్ల అలసట, ఆ తరువాత ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవంలో పాల్గొనాల్సి రావడం, మ్యాచ్‌ గురించి ఆలోచనలతో నిద్ర సరిగ్గా లేకపోవడం.... వీటన్నిటి వల్లా సరైన సన్నద్ధత లేకుండానే జజా బరిలోకి దిగాల్సి వచ్చింది. ‘‘చాలా అనుభవం ఉన్న ప్రత్యర్థితో మొదటి మ్యాచ్‌. దీని కోసం మానసికంగా సంసిద్ధం కావడం కష్టమైంది. కానీ నేను ఏదో రకంగా దాన్ని అధిగమించగలిగాను’’ అని చెప్పిందామె.


ఆట అన్నీ ఇచ్చింది, ఎన్నో నేర్పింది...

‘‘గత అయిదేళ్ళుగా రకరకాల అనుభవాలు ఎదుర్కొన్నాను. మా దేశంలోని పరిస్థితుల వల్ల అంతర్జాతీయ టోర్నమెంట్లకు తరచూ వెళ్ళలేకపోయేదాన్ని, వీసాలు సంపాదించడం గగనమైపోయేది. కానీ నా లక్ష్యం కోసం పోరాడాలని దృఢంగా నిశ్చయించుకున్నాను. వనరులు అందుబాటులో లేక, పరిస్థితులు అనుకూలించక తమ ఆశలను ఎంతో మంది అణిచేసుకుంటున్నారు. నేను చెప్పేది ఒక్కటే... మీ కలలను నిజం చేసుకోడానికి పోరాడండి. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సరే... కష్టపడి ప్రయత్నిస్తే మీ ఆశయాన్ని తప్పకుండా సాధిస్తారు’’ అంటోంది జజా. ఆమెకు హ్యారీపోటర్‌ పుస్తకాలంటే ఇష్టం. టేబుల్‌ టెన్ని్‌సలో నాలుగు సార్లు ఒలింపిక్స్‌ పతకాలు సాధించిన చైనీస్‌ క్రీడాకారిణి డింగ్‌ నింగ్‌ ఆమెకు ఆదర్శం. ప్రస్తుతం అమలులో ఉన్న కరోనా నియంత్రణలు తొలగించాక... తమ దేశంలో శిక్షణ పొందాలని జజాను చైనా ఒలింపిక్‌ కమిటీ ఆహ్వానించింది. ‘‘టేబుల్‌ టెన్నిస్‌ నాకు అన్నీ ఇచ్చింది. దృఢంగా, ఆత్మవిశ్వాసంతో ఎలా ఉండాలో బోధించింది. సహనాన్ని నేర్పింది. ఒకసారి ఆటలోకి దిగితే అన్నీ మరచిపోతాను. నేను ప్రపంచ ఛాంపియన్‌ కావాలి, ఒలింపిక్స్‌ ఛాంపియన్‌ కావాలి. దాని కోసం ఆట కొనసాగిస్తూనే ఉంటాను. అయితే చదువు మాత్రం మానేది లేదు. ఫార్మసిస్ట్‌ లేదా లాయర్‌ కావాలనుకుంటున్నా. ఏ రోజైనా ప్రాక్టీస్‌ లేకపోతే ఏదో పోగొట్టుకున్నట్టుంటుంది. ఏదో వెలితిగా ఉంటుంది. అందుకే ఆటే నా జీవితం’’ అని స్పష్టం చేస్తోంది జజా.ఆమెను తేలిగ్గా తీసుకోలేదు...

ఈ ఒలింపిక్స్‌లో తన తొలి ప్రత్యర్థిని అంత తేలిగ్గా తీసుకోలేదంటుంది జజాతో తలపడిన లియూ జియా. ‘‘జజాను తక్కువగా అంచనా వేయకూడదని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉన్నాను. ఆమెకు గొప్ప టాలెంట్‌ ఉంది. ఆమె ఆటలో చక్కటి లయ ఉంది. కావలసిందల్లా మరింత అనుభవం. ఆమెను చూస్తే నాకు మాతృత్వ భావన కలిగింది. ఎందుకంటే నాకు పదేళ్ళ కూతురు ఉంది. టోర్నమెంట్‌కు ముందు రోజు రాత్రి మా అమ్మాయిని అడిగాను, ‘‘నీకన్నా కేవలం రెండేళ్ళు పెద్దదైన అమ్మాయితో మీ అమ్మ మ్యాచ్‌ ఆడబోతోంది. నీకు తెలుసా’’  అని. ‘‘అవునా? అయితే మ్యాచ్‌ ఓడిపోకుండా చూసుకో!’’ అంది మా అమ్మాయి. మనకన్నా వయసులో చాలా చిన్న వారి చేతిలో ఓడిపోవడం ఎంత అవమానంగా ఉంటుందో అందరికీ తెలుసు. అందుకే 

‘‘నీ మాటల్తో నన్ను మరింత ఒత్తిడి పెట్టొద్దు’’ అన్నాను మా అమ్మాయితో అని లియూ గుర్తు చేసుకుంది. మ్యాచ్‌ పూర్తయ్యాక జజాను ఆమె అభినందించింది. ఇద్దరూ కలిసి సెల్ఫీ తీసుకున్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.