Advertisement

లచ్చవ్వ.. జయహో..

Jan 24 2021 @ 01:10AM
లచ్చవ్వ

ఆధార్‌ ప్రకారం  వయస్సు 104 సంవత్సరాలు

121 ఏళ్లు అంటున్న కుటుంబ సభ్యులు 


రాంనగర్‌, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): ఈ అవ్వ పేరు జొన్నలగడ్డ లచ్చవ్వ..  శతవసంతాలు పూర్తి చేసుకుంది. ఆధార్‌కార్డు ప్రకారం (1981 జనవరి 1) ఆమె వయస్సు 104 ఏళ్లు. కుటుంబ సభ్యులు మాత్రం తమ వద్ద ఉన్న ఆధారాల ప్రకారం ఆమె వయస్సు 121 అని చెబుతున్నారు. ఏది ఏమైనా జొన్నలగడ్డ లచ్చవ్వ శతవసంతాలు చూశారు. ఈ నెల 24న ఆమె జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కుమారుడు ఏర్పాట్లు చేస్తున్నాడు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం పొట్లపల్లి గ్రామానికి చెందిన జొన్నలగడ్డ లచ్చవ్వ భర్త ఐలయ్య 60 ఏళ్ల క్రితం చనిపోయాడు. ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కాగా, కుమారులు జొన్నలగడ్డ రాజయ్య, జొన్నలగడ్డ లక్ష్మయ్య, కుమార్తెలు రాజవ్వ, బసవవ్వలు ఉన్నారు. ఆమె భర్త చనిపోయిన నాటి నుంచి తల్లి బాగోగులు జొన్నలగడ్డ లక్ష్మయ్య చూస్తున్నాడు. ఆమె కోసం పొట్లపల్లిలో ఇంటిని కూడా నిర్మించాడు. గతేడాది గ్రామంలోనే లచ్చవ్వ 120వ పుట్టిన రోజు వేడుకలను  ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం నాచారం గాంధీనగర్‌లో ఆమె కోసం ప్రత్యేక గది నిర్మించి, తల్లికి సేవలు చేస్తున్నాడు. 


అందరినీ పేరుపేరునా.. 

ఈ వయస్సులో కూడా జొన్నలగడ్డ లచ్చవ్వ జ్ఞాపక శక్తిని కోల్పోలేదు. బంధువులు, వారి పిల్లల పేర్లను కూడా గుర్తు పెట్టుకుని పేర్లతో పిలుస్తారు. ఎవరైనా కనిపిస్తే ‘పిల్లలు ఏం చేస్తున్నారు. పొలం పనులు ఎలా జరుగుతున్నాయి’ అంటూ యోగక్షేమాలు తెలుసుకుంటారు. తన 121వ పుట్టిన రోజు వేడుకలకు బంధువులందరినీ ఆహ్వానించమని లక్ష్మయ్యకు చెప్పారని, ఆయన ఫోన్‌ చేస్తే ఆమె స్వయంగా మాట్లాడారని పలువురు బంధువులు చెప్పారు. 


తల్లిని మించిన దైవం లేదు 

తల్లిని మించిన దైవం లేదు. కోట్ల ఆస్తిని సంపాదించవచ్చు కానీ, తల్లిని సంపాదించుకోలేం. మాతృమూర్తికి సేవ చేయడం భగవంతుడికి చేసిన సేవతో సమానం. మా అమ్మ 121 ఏళ్లు జీవించడం మాకు గొప్పవరం. ఆమెను చంటిపిల్లలా భావించి, అన్ని సేవలు చేస్తున్నా. ఇది నా జన్మకు సార్థకత చేకూర్చినట్లు అయింది. ఆదివారం జరిగే అమ్మ పుట్టిన రోజు వేడుకలకు బంధుమిత్రులను ఆహ్వానించాను. 

-  లక్ష్మయ్య, జొన్నలగడ్డ లచ్చవ్వ కుమారుడు

Follow Us on:
Advertisement