స్వాతంత్ర్య సమర ధీరుడు

ABN , First Publish Date - 2021-01-23T06:24:30+05:30 IST

మాతృభూమి స్వాతంత్ర్యం కోసం సుభాస్ చంద్రబోస్ సాగించిన పోరాటం భారతదేశానికేగాక తృతీయ ప్రపంచ దేశాలన్నిటికీ ఎంతో ప్రేరణ ఇచ్చింది. పలు ఆసియా దేశాల్లోని నేతాజీ విగ్రహాలు స్వాతంత్ర్య యోధుడుగా ఆయనకుగల....

స్వాతంత్ర్య సమర ధీరుడు

మాతృభూమి స్వాతంత్ర్యం కోసం సుభాస్ చంద్రబోస్ సాగించిన పోరాటం భారతదేశానికేగాక తృతీయ ప్రపంచ దేశాలన్నిటికీ ఎంతో ప్రేరణ ఇచ్చింది. పలు ఆసియా దేశాల్లోని నేతాజీ విగ్రహాలు స్వాతంత్ర్య యోధుడుగా ఆయనకుగల ప్రపంచవ్యాప్త గుర్తింపును ప్రస్ఫుటం చేస్తున్నాయి.


నేతాజీ సుభాస్ చంద్రబోస్ జీవితమే ఓ పోరు గాథ. అది ప్రతి కంటా పెల్లుబికే చైతన్యం, పోరాట స్ఫూర్తి, విజయాలతో కూడిన వీరగాథను విశదీకరించే యువ స్వాప్నికుడి కథ. అతడు బాహుబలంతో భూమిని చీల్చుకురాగల శక్తి సంపన్నుడు, ఆకాశాన్ని ఛేదించడం గురించి చెప్పగలవాడు; అద్వితీయ కృషితో లక్ష్యాలను సాధించే తపనగలవాడు, ఉచితంగా దేన్నీ అంగీకరించనివాడు, స్వేచ్ఛాపిపాసతో రక్తం చిందించేందుకు సంసిద్ధుడు. అలాంటి నేతాజీ ఒక్క పిలుపునివ్వగానే వేలాదిగా ప్రజలు తృణప్రాయంగా ప్రాణత్యాగం చేశారు. అతడు బ్రిటిష్ వ్యతిరేక సైన్యాన్ని తృటిలో సృష్టించాడు. ఆయన ఇచ్చిన ఒక్క నినాదం నింగి నిండా పరచుకుని ప్రతిధ్వనించింది. ఆ నినాదం- జై హింద్.


ఒడిషాలోని కటక్ నగరంలో జన్మించిన నేతాజీ, బెంగాల్‌లోని కోల్‌క‌తాలో పట్టభద్రులయ్యారు. అలాగే చిన్న వయసులోనే బ్రిట‌న్‌లో ‘ఐసీఎస్’ ఆఫీసర్ కావడం ద్వారా తన ప్రతిభాశక్తిని శత్రువులకు చాటిచెప్పారు. కానీ, ఆ హోదావల్ల తనకు లభించిన గౌరవం, సౌకర్యాలతో కూడిన జీవన విధానంలో ఎంతమాత్రం ఇమడలేకపోయారు. ఆయన స్వాతంత్ర్య పోరాట బావుటా ఎగరేసి, ఆ సంఘర్షణ గాథను రచించాల్సిన ఓ యోధుడు. మనసావాచా కర్మణా స్వాతంత్ర్య ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకోవడమేగాక స్వేచ్ఛకు ఒక స్ఫూర్తిగా నిలుస్తూ- ‘మీ రక్తం చిందించండి – నేను మీకు స్వాతంత్ర్యం సాధించిపెడతాను’ అనే నినాదంతో దేశంలో చైతన్యం రగుల్కొల్పడం ప్రారంభించారు. ఆయన మాటలు విన్న ప్రతి ఒక్కరూ ఆ వైపు ఆకర్షితులయ్యే వారంటే ఆయన సిద్ధాంతం, వ్యక్తిత్వం, ఎంత సమ్మోహనకరమో అర్థం చేసుకోవచ్చు.


సుభాస్‌కు లభించిన ప్రజాదరణ ఆకాశాన్నంటి అచిరకాలంలోనే సాధారణ ప్రజానీకానికి నేతాజీగా మారారు. భరతమాతపై అపరిమిత ప్రేమ గల ఆయనకు దేశం బానిస సంకెళ్లతో కునారిల్లడం మనశ్శాంతి లేకుండా చేసింది. దేశంపై సుభాస్‌కు ఉన్న ప్రేమాభిమానాలు ఒక అద్భుతానికి దారితీసి, సరిహద్దులకు ఆవల ఉన్నవారు కూడా ఆయన పట్ల ఆకర్షితులయ్యారు. అనేక ముఖ్యమైన దేశాల అధిపతులు ఆయనకు అండగా నిలిచారు. తద్వారా దేశం వెలుపల కూడా స్వాతంత్ర్య సంగ్రామాన్ని నేతాజీ రగిలించారు. ఆయనో సరికొత్త బలగాన్ని సృష్టించి ‘అజాద్ హింద్ ఫౌజ్’ (భారత జాతీయ సైన్యం)గా శత్రువుల ముందు నిలిపారు. ‘దిల్లీ చలో’ నినాదంతో అందరిలోనూ నవ్య స్ఫూర్తి నింపుతూ భరతమాత విముక్తి కోసం తన పయనానికి శ్రీకారం చుట్టారు. ఆయన సృష్టించిన సైనిక బలగంలోని 60,000 మందిలో దాదాపు 26,000 మంది వీరులు నేతాజీ నినాదం మేరకు తమ రక్తం చిందించి అమరులయ్యారు. ఆత్మగౌరవంతో జీవించే లక్ష్యంతో సుభాస్ చంద్రబోస్ ద్వారా త్రివర్ణ పతాకధారి అయిన భారత సింహం తన సకల శక్తియుక్తులతో బ్రిటిష్ పాలకులకు ఎదురొడ్డింది. ఈ గర్జన బ్రిటిష్ వారికి సింహస్వప్నమై వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తించి, చివరకు వలస పాలకులు దేశాన్ని వదిలివెళ్లేదాకా కొనసాగింది.


‘విజయానికి ఎప్పుడూ వైఫల్యమే పునాది’ అన్న సిద్ధాంతంతో సుభాస్ చంద్రబోస్ అందరికీ ప్రేరణ ఇచ్చేవారు. నేతాజీ అనేకసార్లు వైఫల్యాలను ఎదుర్కొన్నప్పటికీ తన పోరాట పటిమతో వాటన్నిటినీ వీరగాథలుగా మలచేవారు. పురపాలక రాజకీయం, కాంగ్రెస్‌లో సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఆ మహాసంస్థకు అధ్యక్షులు కావడం, ఫార్వర్డ్ బ్లాక్ స్థాపన, భారత జాతీయ సైన్యం పోరాటం... ఇలా పోరు వేదిక ఏదైనా అత్యుత్తమ విజయాలు సాధించారు. మహాత్మాగాంధీ నాయకత్వాన్ని అంగీకరించినా, సుభాస్ చంద్రబోస్ కాంగ్రెస్‌ను వీడటానికి గాంధీజీయే కారణం కావడం విచిత్రం. ఈ మహానాయకులు సదా పరస్పరం గౌరవించుకునేవారు. గాంధీజీని చిన్నబుచ్చే విధంగా నేతాజీ ఎన్నడూ మాట్లాడింది లేదు. నేతాజీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రెండుసార్లు ఎన్నికైనా తొలుత ఆ పదవిని, ఆ తర్వాత కాంగ్రెస్‌ను వీడి వెళ్లారు. అనంతరం భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రకు ఆయన ఒక అధ్యాయాన్ని జోడించగా, అందులోని పుటలను ఇంకా జోడించాల్సి ఉంది.


దేశ స్వాతంత్ర్యంపై తమ వైఖరికి సంబంధించి 1939లోనూ, ఆ తర్వాత కాంగ్రెస్ నేతలతోపాటు కమ్యూనిస్టులు కూడా ఒక నిశ్చితాభిప్రాయానికి రాలేకపోయారు. దీంతో స్వాతంత్ర్య స్వప్న సాకారమే ఏకైక లక్ష్యంగా హిట్లర్, ముసోలినీ, టోజో, స్టాలిన్ వంటి ప్రపంచ నాయకులతో సుభాస్ చంద్రబోస్ చేయి కలిపారు. భారత జాతీయ సైన్యం పేరిట సాయుధ బలగం ఏర్పాటుతోపాటు 1943 అక్టోబర్ 24న ‘స్వతంత్ర భారత ప్రభుత్వం’ కూడా స్థాపించారు. ఈ కొత్త దేశాన్ని గుర్తిస్తున్నట్లు జర్మనీ, ఇటలీ, జపాన్, ఐర్లాండ్, చైనా, కొరియా, ఫిలిప్పైన్స్ సహా 9 దేశాలు ప్రకటించడం విశేషం.


భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన సమయంలో బ్రిటన్ ప్రధానమంత్రిగా ఉన్న క్లెమెంట్ అట్లీ 1956లో కోల్‌క‌తా వచ్చారు. అప్పట్లో గవర్నర్ జస్టిస్ పి.బి.చక్రవర్తి ఆయనకు ఆతిథ్యమిచ్చిన సందర్భంగా భార‌త్‌కు స్వేచ్ఛ ఇవ్వాలన్న బ్రిటన్ నిర్ణయానికి కారణమేమిటని ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ-, నేతాజీ సుభాస్ చంద్రబోస్ నేతృత్వంలోని అజాద్ హింద్ ఫౌజ్ సైనిక కార్యకలాపాలు పెరుగుతుండటంతో బ్రిటన్ ప్రభుత్వం పట్ల భారత సైన్యం, నావికాదళాల్లో విధేయత తగ్గిపోవడం ఒక ప్రధాన కారణమని అట్లీ వెల్లడించారు. భారత స్వాతంత్ర్యం సముపార్జనలో సుభాస్ చంద్రబోస్ పోషించిన పాత్ర ఎంత గొప్పదో దీన్ని బట్టి స్పష్టమవుతోంది. ఆర్‌సిమజుందార్ రచించిన ‘ఎ హిస్టరీ ఆఫ్ బెంగాల్’ పుస్తకం ప్రచురణకర్తకు జస్టిస్ చక్రవర్తి రాసిన లేఖలో ఈ అంశాన్ని ప్రస్తావించారు.


మధ్యప్రదేశ్‌లోని జ‌బ‌ల్పూర్‌ నగరం నేతాజీ జీవితంలో కీలకపాత్ర పోషించగా, నర్మదా నదీతీరం ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. జ‌బ‌ల్పూర్‌ సమీపంలోని త్రిపురిలో 1939 మార్చి 4 నుంచి 11వ తేదీ వరకూ కాంగ్రెస్ మహాసభలను నిర్వహించారు. నేతాజీ ఆరోగ్యం బాగాలేకున్నా స్ట్రెచర్ మీదనే దానికి హాజరయ్యారు. ఆ తర్వాత 1939 జూలై 4న ‘ఫార్వర్డ్ బ్లాక్’ స్థాపన కోసం మళ్లీ జబల్పూర్ వచ్చిన సందర్భంగా నేతాజీకి అపూర్వ స్వాగతం లభించింది. మధ్యప్రదేశ్ ప్రజలకు నేతాజీతో గాఢమైన సంబంధాలున్నాయి. రాష్ట్రంలోని ప్రతి నగరంలోనూ ఆయన పేరిట ఒక వార్డు ఉండటం గమనార్హం. అలాగే సహయోగ్ క్రీడామండలి గత 37 సంవత్సరాలుగా నేతాజీ స్మారక జాతీయ కబడ్డీ పోటీలతో పాటు ఇతర క్రీడా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. నేతాజీ పట్ల రాష్ట్ర ప్రజలకు ఉన్న లోతైన విశ్వాసానికి ఇదే నిదర్శనం. ఇక జబల్పూర్, షివ్నీలలోని జైళ్లలోనూ నేతాజీ నిర్బంధానికి గురయ్యారు.


సుభాస్ చంద్రబోస్ ఆంగ్లం, హిందీ, బెంగాలీ, తమిళం, తెలుగు, గుజరాతీ, పాష్తో భాషలపై పట్టు సాధించారు. ఆజాద్ హింద్ ఫౌజ్‌ కార్యకలాపాల్లో, దేశ ప్రజలకు సందేశాలివ్వడంలో ఆయనకున్న ఈ భాషా నైపుణ్యం ఎంతగానో ఉపయోగపడింది. ‘విజయం సుదూరమేగానీ, అది మనకు అత్యావశ్యకం’ అన్నది నేతాజీ తన సహచరులకిచ్చిన సందేశం. ‘ఒక వ్యక్తికి దృఢ సంకల్పం లేకపోతే అతడెన్నటికీ గొప్పవాడు కాలేడు’ అని సుభాస్ చంద్రబోస్ ఎప్పుడూ చెబుతూండేవారు. భారతదేశంలో నేతాజీ 11 సార్లు జైలుపాలయ్యారు. నిర్బంధం నుంచి విముక్తం కావడంలో, ప్రపంచ దేశాధినేతలను కలుసుకోవాలన్న సంకల్పం నెరవేర్చుకోవడంలో తనదైన ‘చతురత’ను కూడా ఆయన ప్రదర్శించారు. భారత నాయకత్వానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టిన ఘనత సుభాస్ చంద్రబోస్‌కే ద‌క్కింది.


ఆయనకు ముందు భారత ఆధ్యాత్మిక- సాంస్కృతిక ఆధిపత్యం, గుర్తింపును స్వామి వివేకానంద ప్రపంచానికి చాటిచెప్పారు. అందుకే స్వామి వివేకానంద ప్రభావం నేతాజీపై కనిపిస్తుంది. గీతా పఠనాన్ని సుభాస్ చంద్రబోస్ ఎన్నడూ ఆపలేదు. మాతృభూమి స్వాతంత్ర్యం కోసం సుభాస్ చంద్రబోస్ సాగించిన పోరాటం భారతదేశానికేకాక తృతీయ ప్రపంచ దేశాలన్నిటికీ ఎంతో ప్రేరణ ఇచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దాదాపు 15 ఏళ్లపాటు 36 ఆసియా దేశాల్లో స్వాతంత్ర్య గీతాలాపన సాగింది. భారత స్వాతంత్ర్య సంగ్రామం, దేశమాత స్వేచ్ఛ కోసం సుభాస్ చంద్రబోస్ నాయకత్వాన సాగిన పోరాటం ఆ దేశాలను గాఢంగా ప్రభావితం చేసింది. ఆయా దేశాల్లోని నేతాజీ విగ్రహాలు స్వాతంత్ర్య యోధుడిగా ఆయనకు కల ప్రపంచవ్యాప్త గుర్తింపును ప్రస్ఫుటం చేస్తున్నాయి.




-ప్రహ్లాద్ సింగ్ పటేల్

కేంద్ర పర్యాటక-, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి

(నేడు నేతాజీ 125వ జయంతి)

Updated Date - 2021-01-23T06:24:30+05:30 IST