Bharat Jodo Yatra: 13వ రోజు భారత్ జోడో యాత్ర ప్రారంభం

ABN , First Publish Date - 2022-09-20T18:36:51+05:30 IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మంగళవారం

Bharat Jodo Yatra: 13వ రోజు భారత్ జోడో యాత్ర ప్రారంభం

అళపుజ (కేరళ) : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మంగళవారం భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) 13వ రోజు పాదయాత్రను చేర్తల నుంచి ప్రారంభించారు. సెయంట్ మైఖేల్స్ కళాశాలలో మొక్కను నాటిన అనంతరం ఆయన నడక ప్రారంభమైంది. ఆయనతోపాటు వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఈ యాత్రలో పాల్గొన్నారు. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పర్యావరణ విభాగం శస్త్రవేది ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. 


13వ రోజు ఉదయం దాదాపు 14 కిలోమీటర్ల మేరకు ఈ యాత్ర సాగుతుంది. కేరళలోని కుతియతొడు వద్ద ముగుస్తుంది. విరామం అనంతరం సాయంత్రం మళ్లీ యాత్ర ప్రారంభమవుతుంది. 


జైరామ్ రమేశ్ ఏం చెప్పారు ?

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ఇచ్చిన ట్వీట్‌లో, భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో ఇప్పటి వరకు 12 రోజుల్లో 255 కిలోమీటర్లు పూర్తయిందని తెలిపారు. మంగళవారం ఉదయం చేర్తల నుంచి కుతియతొడు వరకు పాదయాత్ర జరుగుతుందని, కొచ్చి జిల్లాలో రాత్రి బస చేస్తారని  తెలిపారు. 


ఎవరెవరు పాల్గొంటున్నారు ? 

ఈ యాత్రలో సీనియర్ కాంగ్రెస్ నేతలు కే మురళీధరన్, పవన్ ఖేరా, వీడీ సతీసన్, షనిమల్ ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు. దారి పొడవునా ప్రజలు పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ కోసం ఎదురు చూస్తున్నారు. ఆయనను ఒక్కసారి చూడాలని తహతహలాడుతున్నారు. ఆయన కూడా ప్రజలను కలుస్తూ, మాట్లాడుతున్నారు. 


ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ?

భారత్ జోడో యాత్ర సెప్టెంబరు 7న ప్రారంభమైంది. తమిళనాడులోని కన్యా కుమారి వద్ద నుంచి ఈ యాత్ర మొదలైంది. 150 రోజులపాటు జరిగే ఈ యాత్ర కశ్మీరు వరకు సాగుతుంది. మొత్తం మీద 3,570 కిలోమీటర్ల మేరకు ఈ యాత్ర జరుగుతుంది. ఈ యాత్ర సెప్టెంబరు 10 సాయంత్రం కేరళలో ప్రవేశించింది. కేరళలో 450 కిలోమీటర్ల మేరకు ఈ యాత్ర సాగుతుంది. 19 రోజులపాటు ఏడు జిల్లాల్లో రాహుల్ గాంధీ నడుస్తారు. అక్టోబరు 1న కర్ణాటకలో ప్రవేశిస్తారు. 


Updated Date - 2022-09-20T18:36:51+05:30 IST