పలాసలో 14 కిలోల వెండి లభ్యం

ABN , First Publish Date - 2021-03-07T05:14:41+05:30 IST

పలాసలో 14 కిలోల వెండి సామగ్రి పోలీసులకు పట్టుబడింది. మునిసిపల్‌ ఎన్నికల సందర్భంగా పలాస-కాశీబుగ్గలోని ప్రధాన రహదారి కూడలిలో పోలీసులు చెక్‌పోస్ట్‌ ఏర్పాటు చేశారు. కాశీబుగ్గ సీఐ శంకరరావు ఆధ్వర్యంలో విస్తృతంగా వాహనాలు తనిఖీ చేశారు.

పలాసలో 14 కిలోల వెండి లభ్యం
పోలీసులకు పట్టుబడిన వెండిని తూకం వేస్తున్న దృశ్యం

చెక్‌పోస్టు వద్ద పట్టుబడిన సామగ్రి
బిల్లులు లేకపోవడంతో సీజ్‌
పోలీసుల అదుపులో ముగ్గురు గుజరాత్‌ వాసులు
పలాస, మార్చి 6:
పలాసలో 14 కిలోల వెండి సామగ్రి పోలీసులకు పట్టుబడింది. మునిసిపల్‌ ఎన్నికల సందర్భంగా  పలాస-కాశీబుగ్గలోని ప్రధాన రహదారి కూడలిలో పోలీసులు చెక్‌పోస్ట్‌ ఏర్పాటు చేశారు. కాశీబుగ్గ సీఐ శంకరరావు ఆధ్వర్యంలో విస్తృతంగా వాహనాలు తనిఖీ చేశారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన వ్యాపారులు జస్వంత్‌సింగ్‌, దేవీలాల్‌సేన్‌, బ్రిజ్లారామ్‌ల వాహనంలో 14 కిలోల వెండి సామగ్రి పట్టుబడింది. సుమారు రూ.10 లక్షల విలువైన ఈ సామగ్రికి సంబంధించి పోలీసులు ఆరా తీశారు. అనకాపల్లి విజయలక్ష్మి జ్యూయలరీ దుకాణంలో ఈ సామగ్రి కొనుగోలు చేసి.. పలాసలో విక్రయించేందుకు తీసుకు వస్తున్నామని వ్యాపారులు తెలిపారు. కానీ, వాటికి సంబంధించిన బిల్లులు మాత్రం వారి వద్ద లేవు. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురినీ అదుపులోకి తీసుకుని.. వెండి సామగ్రి స్వాధీనం చేసుకున్నామని సీఐ శంకరరావు తెలిపారు. తహసీల్దార్‌ ఎల్‌.మధుసూధనరావు సమక్షంలో వెండి సామగ్రిని సీజ్‌ చేసి.. శ్రీకాకుళం ప్రభుత్వ ఖజానా కార్యాలయానికి తరలించామన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం సక్రమమైన బిల్లులు సమర్పిస్తేనే ఆ సామగ్రిని సంబంధిత వ్యక్తులకు అప్పగిస్తామని, లేకుంటే ప్రభుత్వానికి జమ చేస్తామని తెలిపారు.

Updated Date - 2021-03-07T05:14:41+05:30 IST