14వ ‘కాగ్‌’గా తొలి గిరిజన అధికారి

ABN , First Publish Date - 2020-08-09T09:03:25+05:30 IST

14వ కంప్ర్టోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)గా జమ్ము కశ్మీర్‌ మాజీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ గిరీష్‌ చంద్ర ముర్ము శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన

14వ ‘కాగ్‌’గా తొలి గిరిజన అధికారి

  • గిరీష్‌ చంద్ర ముర్ము చేత ప్రమాణం చేయించిన రాష్ట్రపతి


న్యూఢిల్లీ, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): 14వ కంప్ర్టోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)గా జమ్ము కశ్మీర్‌ మాజీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ గిరీష్‌ చంద్ర ముర్ము శనివారం  ప్రమాణ స్వీకారం చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన కాగ్‌ పదవిలో ఒక గిరిజన  అధికారిని నియమించడం ఇదే మొదటిసారి. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ  కార్యక్రమానికి హాజరయ్యారు. జమ్ము కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌  పదవికి రాజీనామా చేసిన 24 గంటల్లోనే ఆయనను కాగ్‌ గా నియమించడం గమనార్హం. ఒడిశాలోని సుందర్‌ఘర్‌కు చెందిన  1985 బ్యాచ్‌ గుజరాత్‌ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి  ముర్ము  ఉత్కళ్‌ యూనివర్సిటీలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌, బ్రిటన్‌లోని బ్రిమ్మింగ్‌ హామ్‌లో ఎంబీఏ  చేశారు.  ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడని గుర్తింపు పొందిన ముర్ము, ఆయన గుజరాత్‌  సీఎంగా ఉన్నప్పుడు ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు.


2002 అల్లర్లు, ఇష్రత్‌ జహాన్‌ ఎన్‌ కౌంటర్‌ కేసుల దర్యాప్తు సమయంలో ఆయన పేరు ముందుకు వచ్చింది. గుజరాత్‌ అల్లర్లను విచారించిన నానావతి కమిషన్‌లో ప్రభుత్వ  సాక్ష్యులను ఆయన ప్రభావితం చేశారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలకు ఆధారాలు లేవని సుప్రీం కోర్టు పేర్కొంది. ఇష్రత్‌ జహాన్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో కూడా సీబీఐ ముర్మును విచారించింది. ఈ కేసులో పోలీసు అధికారులను ప్రభావితం చేశారని ఆరోపణలు ఎదుర్కొన్నారు.  ఆ  ఆరోపణలు కూడా రుజువు కాలేదు. 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు న్యాయవ్యవహారాలకు సంబంధించి ముర్ము మోదీకి  సహాయం చేశారని  వార్తలు వచ్చాయి. మోదీ ప్రధాని అయిన వెంటనే ముర్మును ఢిల్లీకి తీసుకువచ్చారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ విభాగంలో ఆయన జాయింట్‌ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. గత  ఏడాది నవంబర్‌లో ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉండగా, అక్టోబర్‌లోనే ఆయనను జమ్ము కశ్మీర్‌  కేంద్రపాలిత ప్రాంతానికి తొలి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా నియమించారు.

Updated Date - 2020-08-09T09:03:25+05:30 IST