15 రోజుల్లోపే సగటు వర్షపాతం నమోదు!

Nov 16 2021 @ 21:20PM
పసుపు పంటలో చేరిన వర్షపు నీరు

రబీ సాగుకు చిగురిస్తున్న ఆశలు

ఖరీఫ్‌ పంటలకు కొంతమేర నష్టం

ఉదయగిరి రూరల్‌, నవంబరు 16: మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో నవంబరు మాసంలో 2021 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. అయితే అల్పపీడన ప్రభావంతో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు 15 రోజుల్లోపే 2400.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నియోజకవర్గంలో అత్యధికంగా జలదంకిలో 328 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 435.2 మిల్లీమీటర్లు, సీతారామపురంలో అత్యల్పంగా 188 మిల్లీమీటర్లకుగాను 99.6 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. నవంబరు మాసంలో ఇంకా 15 రోజులు ఉండడం, తుఫాన్‌ ప్రభావం ఉండడంతో మరింతగా వర్షాలు కురిసే అవకాశముందని వ్యవసాయాధికారులు అంటున్నారు.  

రబీ సాగుకు చిగురిస్తున్న ఆశలు

మెట్ట ప్రాంతంలో అధికశాతం మంది రైతులు వర్షాధారంపై ఆధారపడి పంటలు సాగు చేస్తారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవడంతో రబీ సీజన్‌లో పంటల సాగు ఆశాజనకంగా ఉంటుందని రైతులు అంటున్నారు. ఇప్పటికే వరి పంట సాగుకు రైతులు నారుమడులు సిద్ధం చేశారు. అలాగే వరికుంటపాడు, దుత్తలూరు, వింజమూరు, కొండాపురం, కలిగిరి మండలాల్లో శనగతోపాటు ఇతరత్రా పంటల సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. వ్యవసాయాధికారులు సైతం ముందస్తుగానే రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల సరఫరాకు చర్యలు చేపడుతున్నారు. 

ఖరీఫ్‌ పంటలకు కొంతమేర నష్టం

వర్షాల కారణంగా ఖరీఫ్‌ సీజన్‌లో సాగు చేసిన వరి, పసుపు, వేరుశనగు పంటలకు కొంతమేర నష్టం చేకూర్చింది. ఉదయగిరి సబ్‌ డివిజన్‌లో ఐదు మండలాల్లో 1372.5 ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. ఈ వర్షాలకు పంట నేలవాలడం, నీరు చేరడం, ఓదెలు తడవడం, తడిసిన ధాన్యాన్ని అరబెట్టుకొనేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 350 ఎకరాల్లో పసుపు పంట ప్రసుత్తం కొమ్ము ఏర్పడే దశలో ఉంది. ఈ దశలో చేలల్లో నీరు చేరడంతో తెగుళ్లు విజృంభించే అవకాశముంది. ఐదు మండలాల్లో 322.5 ఎకరాల్లో వేరుశనగ పంట సాగులో ఉంది. కురుస్తున్న వర్షాలకు ఓదెలు తడవడం, కాయలకు మొలకలు రావడం, సమయం వచ్చినా పీకలేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాల కారణంగా పంట నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతన్నలు వేడుకొంటున్నారు.  

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.