
వ్యాపార లావాదేవీలు ఆరంభం
నేడు ఢిల్లీకి ఎగుమతి చేయనున్న వ్యాపారి
విజయవాడ రూరల్, మార్చి 24 : నున్న మామిడి మార్కెట్కు కాయలు వచ్చేశాయి. రెడ్డిగూడెం మండలం అన్నేరావుపేట నుంచి సుమారు 15 టన్నుల బంగినపల్లి రకం మామిడికాయలు గురువారం రాత్రి మార్కెట్కు చేరాయి. నున్న మ్యాంగో మార్కెట్లో ప్రస్తుతం 63 మంది రైతులు వ్యాపారం చేస్తున్నారు. నున్న మ్యాంగో గ్రోయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దరియా హుస్సేన్ షాపును ప్రారంభించి, వ్యాపార లావాదేవీలను ఆరంభించారు. నాలుగు ట్రాక్టర్లలో పెద్ద సైజు బంగినపల్లి కాయలను తీసుకురాగా, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కాయలను దిగుమతి చేశారు. ఏటా ఇదే నెల మూడో వారంలో మ్యాంగో మార్కెట్లో వ్యాపార లావాదేవీలను ప్రారంభించి, ఉగాది నుంచి పూర్తిస్థాయిలో వ్యాపారం చేస్తుంటారు. ఈ ఏడాది తొలిగా నున్న మార్కెట్కు ఢిల్లీ నుంచి సేఠ్లు వచ్చారు. అయితే, మామిడి ధరలను ఇంకా నిర్ణయించలేదు. కాయ సైజు పెద్దదిగా ఉండటంతో టన్ను ధర రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు పలుకవచ్చని రైతులు అంచనా వేస్తున్నారు. సీజన్ ఆరంభంలో మామిడి ధరలు రూ.లక్ష పలికిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఈ ఏడాది కాపు తక్కువే
నున్న మార్కెట్కు ఏటా రెడ్డిగూడెం, చాట్రాయి, విస్సన్నపేట ప్రాంతాల నుంచే మామిడికాయలు వస్తుంటాయని మ్యాంగో గ్రోయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దరియా హుస్సేన్ చెప్పారు. జిల్లాలో ఈ ఏడాది కాపు తక్కువగా ఉండటంతో వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే ఉండొచ్చన్నారు. అన్నేరావుపేట రైతు నల్లిబోయిన శివ మాట్లాడుతూ, ఆశించిన రీతిలో మామిడి కాపు లేదన్నారు. ముందెత్తులో పూత బాగానే ఉందని, పొగమంచు, వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో పూత రాలిపోయిందన్నారు. దీంతో లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి కొనుగోలు చేసిన తోటల్లో నష్టం వచ్చే అవకాశం ఉందన్నారు. అన్ని పంటల మాదిరిగానే మామిడి పంటకు కూడా ప్రభుత్వమే ధర నిర్ణయించాలని ఆయన కోరారు.