Kuwait: విదేశీ రెసిడెన్సీ చట్టానికి సవరణలు.. ప్రవాసులకు 15 ఏళ్ల వరకు నివాసానికి అనుమతి!

ABN , First Publish Date - 2022-05-27T14:13:14+05:30 IST

కువైత్ పార్లమెంటరీ అంతర్గత, రక్షణ కమిటీ గురువారం విదేశీ రెసిడెన్సీ చట్ట సవరణలకు ఆమోదం తెలిపింది. ఈ సవరణలతో ఆ దేశంలో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల వరకు రెసిడెన్సీకి వీలు కలుగుతుంది.

Kuwait: విదేశీ రెసిడెన్సీ చట్టానికి సవరణలు.. ప్రవాసులకు 15 ఏళ్ల వరకు నివాసానికి అనుమతి!

కువైత్ సిటీ: కువైత్ పార్లమెంటరీ అంతర్గత, రక్షణ కమిటీ గురువారం విదేశీ రెసిడెన్సీ చట్ట సవరణలకు ఆమోదం తెలిపింది. ఈ సవరణలతో ఆ దేశంలో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల వరకు రెసిడెన్సీకి వీలు కలుగుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ యజమానులు, ప్రవాసులను పెళ్లాడిన కువైటీ మహిళల పిల్లలకు 10 ఏళ్ల ఇకామా(రెసిడెన్సీ పర్మిట్)కు కూడా మార్గం సుగమమవుతుంది. ఈ బిల్లును కమిటీ ఆమోదం కోసం నేషనల్ అసెంబ్లీకి పంపనుంది. అసెంబ్లీ ఆమోదం లభించగానే ప్రభుత్వం సంతకంతో వెంటనే ఇది అమలులోకి వస్తుంది. ఇక సాధారణంగా ఆ దేశంలో ప్రవాసులకు ఐదేళ్ల కాలపరిమితికి మాత్రమే నివాసానికి అనుమతి ఉంటుంది. ఆ తర్వాత ఇకామా గడువు ముగిసిన వెంటనే దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాల్సి ఉంటుంది. రెసిడెన్సీ రెన్యువల్‌కు కూడా అవకాశం ఉండదు. 


కాగా, కువైత్‌లో సాధారణంగా నివాసం ఉండే విదేశీయులందరూ ఆరు నెలల కంటే ఎక్కువ కాలం దేశం వెలుపల ఉండకూడదు. లేకుంటే రెసిడెన్సీ రద్దు చేయబడుతుంది. అయితే, పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ యజమానులు, కువైటీ మహిళల పిల్లలకు దీని నుంచి మినహాయింపు ఉంటుంది. అలాగే గృహా కార్మికులు కూడా నాలుగు నెలలకు మించి దేశం బయట ఉండడానికి వీలు లేదు. లేనిపక్షంలో వారి రెసిడెన్సీ చెల్లదు. ఇక తాజా బిల్లు ప్రకారం పెట్టుబడిదారులు 15 సంవత్సరాల రెసిడెన్సీని పొందేందుకు కొన్ని షరతులను క్యాబినెట్ నిర్దేశించినట్లు సమాచారం. వీటిలో ప్రధానంగా పెట్టుబడి మొత్తం ఎంత ఉండాలనే విషయాన్ని పొందుపరచడం జరిగింది. ఇదిలాఉంటే.. కువైత్ తీసుకున్న తాజా నిర్ణయం పట్ల వలసదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-05-27T14:13:14+05:30 IST