ప్రతి నియోజకవర్గం నుంచి 1500 మందికి దళితబంధు

ABN , First Publish Date - 2022-06-28T05:29:46+05:30 IST

ప్రతి నియోజకవర్గం నుంచి 1500 మందికి దళితబంధు అందజేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

ప్రతి నియోజకవర్గం నుంచి 1500 మందికి దళితబంధు
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి గంగుల కమలాకర్‌

- నేటి నుంచి 10 రోజులపాటు లబ్ధిదారుల ఎంపిక

- జూలై 11న  జాబితా ప్రదర్శన

- మంత్రి గంగుల కమలాకర్‌

కరీంనగర్‌, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రతి నియోజకవర్గం నుంచి 1500 మందికి దళితబంధు అందజేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కలెక్టర్‌ అధ్యక్షతన దళితబంధు, డబుల్‌ బెడ్‌రూం, మిషన్‌ భగీరథ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దళితబంధు పథకంతో భవిష్యత్‌ తరాలు ఉన్నతవర్గాలకు ధీటుగా ఎదుగుతాయని అన్నారు. దళితులు వాహనాలు, డెయిరీ, పౌల్ర్టీ, కిరాణం షాపులకు, సెంట్రింగ్‌ యూనిట్లకు యజమానులు అయ్యారన్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి 13,359 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని, 10,202 మందికి యూనిట్లను గ్రౌండింగ్‌ చేశామన్నారు.  రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి 100 మంది దళితబంధు కింద లబ్ధిదారులను ఎంపిక చేశారు. రెండో విడతలో ప్రతి నియోజకవర్గం నుంచి 1500 మందిని దళితబంధు పథకం కింద ఎంపిక చేయనున్నామన్నారు. మంగళవారం నుంచి 10 రోజులపాటు మండల, జిల్లాస్థాయి కమిటీలు లబ్ధిదారుల ఎంపిక చేస్తాయని చెప్పారు. జూలై 11న  లబ్ధిదారుల జాబితా ప్రదర్శించనున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లాలో దళితబంధు పథకాన్ని పారదర్శకంగా, విజయవంతంగా అమలు చేస్తున్నందుకు కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ను మంత్రి అభినందించారు. 


ఫ డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పథకాన్ని సమీక్షిస్తూ హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 3,000, కరీంనగర్‌లో 1,400, మానకొండూర్‌లో 891, చొప్పదండి నియోజకవర్గంలో 707 డబుల్‌ బెడ్‌రూం గృహాలు మంజూరు కాగా 789 నిర్మాణాలు పూర్తయినట్లు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ కార్యాలయంలో జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి సమావేశం ఉన్నందున జిల్లాలో అసంపూర్తిగా ఉన్న రోడ్లను పూర్తి చేసేందుకు నిధుల గురించి నివేదిక సమర్పించాలని మంత్రి ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. 


ఫ జడ్పీ చైర్‌పర్సన్‌ కనమల్ల విజయ మాట్లాడుతూ దళితబంధు పథకం కింద డెయిరీ యూనిట్ల లబ్దిదారుల కోసం గేదెలను తమిళనాడు, ఆంధ్రా నుంచి తీసుకొని రావాలన్నారు. 


ఫ మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ మాట్లాడుతూ రామకృష్ణా కాలనీలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను లబ్దిదారులను ఇవ్వాలని కోరారు. 


ఫ చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ మాట్లాడుతూ నియోజకవర్గానికి 707 డబుల్‌బెడ్‌రూంలు మంజూరయ్యాయని, వాటి నిర్మాణాలను పూర్తి చేయాలని, ఇంకా మిగిలి ఉన్న పనులను పూర్తి చేసి గృహాలను లబ్దిదారులకు అందజేయాలన్నారు. గంగాధర ఎక్స్‌రోడ్‌ వద్ద ఆర్‌అండ్‌బి రోడ్లు బాగు చేయాలని అన్నారు. 


ఫ హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీశ్‌బాబు మాట్లాడుతూ సైదాపూర్‌, చిగురుమామిడి మండలాల్లో డబుల్‌ బెడ్‌రూంలు 247 మంజూరుకాగా 243 పూర్తయ్యాయన్నారు. కోర్టు కేసుల వల్ల నాలుగు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. సైదాపూర్‌ హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలన్నారు. 


ఫ ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన వారందరికీ దళితబంధు మంజూరు చేయాలని అన్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో మూడు వేల డబుల్‌ బెడ్‌రూంలు మంజూరు కాగా హుజూరాబాద్‌ అర్బన్‌లో 500, జమ్మికుంట అర్బన్‌లో 553, వీణవంక మండలంలో 59, ఇల్లంతకుంటలో 50 డబుల్‌ బెడ్‌రూం నిర్మాణాలు చేపట్టాల్సి ఉందన్నారు. 


ఫ కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ మాట్లాడుతూ హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టుగా 17,554 మంది లబ్దిదారులకు బ్యాంకు అకౌంట్లు ప్రారంభించామన్నారు. ఇప్పటి వరకు 10,202 మంది లబ్ధిదారుల యూనిట్లను గ్రౌండింగ్‌ చేశామని 3,357 మందికి యూనిట్లను గ్రౌండింగ్‌ చేయాల్సి ఉందన్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళితబంధు యూనిట్లను విజయవంతంగా గ్రౌండింగ్‌ చేసినందుకు కలెక్టర్‌ ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ సురేశ్‌ను అభినందించారు. సమావేశంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌  ఏనుగు రవీందర్‌ రెడ్డి, అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్‌, శ్యాంప్రసాద్‌లాల్‌, ఎస్సీ కారొప్రేషన్‌ ఈడీ సురేశ్‌, ఆర్‌అండ్‌బి ఎస్‌ఈ చందర్‌, ఈఈ సాంబశివరావు, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఈ, నెహ్ర యువకేంద్ర కో-ఆర్డినేటర్‌ రాంబాబు, మున్సిపల్‌ కమిషనర్‌ సేవా ఇస్లావత్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-28T05:29:46+05:30 IST