15న అన్నాడీఎంకే సర్వసభ్య మండలి సమావేశం

ABN , First Publish Date - 2022-05-08T13:30:09+05:30 IST

అన్నాడీఎంకే సర్వసభ్య మండలి సమావేశం ఈ నెల 15న వానగరంలో జరుగనుంది. అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికలు ఇటీవల పూర్తయ్యాయి. వీరిలో ఎక్కువమంది ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.

15న అన్నాడీఎంకే సర్వసభ్య మండలి సమావేశం

పెరంబూర్‌(చెన్నై): అన్నాడీఎంకే సర్వసభ్య మండలి సమావేశం ఈ నెల 15న వానగరంలో జరుగనుంది. అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికలు ఇటీవల పూర్తయ్యాయి. వీరిలో ఎక్కువమంది ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. పార్టీ నుంచి వైదొలగినవారి వల్ల, మృతిచెందిన నేతల వల్ల ఖాళీపడిన పదవులకు మాత్రం కొత్త వారిని ఎంపిక చేశారు. పార్టీ నిర్వహణ పరంగా 75 జిల్లాలకు కొత్త నిర్వాహకులు పదవీబాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల అనంతరం పార్టీ సర్వసభ్య మండలి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ విషయమై చర్చలు జరిపేందుకు ఈ నెల 10, 11 తేదీల్లో పార్టీ సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం, ఉప సమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలో సీనియర్‌ నేతలు సమావేశమవుతున్నారు. సాధారణంగా అన్నాడీఎంకే సర్వసభ్య మండలి సమావేశాలు మంచి ముహూర్తం రోజున నిర్వహించటం ఆనవాయితీ. ఆ మేరకు ఈ నెల 15వ తేదీ (ఆదివారం) నిండు పున్నమినాడు సర్వసభ్యమండలి, కార్యాచరణ మండలి సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ నెల 16 నుంచి కృష్ణపక్షం ప్రారంభమవుతుండడంతో 15 తర్వాత ఈ సమావేశాలు నిర్వహిస్తే సమంజసంగా ఉండదని ఎడప్పాడి, పన్నీర్‌సెల్వం భావిస్తున్నారు. వానగరంలోని శ్రీవారు వెంటకటాచలపతి ప్యాలెస్‌ కల్యాణమండపంలో నిర్వహించనున్న ఈ సమావేశంలో పార్టీ నేతలు ఎడప్పాడి, పన్నీర్‌సెల్వంకు మరిన్ని అధికారాలు కల్పించే దిశగా కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రజల ప్రధాన సమస్యలు, పార్టీ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, 2024 పార్లమెంటు ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసేలా వ్యూహరచనలు చేయడం తదితర అంశాలపై సమగ్రంగా చర్చలు జరుపనున్నారు. పార్టీలోని సీనియర్‌ నేతలను కీలకమైన పదవుల్లో నియమించేందుకు కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.  


Read more