ltrScrptTheme3

మంత్రాలతో రోగాలు నయమవుతాయని నమ్మిన వాళ్లతో.. ఓ డాక్టరమ్మ జర్నీ.. 16 ఏళ్లు వాళ్లతో కలిసిపోయి..

Sep 23 2021 @ 12:27PM

ఆంధ్రజ్యోతి(23-09-2021)

తాత యంత్రాలు కడితే... నేను మాత్రలు ఇచ్చేదాన్ని!

మారుమూల గ్రామం... నక్సలైట్ల ప్రభావం ఉన్న ప్రాంతం... చిమ్మ చీకట్లో  మెడికల్‌ కిట్‌ మోసుకొంటూ... కిలోమీటర్ల మేర నడుచుకొంటూ తండాల్లో వైద్యం అందించారు ఆమె. ఏ రోగం వచ్చినా మంత్రాలు తంత్రాలనే నమ్ముకొనే గిరిజనుల్లో చైతన్యం రగిలించి... వారిలో ఒకరిగా...పిలిస్తే పలికే డాక్టరమ్మగా దగ్గరయ్యారు. నిరుపమాన సేవలకు జాతీయ స్థాయి ‘ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌’ అవార్డు దక్కించుకున్న హనుమకొండ జిల్లా మల్లారం ఏఎన్‌ఎం మహమ్మద్‌ శుక్రా ప్రస్థానం ‘నవ్య’కు ప్రత్యేకం... 


‘‘సంపన్న కుటుంబంలో పుట్టిన ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ సేవలు వెలకట్టలేనివి. ఆమెను ‘లేడీ విత్‌ ది ల్యాంప్‌’ అంటారు. అంతటి గొప్ప వ్యక్తితో పోలిక కాదు కానీ... నా ఉద్యోగ జీవితంలో నేను కూడా ఎన్నో సవాళ్లు, సమస్యలు ఎదుర్కొన్నాను. ప్రస్తుతం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మల్లారం సబ్‌ సెంటర్‌లో హెల్త్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాను.


సిద్దిపేట జిల్లా జనగామ మాది. మా ఊళ్లో నాలుగో తరగతి వరకే చదువుకొనే అవకాశం ఉండేది. ఆ పైన చదవాలంటే మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అంతకపేటకు వెళ్లాలి. అది అంత సులభం కాదు. వాగు దాటి, గుట్ట ఎక్కి దిగాలి. అప్పట్లో ఆడపిల్లలను చదివించడమే ఎక్కువనుకొనేవారు. కనుక పక్క ఊరికి పంపించే అవకాశమే లేదు. ఇక నా చదువు నాలుగుతోనే ఆగిపోతుందనుకున్నాను. అయితే నాలుగో తరగతి పరీక్షల అనంతరం మా బాబాయి షేక్‌ అలీ మా ఇంటికి వచ్చారు. ఆయన కరీంనగర్‌లో ఉద్యోగం చేసేవారు. చదువుపై నా ఆసక్తిని గమనించిన ఆయన ‘మనమ్మాయిని కరీంనగర్‌లోని బాలసదన్‌లో చదివిద్దాం. మా ఇల్లు కూడా ఆ పక్కనే. పాప బాగోగులు నేను చూసుకొంటా’నని అమ్మా నాన్నలను ఒప్పించారు. ఆయన చొరవతో పదో తరగతి వరకు బాలసదన్‌లో చదివాను. 

పది అవగానే పెళ్లి... 

ఇలా పదో తరగతి అయిందో లేదో... ఇంట్లో వాళ్లు నాకు పెళ్లి చేసేశారు. నా భర్త రషీద్‌ అప్పుడు ఐటీఐ చదువుతున్నాడు. కుటుంబ పోషణ కోసం నేను వ్యవసాయ కూలీగా మారాను. ఒక రోజు రోడ్డు మీద వెళుతుంటే... బాలసదన్‌లోని ఓ మహిళా అధికారి నన్ను గమనించారు. కూలీ పని చేస్తున్నాని తెలుసుకుని ఆమె బాధపడ్డారు. అంగన్‌వాడీ టీచర్‌గా ఉద్యోగం ఇప్పించారు. అలా గోపాల్‌పూర్‌ గ్రామంలో ఐదేళ్లు అంగన్‌వాడీ టీచర్‌గా చేశాను. ఆ తరువాత జగిత్యాలలో మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ కోర్స్‌ గురించి తెలుసుకుని అందులో చేరాను.  


రామవరంలో పోస్టింగ్‌... 

రెండేళ్ల కోర్సు పూర్తయ్యాక 1993లో అప్పటి కరీంనగర్‌, మెదక్‌, వరంగల్‌ జిల్లాల సరిహద్దు గ్రామం రామవరం సబ్‌ సెంటర్‌లో ఉద్యోగం వచ్చింది. నా పరిధిలో అత్యధికం లంబాడా తండాలే. ఎక్కడికి వెళ్లాలన్నా కాలి నడకే మార్గం. మారుమూల ప్రాంతం కావడంతో నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉండేది. రాత్రి... పగలు లేదు... మెడికల్‌ కిట్‌ పట్టుకుని కిలోమీటర్ల మేర నడుస్తుంటే నరకం కనిపించేది. అంత కష్టపడి తండాకు వెళితే ‘మీ వైద్యం మాకు వద్దు. వెళ్లిపోమ’నేవారు. ఎంత తీవ్ర జ్వరం వచ్చినా, విరేచనాలైనా మంత్రాలు, తంత్రాలకే ప్రాధాన్యమిచ్చేవారు. విచిత్రమేమంటే... వారికి వైద్యం చేసేది మా తాతే. మా అమ్మమ్మవాళ్ల ఊరే ఈ రామవరం. తాత వాళ్లకు తెలుసు కాబట్టి నన్ను గౌరవంగానే చూసేవారు. కాకపోతే వైద్యం చేయించుకొనేవారు కాదు. 


తాతతో వాదులాట... 

తండావాసులు ఎంతకీ మందులు వేసుకోకపోవడంతో ‘మంత్రాలకు రోగాలు నయమవుతాయా తాతా! వాళ్లను ట్యాబ్లెట్లు వేసుకోనివ్వు’ అని వాదించేదాన్ని. ‘తరతరాలుగా ఈ వైద్యం చేస్తున్నాను. ఇప్పుడు నువ్వొచ్చి మానేయమంటే ఎలా? నన్ను నమ్ముకున్నవాళ్లు ఏమైపోతారు’ అనేవాడు తాత. లంబాడాలు నేను ఎంత చెప్పినా వినేవారు కాదు. దీంతో ‘నీ వైద్యం నువ్వు చేసుకో. అయితే నా గోలీలు కూడా వాడమని చెప్పు’ అని తాతతో ఒప్పందం చేసుకున్నా. అందుకు ఆయన సమ్మతించాడు. రోగం వచ్చినప్పుడు గిరిజనులు నేనిచ్చే మందులు వాడడం మొదలుపెట్టారు. క్రమంగా జబ్బులు తగ్గుతూ వచ్చాయి. దీంతో ఒకప్పుడు నన్ను సందేహంగా చూసినవారు ఆ తరువాత వారిలో ఒకరిగా భావించారు. 


చీకట్లు చీల్చుకొంటూ... 

లంబాడా తండాల్లో పురుటి నొప్పులు వచ్చాయని కబురు వస్తే చాలు... హడావుడిగా పరిగెత్తేదాన్ని. అర్ధరాత్రి అయినా సరే... గ్రామ సుంకరి (గ్రామ సేవకుడు)ని తీసుకొని ఆ గ్రామాలకు బయలుదేరేదాన్ని. ఎనిమిది నుంచి  పది కిలోమీటర్లు కటిక చీకట్లో ప్రయాణం. సుంకరి లాంతరు పట్టుకొని ముందు నడుస్తుంటే ఆ వెలుతురులో ఆదరబాదర వెళ్లాలి. ఆ దారుల్లో రాళ్లు రప్పలు ఎక్కువ. చెప్పులు వేసుకొని నడవడం కష్టం. దీంతో చెప్పులు చేత పట్టుకుని నడిచేదాన్ని. ఇప్పటిలా కాకుండా అప్పుడు కూర్చోబెట్టే ప్రసవం చేసేవారు.


కొడవలితో బొడ్డు తాడు కోసేవాళ్లు. శిక్షణలో నేను నేర్చుకున్న దానికి... అక్కడ వారు అనుసరిస్తున్న దానికి... ఎంతో వ్యత్యాసం. వాళ్లకి నిదానంగా విషయాలు వివరించి, అవగాహన కలిగిస్తూ చాలా మార్పు తేగలిగాను. ఏదిఏమైనా నాడు గిరిజనుల ఆహారపు అలవాట్లు ఎంతో ఆరోగ్యకరంగా ఉండేవి. జొన్న రొట్టెలు, ఆకకూరలు, ఉలవచారు వంటి పోషకాహారం తినేవారు. అయితే ఆధునికత ఇప్పుడు వారి జీవన విధానాన్ని కూడా మార్చేసింది. 


పదహారేళ్ల అనుబంధం... 

రామవరం, అక్కడి ప్రజలతో నాది పదహారేళ్ల అనుబంధం. వాళ్లకు మరింత దగ్గరవాలనే ఆలోచనతో లంబాడా భాష కూడా నేర్చుకున్నా. బంజారా సంస్కృతిలోని పండుగలు, నృత్యాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. వాళ్లతో కలిసి మేము కూడా నృత్యాలు చేసేవాళ్లం. కష్టంలో భాగం పంచుకొనేవాళ్లం. ఆ తండాల్లోని ప్రతి కుటుంబంలో నేను ఒక సభ్యురాలినయ్యాను. గ్రామానికి దూరంగా కొన్ని నిరుపేద కుటుంబాలుండేవి. ఆ కుటుంబాల్లోని మహిళలు రక్తహీనతతో బలహీనంగా ఉండేవారు. ఒక్కొక్కరికీ పది మంది సంతానం. అలాంటివారిని ఒప్పించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించాను. వారిలో యాచకవృత్తి చేసేవారిని మాన్పించి పనులకు పంపాను. నేటికీ వారు నన్ను గుర్తుపెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది. 


అదే నాకు సంతృప్తి... 

నేను ఏ రోజూ అవార్డుల కోసం పని చేయలేదు. నా ఈ ప్రయాణంలో ఎంతో మందితో మాటలు పడ్డాను. ఆ తరువాత వారి ఆప్యాయత పొందగలిగాను. ముఖ్యంగా గిరిజనుల్లో మూఢనమ్మకాలు పోగొట్టి చైతన్యం తేవడానికి నావంతు కృషి చేశాను. అది సత్ఫలితాలనిచ్చింది. అదే నాకు సంతృప్తినిస్తోంది. ఇన్నేళ్ల నా శ్రమను గుర్తించి ‘నైటింగేల్‌’ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. 


వాళ్లూ ప్రభుత్వ ఉద్యోగులే... 

మా అత్తగారి ఊరు భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి. నా భర్త మహమ్మద్‌ రషీద్‌ పట్టుపరిశ్రమ శాఖలో అధికారి. మాకు ఇద్దరు పిల్లలు. మా అబ్బాయి మహమ్మద్‌ స్టాలిన్‌ బేగ్‌, కూతురు హసీనా బేగం... ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే.’’ 


 2011, 2017, 2019 సంవత్సరాల్లో జిల్లా కలెక్టర్‌ల నుంచి ఉత్తమ ఉద్యోగిగా అవార్డు. 

 2017లో బాబూ జగ్జీవన్‌రామ్‌ అవార్డ్‌ (కేరళ), సావిత్రి బాయి ఫూలే అవార్డ్‌ (ఢిల్లీ). 

 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అవార్డ్‌. నర్సింగ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌, టీచర్స్‌ అసోసియేషన్‌ల నుంచి పురస్కారాలు. 


 చిలుముల్ల సుధాకర్‌, ఓరుగల్లు

 ఫొటోలు: వీరగోని హరీశ్‌ 


Follow Us on:

Health Latest newsమరిన్ని...

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.