క్యాన్సర్‌పై అవగాహన కోసం 1600 కి.మీ సైకిల్‌ తొక్కిన యువకుడు

ABN , First Publish Date - 2022-02-13T15:20:52+05:30 IST

క్యాన్సర్‌ మహమ్మారిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చెన్నైకి చెందిన ఓ యువకుడు 1600 కి.మీ మేర సైకిల్‌ తొక్కాడు. కేవలం 8 రోజుల్లో చెన్నై నుంచి వైజాగ్‌ వెళ్లి, మళ్లీ అక్కడి నుంచి చెన్నై తిరిగొచ్చాడు. క్యాన్సర్‌ పట్ల

క్యాన్సర్‌పై అవగాహన కోసం 1600 కి.మీ సైకిల్‌ తొక్కిన యువకుడు

చెన్నై: క్యాన్సర్‌ మహమ్మారిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చెన్నైకి చెందిన ఓ యువకుడు 1600 కి.మీ మేర సైకిల్‌ తొక్కాడు. కేవలం 8 రోజుల్లో చెన్నై నుంచి వైజాగ్‌ వెళ్లి, మళ్లీ అక్కడి నుంచి చెన్నై తిరిగొచ్చాడు. క్యాన్సర్‌ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్న అతడి పట్టుదల, ధైర్యాన్ని నగరానికి చెందిన ప్రముఖులు అభినందించారు. ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని చెన్నైకి చెందిన శివ రవి ఈ నెల 4వ తేదీ చెన్నైలో సైకిల్‌పై బయలుదేరి రోజుకు 200 కి.మీ చొప్పున తొక్కుతూ నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, కాకినాడ మీదుగా విశాఖపట్నం చేరుకున్నాడు. మళ్లీ అక్కడి నుంచి బయలుదేరి శుక్రవారం సాయంత్రానికి చెన్నై చేరుకున్నాడు. కాగా అతడికి సంఘీభావం తెలుపుతూ చెన్నైకి చెందిన జె.అశ్వని శుక్రవారం నెల్లూరు నుంచి చెన్నైకి సైకిల్‌ తొక్కుతూ గమ్యం చేరుకున్నాడు. వీరిని ‘సంకల్ప్‌ బ్యూటిఫుల్‌ వరల్డ్‌’ డైరెక్టర్‌ డాక్టర్‌ వందనా మహాజన్‌, టెక్స్‌టన్‌ బయో సైన్స్‌ చైర్మన్‌ కృష్ణమాచారి, శక్తి ఫౌండేషన్‌ సహ వ్యవస్థాపకురాలు ఛాయాదేవి, రిటైర్డ్‌ డీఎస్పీ డాక్టర్‌ ఏఈ జగదీశన్‌, డాక్టర్‌ సంతోష్‌ తదితరులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా శివ రవి మాట్లాడుతూ.. తన అమ్మమ్మ 17 సంవత్సరాల క్రితం క్యాన్సర్‌తో మరణించారని, దురదృష్టవశాత్తూ ఆమెకు క్యాన్సర్‌ అన్న విషయాన్ని చాలా చివరి దశలో కనుగొనబడిందని తెలిపాడు. అందుకే తమ కుటుంబంలో జరిగిన నష్టం మరెవరికీ జరుగకూడదని, క్యాన్సర్‌పై ప్రతి ఒక్కరికీ అవగాహన వుండాలన్న ఉద్దేశంతో తాను ఈ సైకిల్‌ యాత్ర చేపట్టానని వివరించాడు. క్యాన్సర్‌ను ప్రాథమిక దశలో గుర్తిస్తే నయమవుతుందని, దీనిని విజయవంతంగా అధిగమించిన వ్యక్తులు తనకెంతోమంది తెలుసని శివరవి పేర్కొన్నాడు. 

Updated Date - 2022-02-13T15:20:52+05:30 IST