16 నుంచి సీఎం గ్రామబస కార్యక్రమాలు

ABN , First Publish Date - 2021-10-12T17:52:18+05:30 IST

రాష్ట్రంలో ముఖ్యమంత్రి గ్రామబస(గ్రామ వాస్తవ్య) కార్యక్రమానికి మళ్లీ మోక్షం లభించబోతున్నది. గతంలో హెచ్‌డీ కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన గ్రామవాస్తవ్యకు విశేష

16 నుంచి సీఎం గ్రామబస కార్యక్రమాలు

బెంగళూరు: రాష్ట్రంలో ముఖ్యమంత్రి గ్రామబస(గ్రామ వాస్తవ్య) కార్యక్రమానికి మళ్లీ మోక్షం లభించబోతున్నది. గతంలో హెచ్‌డీ కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన గ్రామవాస్తవ్యకు విశేష ఆదరణ లభించిన సంగతి విదితమే. పాలనను ఆయన గ్రామాల చెంతకు తీసుకెళ్లడంలో కృతకృత్యులయ్యారు. ఈ కార్యక్రమాన్ని తిరిగి కొనసాగించాలని ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై కూడా నిర్ణయించుకున్నారు. బొమ్మై సీఎం పగ్గాలు చేపట్టాక తొలిసారి ఈ నెల 16న ‘గ్రామ వాస్తవ్య’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్యే  రేణుకాచార్య దావణగెరెలో సోమవారం మీడియాకు ఈ విషయం వెల్లడించారు. దావణగెరె జిల్లాతో సీఎం తన గ్రామవాస్తవ్యను ప్రారంభించబోతున్నారన్నారు. జిల్లాలోని హొన్నాళి తాలూకా కుందూరు గ్రామంలో సీఎం బస చేయనున్నారు. 16న మధ్యాహ్నం 3 గంటలకు గ్రామానికి చేరుకుని ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తారని అనంతరం గ్రామ పెద్దలతో సమావేశమవుతారని చెప్పారు. రాత్రి గ్రామంలోనే సీఎం బస చేస్తారన్నారు. కొవిడ్‌ పూర్తిగా తగ్గిన తర్వాత సీఎం ప్రతి నెలా ఒక గ్రామంలో బస చేస్తారని ఇందుకు సంబంధించిన కార్యక్రమాన్ని ఖరారు చేస్తున్నామన్నారు. గ్రామంలోని ఒక రైతు ఇంట బసచేయాలని సీఎం ఆలోచిస్తున్నారని, భద్రతను కూడా దృష్టిలో ఉంచుకుని అధికారులు తుది నిర్ణయం తీసుకుంటారని రేణుకాచార్య వివరించారు. 


Updated Date - 2021-10-12T17:52:18+05:30 IST