ఉమ్మడి జిల్లాలో కొవిడ్‌తో 17 మంది మృతి

ABN , First Publish Date - 2021-05-11T05:21:25+05:30 IST

సిద్దిపేట జిల్లాలో సోమవారం కరోనా బారినపడి 15 మంది మృతి చెందినట్టు సమాచారం. సిద్దిపేట జీజీహెచ్‌లో 8 మంది, భరత్‌నగర్‌కు చెందిన ఇద్దరు, శ్రీనగర్‌కాలనీకి చెందిన ఒకరు, కొమురవెల్లి మండలంలో ఓ సర్పంచ్‌, చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఒకరు, కొండపాక మండలం జప్తినాచారం గ్రామానిక చెందిన ఒకరు మరణించారు. కరోనా కేసులు, మృతుల వివరాలను వైద్యాధికారులు వెల్లడించలేదు.

ఉమ్మడి జిల్లాలో కొవిడ్‌తో 17 మంది మృతి

సిద్దిపేట, మే 10: సిద్దిపేట జిల్లాలో సోమవారం కరోనా బారినపడి 15 మంది మృతి చెందినట్టు సమాచారం. సిద్దిపేట జీజీహెచ్‌లో 8 మంది, భరత్‌నగర్‌కు చెందిన ఇద్దరు, శ్రీనగర్‌కాలనీకి చెందిన ఒకరు, కొమురవెల్లి మండలంలో ఓ సర్పంచ్‌, చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఒకరు, కొండపాక మండలం జప్తినాచారం గ్రామానిక చెందిన ఒకరు మరణించారు. కరోనా కేసులు, మృతుల వివరాలను వైద్యాధికారులు వెల్లడించలేదు. 


పక్షం రోజుల్లో ఒకే కుటుంబంలో నలుగురు మృతి

కొండపాక, మే 10: కుటుంబాలను కరోనా కకావికలం చేస్తున్నది. కొండపాక మండలం జప్తినాచారం గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో నలుగురు కరోనాతో మృతిచెందారు. గ్రామానికి చెందిన కిరాణా వ్యాపారి కుటుంబానికి 15 రోజుల క్రితం కరోనా సోకింది. చిన్నకోడూరు ఉపాధిహామీ కార్యాలయంలో పనిచేస్తున్న ఆయన పెద్ద కొడుకు ఏప్రిల్‌ 25న కొంపల్లిలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందారు. భార్య మరో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మూడురోజుల అనంతరం చిన్నకొడుకు సిద్దిపేట ఆసుత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 15 రోజులుగా కరోనాతో పోరాడిన కుటుంబ యజమాని ఆదివారం రాత్రి మృతిచెందారు. కుటుంబం మొత్తం కరోనాతో మృత్యువాతపడడంతో గ్రామంలో విషాధం నెలకొన్నది.


చేర్యాల పట్టణంలో మహిళ..

చేర్యాల, మే 10: చేర్యాల పట్టణంలో కరోనాతో ఓ మహిళ మృతి చెందారు. ఒకే కుటుంబంలో ఇటీవల ముగ్గురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వీరిలో ఓ మహిళ అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో సోమవారం రాత్రి ఆమె మరణించారు. కొద్దిరోజుల క్రితమే అనారోగ్యంతో ఆమె భర్త మృతిచెందారు. 


ఐదు రోజుల్లో తల్లి, కొడుకు..

మెదక్‌ అర్బన్‌, మే 10: కరోనా ఎంతోమంది జీవితాల్లో విషాదాన్ని నింపుతున్నది. మెదక్‌ జిల్లా కేంద్రంలో ఐదు రోజుల్లో తల్లి, కొడుకు కరోనాతో మృతిచెందడం విషాదాన్ని నింపింది. పట్టణంలోని బ్రాహ్మణవీధికి చెందిన తల్లి (72), కొడుకు (52) పది రోజుల నుంచి కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న కౌన్సిలర్‌ అంబులెన్స్‌లో తల్లి, కొడుకులను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి టెస్టులు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అక్కడే కొవిడ్‌వార్డులో చికిత్స పొందుతూ ఈ నెల 5న కొడుకు మృతిచెందగా, ఆదివారం తల్లి తుదిశ్వాస విడిచారు. 


కరోనాతో హక్కుల పరిరక్షణ సమితి నాయకుడు..

నారాయణఖేడ్‌, మే 10: జిల్లా ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు (55) కరోనాతో మృతిచెందారు. వారం క్రితం కరోనా నిర్ధారణ కావడంతో ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతిచెందారు. 


కరోనా బాధితుడి ఆత్మహత్య

రామాయంపేట, మే 10: కరోనా బారినపడిన ఓ వ్యక్తి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం రామాయంపేటలో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన ఓ చిరువ్యాపారి(48)కి ఈ నెల 7న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అవివాహితుడైన ఆయన ఒంటరిగా ఉంటున్నారు. అస్వస్థతకు గురైనా బాగోగులు చూసేవారులేరని మనస్తాపంతో పాండచెరువు సమీపంలో చెట్టుకు ఉరివేసుకున్నారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ రాజేష్‌ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మునిసిపల్‌ సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించారు. రామాయంపేట మండల పరిధిలో వారం వ్యవధిలో ఇద్దరు కరోనా బాధితులు ఆత్మహత్య చేసుకున్నారు.

Updated Date - 2021-05-11T05:21:25+05:30 IST